మరుగుదొడ్లను ఫొటో తీస్తే ప్రమోషన్
ఉపాధ్యాయ దినోత్సవ సభలో సీఎం వెల్లడి
సాక్షి, అమరావతి: పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యంలో ఆయన బుధవారం విజయవాడలో రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించామని చెప్పారు. వీటి నిర్వహణ ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రతి నాలుగు గంటలకోసారి ఉపాధ్యాయులు ఫొటో తీసి పంపాలని సూచించారు.
నెలలో ప్రతి నాలుగో శనివారం ఉపాధ్యాయులు పాఠశాలలో నాటిన మొక్కలు పెరుగుతున్న తీరును సెల్ఫీ తీసి పంపించాలని తెలిపారు. ఇలా ఫొటోలు తీసి పంపేవారికే ప్రమోషన్లు, బదిలీల్లో ప్రాముఖ్యత ఉంటుందన్నారు. ప్రతి శనివారం మధ్యాహ్నం నుంచి పుస్తకాలకు దూరంగా.. పాఠశాలల్లో వనం-మనం, స్వచ్ఛాంధ్రప్రదేశ్, ఇంకుడు గుంతల నిర్మాణం, కూరగాయలు పండించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా 139 మంది అధ్యాపకులు, ఉపాధ్యాయులకు రూ.20 వేలు నగదు, ట్యాబ్ ఇచ్చి ఘనంగా సత్కరించారు.