swachh bharath
-
ఎటు చూసినా చెత్తే..!
సాక్షి, హైదరాబాద్: పారిశుధ్యానికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. స్వచ్ఛభారత్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ మేరకు చర్యలు చేపట్టి అమలు చేస్తోంది. నిత్యం లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రైళ్ల విషయంలోనూ ‘స్వచ్ఛతా పక్వారా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రయాణికుల్లోనే మార్పు రావటం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని పక్షం రోజుల పాటు రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాలు, వర్క్‌షాపులు, రైల్వే ఉద్యోగులు నివాసం ఉండే కాలనీల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. పక్షం రోజుల్లో ఏకంగా 544 టన్నుల చెత్త పోగవడం చూసి అధికారులు నివ్వెరపోయారు. పారిశుధ్యంపై రైల్వే ప్రత్యేక దృష్టి గత కొంతకాలంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో చాలా మార్పులు సంతరించుకుంటున్నాయి. అధునాతన రైళ్లతో పాటు స్టేషన్లలో అన్నిరకాల వసతులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయి. రైళ్లు, స్టేషన్లు పరిశుభ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా ఆదేశించారు. అంతేగాక స్వయంగా చీపురు పట్టి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో రైల్వే అధికారులూ అప్రమత్తంగా ఉంటున్నారు. స్టేషన్లను శుభ్రపరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించి క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చూస్తున్నారు. రైళ్లలో కూడా శుభ్రపరిచే సిబ్బందిని ఉంచి, ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రాకముందే క్లీన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి మాత్రం దీనికి ఎలాంటి సహకారం లభించడం లేదని రైళ్లు, స్టేషన్లలో దర్శనమిచ్చే చెత్త స్పష్టం చేస్తోంది. పట్టించుకోని ప్రయాణికులు కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, మిగిలిపోయిన తినుబండారాలు, కాఫీ/టీ కప్పులు, భోజన ప్యాకెట్లు, విస్తరాకులు.. ఇలాంటి వాటన్నిటినీ ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ విసిరేస్తున్నారు. దీంతో రైళ్లు, రైల్వే స్టేషన్లు, పరిసరాలు చెత్తతో నిండిపోతున్నాయి. సిబ్బంది ఎన్నిసార్లు శుభ్రం చేసినా మళ్లీ చెత్త పోగవుతోంది. ఇటీవల పక్షం రోజుల పాటు 639 రైల్వే స్టేషన్లు, 180 రైళ్లలో స్వచ్ఛతా పక్వారా కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో చెత్త వేసేందుకు ప్రత్యేకంగా డస్ట్బిన్లు ఉన్నా, విచ్చలవిడిగా చెత్త విసురుతున్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 544 టన్నుల చెత్తను పోగేసిన అధికారులు.. చెత్తను విసురుతూ పట్టుబడ్డ 857 మంది నుంచి రూ.4.5 లక్షల జరిమానా వసూలు చేశారు. 21,685 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. పోగైన చెత్తలో 42 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలుండటం విశేషం. ఇక రైల్వే ప్రాంగణాల్లో 436 టన్నుల తుక్కును సేకరించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. 3,510 కి.మీ. నిడివిగల ట్రాక్‌ను కూడా ఈ సందర్భంగా శుభ్రం చేశారు. అయితే స్వచ్ఛతా పక్వారా పేరుతో ఎప్పుడో ఓసారి నిర్వహించే కార్యక్రమాలతో ఫలితం అంతగా ఉండదని, రైళ్లు, రైల్వే స్టేషన్లలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ చెత్త వేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం ద్వారా మార్పు తెచ్చేందుకు ప్రయతి్నంచాలనే సూచనలు వస్తున్నాయి. -
మాతృభూమిని మాత్రం కష్టపెట్టొద్దు : సల్మాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏది చేసినా సంచలనమే. సినిమాలు చేసినా.. రియాల్టీ షోలు చేసినా.. చివరికి సోషల్ మీడియాలో ట్వీట్ చేసినా సరే. మొన్నటికి మొన్నా హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్ చాలెంజ్ స్వీకరించి సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. తాజాగా సల్మాన్ దీనికి సంబంధించిన ఓ ట్వీట్ చేశాడు .ఇప్పుడు ఇది కూడా వైరల్ అవుతోంది. భారతదేశం పరిశుభ్రంగా ఉంటే.. మనం ఫిట్‌గా ఉంటాం.. మన ఫిట్‌గా ఉంటే.. దేశం బాగుంటుంది.. అయితే ఇప్పుడు ఎవరి ఏది చేయాలనుకుంటున్నారో అది చేయండి. కానీ మాతృభూమిని మాత్రం కష్టపెట్టొద్దు అంటూ సల్మాన్ వార్నింగ్‌లా ఓ ట్వీట్ చేశాడు. సల్మాన్ ప్రస్తుతం భరత్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. Swachh Bharat toh hum fit... hum fit toh India fit.... then u can do whatever u want to do man.. but don't trouble your motherland . pic.twitter.com/JaODFDJVs0 — Salman Khan (@BeingSalmanKhan) August 13, 2018 చదవండి : సల్మాన్... 52 ఏళ్ల వయస్సులోనూ.. -
టాయిలెట్ ఉంటేనే జీతం ఇస్తాం
సీతాపూర్, యూపీ : మీరు యూపీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగా...? అయితే మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా...? మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే మీకు నెల జీతం అందుతుంది. మరుగు దొడ్డి ఉన్నట్లు చెప్తే సరిపోదు...దానికి సంబంధించిన ఫోటోతోపాటు ప్రమాణ పత్రాన్ని ఇస్తేనే మీకు మీ నెల జీతం అందుతుందనే నూతన నిబంధనను తీసుకు వచ్చింది యూపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతొంది. ఈ ఫోటో యూపీకి చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భగవత్ ప్రసాద్‌ది. ఇది అతను తన ఇంటి టాయిలెట్లో ఒక స్టూలు మీద కూర్చుని దిగిన ఫోటో. ఫోటోతో పాటు ప్రమాణ పత్రంలో అతని ఆధార్ కార్టు నంబరు, కుటుంబ వివరాలు కూడా ఉన్నాయి. భగవత్ ప్రసాద్ ఇంట్లో మరుగుదొడ్డి ఉందనే దానికి నిదర్శనం ఈ ప్రమాణ పత్రం. ఈ ప్రమాణ పత్రాన్నిపంచాయితీ ఆఫీసులో ఇవ్వాలి. తర్వాతే అతనికి ఈ నెల జీతం అందుతుంది. ప్రధాని మోదీ 2014లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ పథకం అమలులో భాగంగా యూపీ ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం సీతాపూర్ డిస్ట్రిక్ట్ మాజిస్ట్రీట్ శీతల్ వర్మ సీనియర్ అధికారులకు ఒక నోటీసు జారీ చేసారు. మీ సిబ్బంది ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయా, ఉంటే వాటి ఫోటోలను తీసి జిల్లా పంచాయితీ రాజ్ అధికారులకు పంపిచమని, అలా చేసిన వారికి మాత్రమే జీతం ఇస్తామని ఆదేశించారు. ఈ విషయం గురించి శీతల్ వర్మ ’ప్రధాని మోదీ 2018, అక్టోబరు 2 నాటికి మన దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మార్చాలనే ఉద్ధేశంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానిలో భాగంగా ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మాణం తపప్పనిసరిని తెలిపారు. ప్రజలకు ఈ విషయం గురించి అవగాహన కల్పించాలంటే ముందు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లల్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలనే ఉద్ధేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాని తెలిపారు. ఈ నెల 27 నాటికి ఇంట్లో మరుగుదొడ్డి ఉన్నట్లు ఫోటో పంపించకపోతే వారికి ఈ నెల జీతం ఆపేస్తామన్నారు. అయితే చాలా మంది ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. -
స్వచ్ఛత వైపు అడుగు వేయండి
దిలావర్పూర్ : జిల్లాలోని ప్రతీ మండలం, గ్రామం స్వచ్ఛతవైపు అడుగు వేయాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. మండలంలోని న్యూలోలం గ్రామంలో అన్ని కుటుంబాలు మరుగుదొడ్డి నిర్మించుకుని జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారు. ఈనేపథ్యంలో గ్రామాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటిస్తూ శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ అతిథిగా హాజరై గ్రామస్తులను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి అక్టోబర్ 2వరకు సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా ప్రకటించేలా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 50 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులను సైతం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నట్ల తెలిపారు. మరుగుదొడ్లను నిర్మించుకోవడమే కాకుండా వాటిని వినియోగించాలన్నారు. జిల్లాలోని ప్రతీ గ్రామం స్వచ్ఛతపై దృష్టిసారిస్తే గ్రామాలన్నీ పారిశుధ్య గ్రామాలుగా మారి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందన్నారు. హైలెవల్ కెనాల్లో భూమి కోల్పోయిన న్యూలోలం గ్రామ రైతులకు వారం రోజుల్లో పరిహారం చెక్కులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల్లో స్థానికంగా ఎలాంటి అవకతవకలు ఏర్పడినా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను స్థానిక సర్పంచ్ డి.లింబాదేవి, స్వయం సహాయక మహిళా సంఘాల ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలోడీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జెడ్పీటిసి సభ్యురాలు ఆమ్గోత్ సుజాతమేర్వాన్, ఎంపీటీసీ సభ్యుడు సత్యం చంద్రకాంత్, ఎంపీడీఓ గంగాధర్, తహసీల్దార్ నర్సయ్య, ఏపీవో జగన్నాథ్, ఏపీఎం విజయలక్షి, ఓడీఎఫ్ ప్రత్యేకాధికారి దేవేందర్‌రెడ్డి , ఎంఈవో శంకర్, నాయకులు పాల్దె శ్రీనివాస్, ఒడ్నం కృష్ణ, స్వామిగౌడ్, బి.గంగన్నతోపాటు వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఉపాధి పనులను పరిశీలించిని కలెక్టర్ అనంతరం గ్రామ సమీపంలో సారంగాపూర్ మండలం బీరవెల్లి వెళ్లే మార్గంలో కొనసాగుతున్న ఉపాధి పనులను కలెక్టర్ పరిశీలించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు కూలీల సాయంతో గుంతలు తీసే పనులు చేపట్టారు. వీటిని పరిశీలించిన కలెక్టర్ అధికారులు, కూలీలకు పలు సూచనలు , సలహాలు అందజేశారు. -
మరుగేది..!
టేకులపల్లి : మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో బాలికలకు టాయిలెట్, మరుగుదొడ్లు లేక వారు నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయమై సంవత్సర కాలంలో పలుమార్లు సాక్షిలో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. సుమారు నాలుగు నెలల క్రితమే బాలికలకు టాయిలెట్, మరుగొడ్డి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. నిర్మాణం కూడా మొదలు పెట్టారు. నెల రోజుల్లోనే పూర్తి కావాల్సి ఉండగా నాలుగు నెలలు అవుతున్నా నేటికీ పూర్తి చేయకపోవడం గమనార్హం. రెండు నెలలుగా పనులు జరగడం లేదు. బాలికల పట్ల నిర్లక్ష్యం వీడి వెంటనే నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
‘చెత్త’శుద్ధి
జీవన కాలమ్ బస్సు కదులుతుంటే ఒకే ఒక్క సమస్య నా కళ్లకు కట్టింది. ఇన్ని లక్షల మంది నివసించే దేశంలో ‘చెత్త’ సమస్య కదా! అదీ జపాన్‌లో నేను మా మిత్రుడిని అడిగిన మొదటి ప్రశ్న. ఆయన నవ్వాడు: ‘‘అడగాల్సిన మొదటి ప్రశ్న ఇదే’’ అన్నాడు. జపాన్‌లో టోక్యో నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో నారిటా అనే ఊరిలో విమానాశ్రయం. అక్కడి నుంచి టోక్యోకి బస్సులో రెండు గంటల ప్రయాణం. మా మిత్రుడు తీసుకెళ్లాడు. దారి పొడుగునా ముప్పయ్ నలభై అంతస్తుల భవనాలు. లక్షలాది ఇళ్లు. జపాన్ చిన్న ద్వీపం. పురోగతిలో ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంది. ఏమిటి దీని గొప్పతనం? బస్సు కదులుతుంటే ఒకే ఒక్క సమస్య నా కళ్లకు కట్టింది. ఇన్ని లక్షల మంది నివసించే దేశంలో ‘చెత్త’ సమస్య కదా! అదీ జపాన్‌లో నేను మా మిత్రుడిని అడిగిన మొదటి ప్రశ్న. ఆయన నవ్వాడు: ‘‘అడగాల్సిన మొదటి ప్రశ్న ఇదే’’ అన్నాడు. జపాన్‌లో చెత్త చాలా విలువైన వస్తువు. మరో విలువైన వస్తువు– స్థలం– చిన్న దేశం కనుక. పాలకులు తాటిచెట్టుకీ, తాత పిలకకీ ముడివేశారు. ప్రతిచోటా రెండు రకాలైన చెత్తని వేయడానికి డబ్బాలుంటాయి. తడి చెత్త, పొడి చెత్త. పొడి చెత్తని కొన్ని రసాయనాలతో కలిపి ఇటుకలుగా చేస్తారు. దేశం చుట్టూ ఉన్న సముద్ర జలాలలో నింపి– స్థలాన్ని పెంచుకుంటారు. అలా పూడ్చిన స్థలం మీదే ఒసాకా విమానాశ్రయాన్ని నిర్మిం చారు. అంతేకాదు. 2020లో జరుగుతున్న ఒలింపిక్స్ స్టేడియం– కెంగో కుమాలోన స్టేడియంని ఇలాంటి స్థలం మీదే నిర్మించారు. మా మిత్రుడు– తెలుగు మిత్రుడు– కిళ్లీ వేసుకుని నడిరోడ్డు మీద తుపుక్కున ఉమ్మడం హక్కుగా భావించే తెలుగు మిత్రుడు– నేను తాగిన కూల్‌డ్రింక్ డబ్బాలో కొంచెం ఉండిపోయిందని దాన్ని పడేసే చెత్తబుట్టని వెతుక్కుంటూ కిలోమీటరు నడిచాడు! దేశంలో నేలబారు పౌరుడికి తన కర్తవ్యాన్ని వంటబట్టించిన దేశం ప్రపంచానికి మార్గదర్శి కాక ఏమౌతుంది? ఇప్పుడు మన చెత్తకథ. భారతదేశంలో–125 కోట్ల పైబడిన జనాభా ఉన్న దేశంలో–చెత్తకి కొద్దిరోజుల్లో సంవత్సరానికి ఢిల్లీ నగరమంత స్థలం కావలసి ఉంటుందట. ఈ విషయాన్ని శాస్త్ర, పర్యావరణ పరిరక్షక కేంద్రం ప్రకటించింది. మనది సమృద్ధిగా చెత్తని ఉత్పత్తి చేసే దేశం. చెత్తని గుట్టలు గుట్టలుగా పోయడం కార్పొరేషన్ల హక్కు. వాటి కాలుష్యం వర్ణనాతీతం. ఎవరికీ పట్టదు. ఈ మధ్యనే తడి చెత్త, పొడి చెత్త అంటున్నారు కాని, కేరళలో అళప్పుళ, గోవా రాష్ట్రాలు తప్ప ఎవరూ పట్టించుకోవడంలేదట. చెత్త మన హక్కు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే– అతి చిన్నదేశం స్వీడన్– అలా చెప్తే చాలామందికి తెలియదు. ప్రపంచానికి నోబెల్ బహుమతులని ఏటేటా ఇచ్చే, మన సౌకర్యాలకి ఓల్వో బస్సులని తయారుచేసే దేశం– చెత్తతో బయోగ్యాస్నీ, విద్యుచ్ఛక్తినీ, ఇంటి ఉష్ణోగ్రతలని పెంచే సాధనాలనీ తయారు చేసుకుంటోంది. ఎంత ముమ్మరంగా చేస్తోందంటే– వారి దేశంలో తయారయే చెత్త చాలక 980 లక్షల టన్నుల చెత్తని సాలీనా దిగుమతి చేసుకుంటోందట. ఇది అనూహ్యమైన విషయం. దిగుమతి అవుతున్న చెత్త ఫొటో చూడండి. ఇందులో మళ్లీ ఇళ్లలో తయారయే చెత్తని– జపాన్‌లాగే సముద్రాన్ని నింపి స్థలాన్ని పెంచుకునే కార్యానికి వినియోగిస్తున్నారు. 2011 నుంచి ఇలా సముద్ర స్థలాన్ని కలుపుకోవడానికి ప్రతీ ఇంటిలో తయారవుతున్న చెత్తలో ఒక శాతాన్ని వినియోగిస్తున్నారట. 2012లో ఈ చెత్త వినియోగ విభాగం సలహాదారుడు కాటన్నా ఓస్ట్లుండ్– మా దేశం మాకు కావలసినంత చెత్తని ఇవ్వడం లేదని వాపోయాడు. నార్వే, ఇంగ్లండ్, ఇటలీ, రుమేనియా, బల్గేరియాల నుంచి చెత్తని వీరు దిగుమతి చేసుకుంటున్నారు. మనం స్వీడన్ దాకా వెళ్లనక్కరలేదు. జపాన్‌లో బతుకుతున్న తెలుగువారిని దిగుమతి చేసుకుని– ఆ దేశపు క్రమశిక్షణని ఎలా పాటించాలో నేర్చుకుంటే ‘ఎందుకు పాటించాలో’ పెద్దలు చెప్తారు. అయితే చెత్తలో మనతో పోటీ పడే దేశం మరొకటి ఉంది. అమెరికా. చెత్త గుట్టలు గుట్టలుగా ప్రారంభమయి ప్రస్తుతం అవి కొండలని తలపిస్తున్నాయట. ఏతావాతా దేశానికి కావలసింది వ్యక్తిగత సంస్కారం. పరిపాలకులకు కావలసింది వారిని, వారి ఆలోచనా సరళిని మార్చే చిత్తశుద్ధి. రోజూ దైనందిన జీవితంలో సతమతమయ్యేవారి పొట్ట కొట్టే నాయకుడో, అధికారో పౌరుని అక్రమ శిక్షణని సంస్కరించలేడు. నిజానికి మన దేశంలో చెత్తని మించిన ‘చెత్త’ వ్యక్తుల బుర్రల్లో ఉంది. మనం చేసే పనుల్లో చెత్తపనులు కోకొల్లలు. మొదట వాటిని గుర్తు పట్టి, వేరు చేసి recycle చేసుకోగలిగితే మన మనస్సుల్ లోenergy levels పెరుగుతాయి. అనవసరమైన వ్యర్థాలు తొలగుతాయి. పరిశుభ్రపరుచుకోవడంలో సమాజానికి, వ్యక్తికి పెద్ద తేడా లేదు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి నిలపాలనే జపాన్ లోని తెలుగు మిత్రుడి బుర్రలో ‘అక్రమ శిక్షణ’ అనే చెత్తని ఆ దేశం తొలగించగలిగిందని మనం గుర్తించాలి. గొల్లపూడి మారుతీరావు -
ప్రభుత్వ సంకల్పంలో ప్రజలు భాగస్వాములవ్వాలి
► కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ ఆదిలాబాద్: ప్రభుత్వ సంకల్పంలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎం.జ్యోతి బుద్ధప్రకాశ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్వచ్ఛభారత్ మిషన్ అవగాహన సదస్సు నిర్వహిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతీ ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకుని వినియోగించుకోవాలని అన్నారు. గ్రామాన్ని, మండలాన్ని, జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చుకోవాలని, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గ్రామాల్లోని ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. వచ్చే ఆగస్టు 15 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించే గ్రామాల వివరాలు ఎంపీడీఓలు తెలియజేయాలన్నారు. 26 గ్రామాలను ప్రకటిస్తామని ఆయా మండలాల ఎంపీడీఓలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మూర్తి, ఈఈ దేవేందర్‌రెడ్డి, డీఆర్డీఓ రాజేశ్వర్‌రాథోడ్, జెడ్పీ సీఈఓ జితేందర్‌రెడ్డి, డీఎంహెచ్ రాజీవ్‌రాజు, యూనిసెఫ్ ప్రతినిధి వెంకటేశ్వర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
మరుగుదొడ్డి లేకుంటే పోటీకి అనర్హులే
- దీని అమలుకోసం త్వరలో చట్టం - తిరుపతి ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ సభలో సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఇంట్లో మరుగుదొడ్డి లేని నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేస్తామని సీఎం ఎన్.చంద్రబాబు ప్రకటించారు. దీనిపై త్వరలో చట్టం చేయనున్నామని తెలిపారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రత్యేక సభను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలు, 1,000 పంచాయతీలను బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్)ప్రాంతాలుగా ప్రకటించారు. 2018 అక్టోబర్ 2 నాటికి రాష్ట్రం ఓడీఎఫ్ ప్రాంతంగా గుర్తింపు పొందాలని, దీనికి అధికార యంత్రాంగం శ్రమించాలని సూచించారు.వెయ్యిమంది సర్పంచులకు ఓడీఎఫ్ సర్టిఫికెట్లను అందజేశారు. చంద్రన్న బీమా పథకం షురూ.. ఇదిలా ఉండగా తిరుపతి తారకరామా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ‘చంద్రన్న బీమా యోజన’ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 2 కోట్లమందికి బీమా వర్తిస్తుందన్నారు. రాష్ట్రానికి రూ.185.97 కోట్ల స్వచ్ఛభారత్ నిధులు: వెంకయ్యనాయుడు సాక్షి, న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ భారత్’ అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలో ముందుకెళుతోందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. తిరుపతిలో జరిగిన స్వచ్ఛాంధ్రప్రదేశ్ సభకు ఆయన ఢిల్లీనుంచి వీడియో సందేశాన్ని పంపారు. ఇప్పటివరకు కేంద్రం ఏపీకి ‘స్వచ్ఛ భారత్’ కింద రూ.131 కోట్లు మంజూరు చేసిందని, అయితే రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రోత్సాహకంగా రూ.185.97 కోట్లు మంజూరుచేస్తూ ఉత్తర్వులిస్తున్నామని పేర్కొన్నారు. -
టాయిలెట్.. టూ లేట్
ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుందని.. టీవీల్లో ప్రచార మోత మోగించారు. బహిరంగ మల, మూత్రవిసర్జనకు ఫుల్స్టాప్ పెట్టి ప్రతి ఇంటికీ ఒక మరుగుదొడ్డి నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమంటూ ఊదరగొట్టారు. మాటలైతే చెప్పారు కానీ పాలకులు పైసలు విదల్చడంలేదు. ఫలితంగా జిల్లాలో ‘స్వచ్ఛభారత్-మరుగుదొడ్ల’ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో కొన్ని నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోతే.. మరికొన్ని దరఖాస్తులు ముందుకు కదలని పరిస్థితి ఎదురైంది. - మరుగుదొడ్ల నిర్మాణం మరుగున.. - సకాలంలో చెల్లించని బిల్లులు - మధ్యలోనే ఆగిపోతున్న నిర్మాణాలు - నిబంధనలతో ముందుకురాని దరఖాస్తులు మచిలీపట్నం : గత ఏడాది అక్టోబరు రెండో తేదీన ప్రారంభమైన ‘స్వచ్ఛ భారత్’ మరుగుదొడ్ల నిర్మాణం నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. లబ్ధిదారులు ముందుకొచ్చి మరుగుదొడ్డి నిర్మించుకున్నా సకాలంలో బిల్లులు రాని పరిస్థితి నెలకొంది. దీంతో నూతనంగా నిర్మించాలనుకునే వారు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో 2,64,991 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వీటిలో 1,73,418 మరుగుదొడ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. గత శుక్రవారం నాటికి 7,750 నిర్మించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో ఎంతమందికి బిల్లులు చెల్లించారనేది అధికారులకే తెలియని పరిస్థితి. 22,523 మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభమైందని, మరో 14,773 నిర్మాణం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో మరుగుదొడ్డికి గతంలో రూ.9వేలు ఇవ్వగా, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఈ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచారు. అయినా నిర్మాణం ముందడుగు వేయని పరిస్థితి. ప్రచారం ఫుల్.. పని నిల్.. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంపై విసృ్తత ప్రచారం చేపట్టారు. ప్రతి సోమవారం జరిగే వీడియో కాన్ఫరెన్స్, గురువారం నిర్వహిస్తున్న స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమాల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై పది నిమిషాలపాటు చర్చ జరుగుతోంది. నిర్మాణం పూర్తయిన మూడు రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నా ఏ మండలంలోనూ అమలుకావడం లేదు. బందరు పురపాలక సంఘంలో ఇంతవరకు మరుగుదొడ్ల నిర్మాణమే ప్రారంభం కాలేదు. జాబితాలు తయారు చేస్తున్నామని, అర్హులను గుర్తిస్తున్నామని చెప్పటం తప్ప నిర్మాణాల ఊసే లేదు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్, రేషన్‌కార్డు, ఇంటికి సంబంధించిన ఆధారాలు, నంబరు కావాలంటున్నారు. