టాయిలెట్.. టూ లేట్ | Stoped the constructions of toilets | Sakshi
Sakshi News home page

టాయిలెట్.. టూ లేట్

Published Mon, Jul 27 2015 2:02 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

టాయిలెట్.. టూ లేట్ - Sakshi

టాయిలెట్.. టూ లేట్

ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుందని.. టీవీల్లో ప్రచార మోత మోగించారు. బహిరంగ మల, మూత్రవిసర్జనకు ఫుల్‌స్టాప్ పెట్టి ప్రతి ఇంటికీ ఒక మరుగుదొడ్డి నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమంటూ ఊదరగొట్టారు. మాటలైతే చెప్పారు కానీ పాలకులు పైసలు విదల్చడంలేదు. ఫలితంగా జిల్లాలో ‘స్వచ్ఛభారత్-మరుగుదొడ్ల’ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో కొన్ని  నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోతే.. మరికొన్ని దరఖాస్తులు ముందుకు కదలని పరిస్థితి ఎదురైంది.
 
- మరుగుదొడ్ల నిర్మాణం  మరుగున..
- సకాలంలో చెల్లించని బిల్లులు
- మధ్యలోనే ఆగిపోతున్న నిర్మాణాలు
- నిబంధనలతో ముందుకురాని దరఖాస్తులు
మచిలీపట్నం :
గత ఏడాది అక్టోబరు రెండో తేదీన ప్రారంభమైన ‘స్వచ్ఛ భారత్’ మరుగుదొడ్ల నిర్మాణం నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. లబ్ధిదారులు ముందుకొచ్చి మరుగుదొడ్డి నిర్మించుకున్నా సకాలంలో బిల్లులు రాని పరిస్థితి నెలకొంది. దీంతో నూతనంగా నిర్మించాలనుకునే వారు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో 2,64,991 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వీటిలో 1,73,418 మరుగుదొడ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. గత శుక్రవారం నాటికి 7,750 నిర్మించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో ఎంతమందికి బిల్లులు చెల్లించారనేది అధికారులకే తెలియని పరిస్థితి. 22,523 మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభమైందని, మరో 14,773 నిర్మాణం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో మరుగుదొడ్డికి గతంలో రూ.9వేలు ఇవ్వగా, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఈ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచారు. అయినా నిర్మాణం ముందడుగు వేయని పరిస్థితి.
 
ప్రచారం ఫుల్.. పని నిల్..
జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంపై విసృ్తత ప్రచారం చేపట్టారు. ప్రతి సోమవారం జరిగే వీడియో కాన్ఫరెన్స్, గురువారం నిర్వహిస్తున్న స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమాల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై పది నిమిషాలపాటు చర్చ జరుగుతోంది.  నిర్మాణం పూర్తయిన మూడు రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నా ఏ మండలంలోనూ అమలుకావడం లేదు. బందరు పురపాలక సంఘంలో ఇంతవరకు మరుగుదొడ్ల నిర్మాణమే ప్రారంభం కాలేదు. జాబితాలు తయారు చేస్తున్నామని, అర్హులను గుర్తిస్తున్నామని చెప్పటం తప్ప నిర్మాణాల ఊసే లేదు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్, రేషన్‌కార్డు, ఇంటికి సంబంధించిన ఆధారాలు, నంబరు కావాలంటున్నారు. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా మంజూరు చేయటం లేదు. ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు నివసిస్తుంటే ముగ్గురు దరఖాస్తు చేస్తున్నారు. ఎవరికి మరుగుదొడ్డి నిర్మించాలో తెలియని పరిస్థితి నెలకొంది.
 
అడ్డంకులెన్నో..
ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో జిల్లాలో 2,64,991 కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని గుర్తించారు. ఈ కుటుంబాలన్నింటికీ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాలవారీగా పంచాయతీ కార్యదర్శులు సర్వేచేసి మరుగుదొడ్డి లేని కుటుంబాన్ని గుర్తించి ఆ వివరాలను ఎంపీడీవో కార్యాలయంలో అందజేశారు. లబ్ధిదారుడు తనకు మరుగుదొడ్డి మంజూరు చేయాలని దరఖాస్తు చేయాల్సి ఉంది. ఈ వివరాలను ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో ఉంచుతారు.

మరుగుదొడ్డి పునాదులు వేసి భూమికి అడుగు ఎత్తులో నిర్మాణం పూర్తిచేస్తే మొదటి బిల్లుగా రూ. 6వేలు, నిర్మాణం పూర్తయిన తరువాత మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలోనే మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఇసుక కొరత ఏర్పడింది. ఒక మరుగుదొడ్డి నిర్మాణానికి ట్రాక్టర్‌తో ఇసుక తెచ్చుకోవాలంటే వేలల్లో ఖర్చయ్యే పరిస్థితి. మరుగుదొడ్డి కోసం దరఖాస్తు చేస్తే.. ఎవరో ఒకరు వచ్చి కడతారనే భావనలో లబ్ధిదారులు ఉండటంతో ఈ కార్యక్రమం ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement