ఎన్ని ఇక్కట్లు.. ఏమిటీ పాట్లు!
సాక్షి, విశాఖపట్నం: పాశ్చాత్య దేశాల నుంచి వందలాది మంది ప్రముఖులు.. స్వదేశం నుంచి అంతకు మించి పారిశ్రామిక, వాణిజ్య ప్రతినిధులు.. వీరిలో చాలామంది అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు. ఇలాటి వారికోసం ఏర్పాట్లు ఎంత సౌకర్యవంతంగా, విస్తృతంగా ఉండాలి!.. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ నిర్వహిస్తున్న సీఐఐ సదస్సులో ఆ అంశాన్ని నిర్వాహకులు, అధికారులు విస్మరించినట్టు కనిపిస్తోంది.
సదస్సు కోసం ఆర్భాటంగా ఏర్పాట్లు చేసిన అధికారులు మౌలిక వసతుల గురించి మరిచిపోయినట్టు అనిపిస్తోంది. కనీసం టాయిలెట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేకపోవడంతో సదస్సుకు హాజరైన ప్రతినిధులు, ముఖ్యంగా మహిళలు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. తాగునీరు, టాయిలెట్లు కొరవడ్డ పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపించింది.
మహిళలకు ఒకేఒక్కటి : తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కట్టడాలను అందంగా తీర్చిదిద్దడంపై ఉన్న శ్రద్ధను అధికారులు టాయిలెట్లు, తాగునీరు ఏర్పాటు చేయడంలో పెట్టలేదు. వచ్చిన రెండు వేలకు పైగా అతిథులకు కేవలం రెండు, మూడు చోట్ల మాత్రమే టాయిలెట్లు ఏర్పాటు చేశారు. మహిళల కోసమైతే ఒకే ఒక్క చోట టాయిలెట్లు ఉన్నాయి. దీంతో రాష్ట్ర మంత్రులతో పాటు విదేశీ ప్రముఖులు కూడా టాయిలెట్ల వద్ద లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. ఇక మిగతా వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
టాయిలెట్లలో గడియలు లేవు: సభ నిర్వహణలో భాగమైన కార్మికులు, జిల్లా అధికారులతో సహా అందరూ సదస్సు నుంచి బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్ధితి తలెత్తింది. కార్మికులెవరినీ సదస్సు జరుగుతున్న ప్రదేశంలో టాయిలెట్లకు అనుమతించలేదు. టాయిలెట్లలో లోపలి గడియలు కూడా లేవు. దీంతో ఒకరు లోనికి వెళితే బయట ఒకరు కాపలా ఉంటున్నారు. మధ్యాహ్నం నీరు లేదంటూ దాదాపు రెండు గంటల పాటు టాయిలెట్లు మూసేశారు. మధ్యాహ్న భోజనాల సమయంలో నీరు లేకపోవడంతో అతిథులు చాలా అవస్థలు పడాల్సి వచ్చింది. గత సదస్సుతో పోల్చితే ఈ సదస్సు మరీ వెలవెలబోయింది.
అసౌకర్యాల నేపథ్యంలో అతిథులు ఎక్కువ సమయం ప్రాంగణంలో ఉండలేక అతిథి గృహాలకు, నగర పర్యటనకు వెళ్లిపోవడంతో సదస్సులో హాజరు పల్చగా కనిపించింది. కనీసం అతిథులకు సౌకర్యాలు అందుతున్నాయో లేదో, వారికైమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయోనని పట్టించుకునేవారు కూడా అక్కడ ఒక్కరూ కనిపించలేదు. స్వచ్ఛ భారత్‌లో గతేడాది దేశంలోనే ఐదో స్థానంలో నిలిచిన విశాఖలో అంతర్జాతీయ సదస్సు జరుగుతుంటే మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోకపోవడం విమర్శలకు గురయింది.