మరుగుదొడ్డి లేకుంటే పోటీకి అనర్హులే
- దీని అమలుకోసం త్వరలో చట్టం
- తిరుపతి ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ సభలో సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఇంట్లో మరుగుదొడ్డి లేని నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేస్తామని సీఎం ఎన్.చంద్రబాబు ప్రకటించారు. దీనిపై త్వరలో చట్టం చేయనున్నామని తెలిపారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రత్యేక సభను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలు, 1,000 పంచాయతీలను బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్)ప్రాంతాలుగా ప్రకటించారు. 2018 అక్టోబర్ 2 నాటికి రాష్ట్రం ఓడీఎఫ్ ప్రాంతంగా గుర్తింపు పొందాలని, దీనికి అధికార యంత్రాంగం శ్రమించాలని సూచించారు.వెయ్యిమంది సర్పంచులకు ఓడీఎఫ్ సర్టిఫికెట్లను అందజేశారు.
చంద్రన్న బీమా పథకం షురూ..
ఇదిలా ఉండగా తిరుపతి తారకరామా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ‘చంద్రన్న బీమా యోజన’ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 2 కోట్లమందికి బీమా వర్తిస్తుందన్నారు.
రాష్ట్రానికి రూ.185.97 కోట్ల స్వచ్ఛభారత్ నిధులు: వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ భారత్’ అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలో ముందుకెళుతోందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. తిరుపతిలో జరిగిన స్వచ్ఛాంధ్రప్రదేశ్ సభకు ఆయన ఢిల్లీనుంచి వీడియో సందేశాన్ని పంపారు. ఇప్పటివరకు కేంద్రం ఏపీకి ‘స్వచ్ఛ భారత్’ కింద రూ.131 కోట్లు మంజూరు చేసిందని, అయితే రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రోత్సాహకంగా రూ.185.97 కోట్లు మంజూరుచేస్తూ ఉత్తర్వులిస్తున్నామని పేర్కొన్నారు.