ఒంగోలు : పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పందులు దొర్లుతుంటే స్వచ్ఛ భారత్‌ను ఎలా సాధించుకోగలం.. అందుకే ముందుగా వ్యవస్థను బలోపేతం చేస్తూ పచ్చని, పరిశుభ్ర ప్రకాశాన్ని సాధించేందుకు కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. జెడ్పీ చైర్మన్‌గా ఆయన్నే కొనసాగిస్తూ ఇటీవల కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆయన గురువారం తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకంటే ముందే పచ్చని, పరిశుభ్ర ప్రకాశం పేరుతో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రధాని నరేంద్రమోడీ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపునివ్వడం తనకు సంతోషంగా ఉందన్నారు.
స్వచ్ఛ ప్రకాశం అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాలాజీ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని గుడ్లూరు ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం తాను ఆకస్మికంగా తనిఖీ చేశానని, అక్కడ మురుగులో పందులు దొర్లుతూ కనిపించాయని, గుడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు భోజనం చేసి చేతులు శుభ్రం చేసుకునే ప్రాంతంలో పందులు కనిపిస్తే చూడలేకపోయానన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి క్రమం తప్పకుండా పాఠశాలలను తనిఖీ చేస్తుంటే అలాంటి పరిస్థితులు ఉండవని ఆయనపై జెడ్పీ చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అటువంటి వాతావరణం ఉండకూడదన్న ఉద్దేశంతో జన్మభూమి కార్యక్రమంతో మధ్యలో ఆగిపోయిన పచ్చని ప్రకాశం, పరిశుభ్ర ప్రకాశం కార్యక్రమాలను తిరిగి కొనసాగించాలని నిర్ణయించినట్లు బాలాజీ చెప్పారు.
ఇందుకుగాను ఈ నెల 22న అన్ని మండలాల ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలలో విద్యార్థుల నుంచి సమాచారం సేకరించి ఏ ఇంటికి టాయిలెట్ సౌకర్యం లేదో గుర్తించి టాయిలెట్లు కట్టించుకునే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. ఒక్కో టాయిలెట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేలు ఇస్తున్నందున ఉపాధ్యాయులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు గ్రామస్తులను చైతన్యం చేయాలని బాలాజీ పిలుపునిచ్చారు. అదే విధంగా గతంలో పచ్చని ప్రకాశం పేరుతో నాటిన మొక్కలపై కూడా అధికారులతో సమీక్షిస్తామన్నారు. పచ్చని ప్రకాశంకు, పరిశుభ్ర ప్రకాశం వంటి వినూత్న కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని బాలాజీ హెచ్చరించారు.
అంతా మురికి మయం
Published Fri, Dec 19 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement