ఉద్యమంలా స్వచ్ఛ భారత్
విద్యారణ్యపురి : అన్ని పాఠశాలల్లోను స్వచ్ఛభారత్‌ను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని, సంకల్పమే ఆయుధంగా నిరంతరం దీనిని కొనసాగించాలని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. స్వచ్ఛభారత్ కోసం ఉపాధ్యాయులు కంకణబద్ధులు కావాలన్నారు. సోమవారం సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, సీఆర్పీలు, డిప్యూటీ డీఈఓల సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈనెల 14వతేదీ నుంచి 19వతేదీ వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టలని పిలుపునిచ్చారు. జిల్లాలోని 4,807 పాఠశాలల్లో చదువుకుంటున్న ఐదు లక్షల మంది విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. స్వచ్ఛభారత్ తొలుత వ్యక్తిగతంగానే ప్రారంభం కావాల్సిన అవసరం ఉందన్నారు. కాలకృత్యాల్లాగే అదికూడ నిత్యకృత్యం కావాలన్నారు. వారానికి కనీసం రెండుగంటలు కేటాయించాలన్నారు.
పనిష్‌మెంట్‌గా భావించొద్దు
స్వచ్ఛభారత్‌లో విద్యార్థులను భాగస్వాములుగా చేస్తే దానిని వారు కార్పొరేట్ తరహా పనిష్‌మెంట్‌గా భావించకూడదని సూచించారు. జిల్లాలో 2.55లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా ఎవరూ సరిగా నిర్మించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఇళ్లలో మరుగుదొడ్లు ఉండేలా వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు.
‘ఆసరా’కింద లబ్ధిపొందేవారి వద్ద కూడా సెల్‌ఫోన్లు ఉంటున్నాయని, కానీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా నిర్మించుకోవడం లేదన్నారు. విద్యార్థులకు తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు వాటిపై వారికి వ్యాసరచన, ఉపన్యాస పోటీలను ప్రతినెలా నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం పాఠశాల నిర్వహణ నిధుల నుంచి రూ.పదివేల వరకు ఖర్చు చేసుకోవచ్చన్నారు.
గుడి కంటే బడి గొప్పది
గుడి కంటే బడి ఎంతో గొప్పదని పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ వై.బాలయ్య అన్నారు. బడిలో అన్ని కులాలు, మతాలకు చెందిన విద్యార్థులుంటారన్నారు. తాను కొన్ని పాఠశాలలను పర్యవేక్షించానని, కొన్నింటిలో పరిశుభ్రత పాటిస్తుండగా మరికొన్నింటిలో ఉపాధ్యాయులు అంతగా పట్టించుకోవడం లేదన్నారు.
ముల్కలపల్లి పాఠశాలకు తాను తనిఖీకి వెళ్లినప్పుడు స్కూలు వరండాలోనే ఉపాధ్యాయులు తమ వాహనాలను పార్కింగ్ చేశారని, దీంతో అక్కడ అపరిశుభ్రత చోటుచేసుకుందన్నారు. దీంతో అక్కడి హెడ్మాస్టర్‌ను సస్పెండ్ చేశానన్నారు. ఉపాధ్యాయులు స్కూలుకు గంట ముందుగా వెళ్లి.. బడి ముగిశాక మరో గంట ఉండి పనిచేస్తే స్వచ్ఛభారత్ విజయవంతం అవడంతోపాటు బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.
అందరినీ భాగస్వాములు చేయాలి
హెచ్‌ఎంలు.. ఉపాధ్యాయులను, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను స్వచ్ఛభారత్‌లో భాగస్వాములుగా చేయాల్సిన అవసరం ఉందని ఏజేసీ కృష్ణారెడ్డి అన్నారు. 14వ తేదీన ప్రతి పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టాలని, 15న మధ్యాహ్న భోజనం వండే ప్రాంతంలో శుభ్రం చేయాలని, 17న వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, 18న తాగునీరు, 19న టాయిలెట్లను శుభ్రం చేసే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
సభలో డిప్యూటీ డీఈఓ డి.వాసంతి అందరితో స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తీగలవేణి హెచ్‌ఎం మైస శ్రీనివాస్, కోయడ జెడ్పీఎస్‌ఎస్ హెచ్‌ఎం సుదర్శన్‌రెడ్డి, కంఠాయిపాలెం జెడ్పీఎస్‌ఎస్ హెచ్‌ఎం కృష్ణమూర్తి తమ పాఠశాలల్లోని సమస్యలను, చేపడుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి వివరించారు.
భీమారం జెడ్పీఎస్‌ఎస్ హెచ్‌ఎం సంధ్యశ్రీ తమ పాఠశాలలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్కూలుకు ప్రహరీ లేకపోవడంతో రాత్రివేళ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ సమస్యలు పరిష్కరిస్తామని, ఇంకా ఏవైనా సమస్యలుంటే తనకు మెసేజ్ చేయాలంటూ తన మొబైల్ నంబర్ ఇచ్చారు. సభలో డిప్యూటీ ఎస్‌ఎస్‌ఏ అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, ఏఎల్‌ఎస్ కోఆర్డినేటర్ వి.మురళి, డిప్యూటీ డీఈఓలు రవీందర్‌రెడ్డి, కృష్ణమూర్తి, శ్రీరాములు మాట్లాడారు.