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా మంజూరు చేయటం లేదు. ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు నివసిస్తుంటే ముగ్గురు దరఖాస్తు చేస్తున్నారు. ఎవరికి మరుగుదొడ్డి నిర్మించాలో తెలియని పరిస్థితి నెలకొంది. అడ్డంకులెన్నో.. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో జిల్లాలో 2,64,991 కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని గుర్తించారు. ఈ కుటుంబాలన్నింటికీ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాలవారీగా పంచాయతీ కార్యదర్శులు సర్వేచేసి మరుగుదొడ్డి లేని కుటుంబాన్ని గుర్తించి ఆ వివరాలను ఎంపీడీవో కార్యాలయంలో అందజేశారు. లబ్ధిదారుడు తనకు మరుగుదొడ్డి మంజూరు చేయాలని దరఖాస్తు చేయాల్సి ఉంది. ఈ వివరాలను ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆన్లైన్లో ఉంచుతారు. మరుగుదొడ్డి పునాదులు వేసి భూమికి అడుగు ఎత్తులో నిర్మాణం పూర్తిచేస్తే మొదటి బిల్లుగా రూ. 6వేలు, నిర్మాణం పూర్తయిన తరువాత మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలోనే మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఇసుక కొరత ఏర్పడింది. ఒక మరుగుదొడ్డి నిర్మాణానికి ట్రాక్టర్‌తో ఇసుక తెచ్చుకోవాలంటే వేలల్లో ఖర్చయ్యే పరిస్థితి. మరుగుదొడ్డి కోసం దరఖాస్తు చేస్తే.. ఎవరో ఒకరు వచ్చి కడతారనే భావనలో లబ్ధిదారులు ఉండటంతో ఈ కార్యక్రమం ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. -
మహారాష్ట్ర గవర్నర్ 'స్వచ్ఛ్ భారత్'
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, జెడ్పీ చైర్మన్ తులా ఉమ, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం పట్టుమని ఐదు నిమిషాలు కూడా కొనసాగకపోవడం గమనార్హం. గవర్నర్ రాక కోసం అప్పటి వరకూ వేచి చూసిన ఉద్యోగులు ఆయన వచ్చిన వెంటనే చీపుర్లు అందుకున్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావు రెండే రెండు నిమిషాలు చీపురుతో ఆస్పత్రి పరిసరాలను ఊడ్చి వెనుతిరగ్గా, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఆయన వెంటే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అధికారులు, ఉద్యోగులు కూడా అంతటితో ముగించడంతో అక్కడున్నవారు విస్తుపోవాల్సి వచ్చింది. -
అంతా మురికి మయం
ఒంగోలు : పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పందులు దొర్లుతుంటే స్వచ్ఛ భారత్‌ను ఎలా సాధించుకోగలం.. అందుకే ముందుగా వ్యవస్థను బలోపేతం చేస్తూ పచ్చని, పరిశుభ్ర ప్రకాశాన్ని సాధించేందుకు కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. జెడ్పీ చైర్మన్‌గా ఆయన్నే కొనసాగిస్తూ ఇటీవల కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆయన గురువారం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకంటే ముందే పచ్చని, పరిశుభ్ర ప్రకాశం పేరుతో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రధాని నరేంద్రమోడీ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపునివ్వడం తనకు సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛ ప్రకాశం అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాలాజీ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని గుడ్లూరు ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం తాను ఆకస్మికంగా తనిఖీ చేశానని, అక్కడ మురుగులో పందులు దొర్లుతూ కనిపించాయని, గుడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు భోజనం చేసి చేతులు శుభ్రం చేసుకునే ప్రాంతంలో పందులు కనిపిస్తే చూడలేకపోయానన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి క్రమం తప్పకుండా పాఠశాలలను తనిఖీ చేస్తుంటే అలాంటి పరిస్థితులు ఉండవని ఆయనపై జెడ్పీ చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అటువంటి వాతావరణం ఉండకూడదన్న ఉద్దేశంతో జన్మభూమి కార్యక్రమంతో మధ్యలో ఆగిపోయిన పచ్చని ప్రకాశం, పరిశుభ్ర ప్రకాశం కార్యక్రమాలను తిరిగి కొనసాగించాలని నిర్ణయించినట్లు బాలాజీ చెప్పారు. ఇందుకుగాను ఈ నెల 22న అన్ని మండలాల ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలలో విద్యార్థుల నుంచి సమాచారం సేకరించి ఏ ఇంటికి టాయిలెట్ సౌకర్యం లేదో గుర్తించి టాయిలెట్లు కట్టించుకునే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. ఒక్కో టాయిలెట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేలు ఇస్తున్నందున ఉపాధ్యాయులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు గ్రామస్తులను చైతన్యం చేయాలని బాలాజీ పిలుపునిచ్చారు. అదే విధంగా గతంలో పచ్చని ప్రకాశం పేరుతో నాటిన మొక్కలపై కూడా అధికారులతో సమీక్షిస్తామన్నారు. పచ్చని ప్రకాశంకు, పరిశుభ్ర ప్రకాశం వంటి వినూత్న కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని బాలాజీ హెచ్చరించారు. -
హుమా ఖురేషీ ఔదార్యం
సినీ ప్రముఖులంతా ‘స్వచ్ఛభారత్’హోరులో చీపురుకట్టలు చేతపట్టి చెత్తే కనిపించని వీధులను తుడుస్తూ ఫొటోలకు పోజులిస్తుంటే, హుమా ఖురేషీ మాత్రం ఎలాంటి ప్రచారం లేకుండా ఢిల్లీలోని నిరుపేదల పట్ల తన ఔదార్యాన్ని చాటుకుంటోంది. ఢిల్లీలో నిలువ నీడలేని నిరుపేదలు చాలామంది అక్కడి చలి తీవ్రతకు ఏటా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ పరిస్థితిని నివారించేందుకు హుమా ఖురేషీ, ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఢిల్లీలోని పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తోందట. -
క్లీన్ అండ్ గ్రీన్
సినీ తారలు ‘స్వచ్ఛ భారత్’కు సంకల్పించారు. నటి, నిర్మాత మంచు లక్ష్మి ఫిలింనగర్ రౌండ్ టేబుల్ స్కూల్ విద్యార్థులతో కలసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. మరో వైపు ఆమె సోదరుడు, హీరో మంచు మనోజ్ ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్వర్యంలో లింగంపల్లి రైల్వే స్టేషన్‌ను క్లీన్ చేశారు. మంత్రి కేటీఆర్, హీరోలు రాంచరణ్, నాని, అల్లరి నరేష్ తదితరులు కూడా ఈ సామాజిక కార్యక్రమంలో పాల్గొనాలని మనోజ్ కోరారు. బంజారాహిల్స్/ శేరిలింగంపల్లి -
ఉద్యమంలా స్వచ్ఛ భారత్
విద్యారణ్యపురి : అన్ని పాఠశాలల్లోను స్వచ్ఛభారత్‌ను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని, సంకల్పమే ఆయుధంగా నిరంతరం దీనిని కొనసాగించాలని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. స్వచ్ఛభారత్ కోసం ఉపాధ్యాయులు కంకణబద్ధులు కావాలన్నారు. సోమవారం సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఆధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, సీఆర్పీలు, డిప్యూటీ డీఈఓల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈనెల 14వతేదీ నుంచి 19వతేదీ వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టలని పిలుపునిచ్చారు. జిల్లాలోని 4,807 పాఠశాలల్లో చదువుకుంటున్న ఐదు లక్షల మంది విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. స్వచ్ఛభారత్ తొలుత వ్యక్తిగతంగానే ప్రారంభం కావాల్సిన అవసరం ఉందన్నారు. కాలకృత్యాల్లాగే అదికూడ నిత్యకృత్యం కావాలన్నారు. వారానికి కనీసం రెండుగంటలు కేటాయించాలన్నారు. పనిష్మెంట్గా భావించొద్దు స్వచ్ఛభారత్‌లో విద్యార్థులను భాగస్వాములుగా చేస్తే దానిని వారు కార్పొరేట్ తరహా పనిష్మెంట్గా భావించకూడదని సూచించారు. జిల్లాలో 2.55లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా ఎవరూ సరిగా నిర్మించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఇళ్లలో మరుగుదొడ్లు ఉండేలా వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. ‘ఆసరా’కింద లబ్ధిపొందేవారి వద్ద కూడా సెల్ఫోన్లు ఉంటున్నాయని, కానీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా నిర్మించుకోవడం లేదన్నారు. విద్యార్థులకు తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు వాటిపై వారికి వ్యాసరచన, ఉపన్యాస పోటీలను ప్రతినెలా నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం పాఠశాల నిర్వహణ నిధుల నుంచి రూ.పదివేల వరకు ఖర్చు చేసుకోవచ్చన్నారు. గుడి కంటే బడి గొప్పది గుడి కంటే బడి ఎంతో గొప్పదని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ వై.బాలయ్య అన్నారు. బడిలో అన్ని కులాలు, మతాలకు చెందిన విద్యార్థులుంటారన్నారు. తాను కొన్ని పాఠశాలలను పర్యవేక్షించానని, కొన్నింటిలో పరిశుభ్రత పాటిస్తుండగా మరికొన్నింటిలో ఉపాధ్యాయులు అంతగా పట్టించుకోవడం లేదన్నారు. ముల్కలపల్లి పాఠశాలకు తాను తనిఖీకి వెళ్లినప్పుడు స్కూలు వరండాలోనే ఉపాధ్యాయులు తమ వాహనాలను పార్కింగ్ చేశారని, దీంతో అక్కడ అపరిశుభ్రత చోటుచేసుకుందన్నారు. దీంతో అక్కడి హెడ్మాస్టర్ను సస్పెండ్ చేశానన్నారు. ఉపాధ్యాయులు స్కూలుకు గంట ముందుగా వెళ్లి.. బడి ముగిశాక మరో గంట ఉండి పనిచేస్తే స్వచ్ఛభారత్ విజయవంతం అవడంతోపాటు బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. అందరినీ భాగస్వాములు చేయాలి హెచ్ఎంలు.. ఉపాధ్యాయులను, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను స్వచ్ఛభారత్‌లో భాగస్వాములుగా చేయాల్సిన అవసరం ఉందని ఏజేసీ కృష్ణారెడ్డి అన్నారు. 14వ తేదీన ప్రతి పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టాలని, 15న మధ్యాహ్న భోజనం వండే ప్రాంతంలో శుభ్రం చేయాలని, 17న వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, 18న తాగునీరు, 19న టాయిలెట్లను శుభ్రం చేసే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సభలో డిప్యూటీ డీఈఓ డి.వాసంతి అందరితో స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తీగలవేణి హెచ్ఎం మైస శ్రీనివాస్, కోయడ జెడ్పీఎస్ఎస్ హెచ్ఎం సుదర్శన్‌రెడ్డి, కంఠాయిపాలెం జెడ్పీఎస్ఎస్ హెచ్ఎం కృష్ణమూర్తి తమ పాఠశాలల్లోని సమస్యలను, చేపడుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి వివరించారు. భీమారం జెడ్పీఎస్ఎస్ హెచ్ఎం సంధ్యశ్రీ తమ పాఠశాలలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్కూలుకు ప్రహరీ లేకపోవడంతో రాత్రివేళ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ సమస్యలు పరిష్కరిస్తామని, ఇంకా ఏవైనా సమస్యలుంటే తనకు మెసేజ్ చేయాలంటూ తన మొబైల్ నంబర్ ఇచ్చారు. సభలో డిప్యూటీ ఎస్ఎస్ఏ అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ వి.మురళి, డిప్యూటీ డీఈఓలు రవీందర్‌రెడ్డి, కృష్ణమూర్తి, శ్రీరాములు మాట్లాడారు. -
స్వచ్ఛ భారత్ కోసం అందరూ కృషి చేయాలి
తిరుపతి: భారతదేశ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. అప్పుడే యువతకు దేశ చరిత్రపై అవగాహన ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. లేకుంటే యువత శ్రమ వృథా అవుతుందని వెంకయ్య నాయుడు చెప్పారు. నెల్లూరు జిల్లాలో వెంకయ్య నాయుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో కృషి చేయాలని కోరారు.