మరుగుదొడ్ల మాయగాళ్లు
- పత్రికలో వచ్చిన మరుగుదొడ్ల పనులు చేస్తున్న వైనం
- విచారణాధికారులను తప్పుదోవ పట్టించే యత్నం
- మరుగుదొడ్ల అక్రమాలపై సీఎంకు రిజిస్టర్ పోస్ట్
బుచ్చిరెడ్డిపాళెం(కోవూరు) : మరుగుదొడ్ల మాయగాళ్లు అధికారులను తప్పుదోవ పట్టించే పనిలో పడ్డారు. పత్రికలో ప్రచురితమైన మరుగుదొడ్ల పనులను పూర్తిచేయడంలో నిమగ్నమయ్యారు. మండలంలోని కట్టుబడిపాళెం, చెల్లాయపాళెంలో ఓడీఎఫ్ కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంపై ఈ నెల 3వ తేదీ సాక్షి దినపత్రికలో ‘స్వచ్ఛంగా మింగేశారు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణ జరిపే పనిలో పడ్డారు. దీంతో మండల అధికా రులు నేచురల్ లీడర్స్ (అధికారపార్టీ నాయకులు)తో పత్రికలో ప్రచురితమైన, అసం పూర్తిగా ఉన్న యల్లసిరి సరోజనమ్మ, కత్తి భాగ్యమ్మ మరుగుదొడ్ల పనులను పూర్తి చేస్తున్నారు. విచారణకు వచ్చిన తరువాత ముందే పూర్తి చేసినట్లు చూపించాలని చూస్తున్నారు.
రూ.25 లక్షలు స్వాహా
కట్టుబడిపాళెం, చెల్లాయపాళెం పంచాయతీల్లో రూ.25 లక్షల నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. మరుగుదొడ్ల నిర్మించకుండానే నిర్మించినట్లు చూపినవి, పాతవాటిని చూపి నవి, అసంపూర్తిగా ఉండానే పూర్తిచేసినట్లు చూపినవి అందులో ఉన్నాయి. అధికారుల సహకారంతో జరిగిన ఈ గోల్‌మాల్‌పై సీఎం చంద్రబాబునాయుడికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా గ్రామస్తులు పంపనున్నారు. ప్రభు త్వం కేటాయించిన నిధులను అధికారులు దగ్గరుండి స్వాహా చేయించిన వైనాన్ని వివరించనున్నారు.
తిరగబడ్డ తెలుగు తమ్ముళ్లు
మరుగుదొడ్ల గోల్‌మాల్‌లో ఇన్‌చార్జి ఎంపీడీఓ నరసింహారావు పాత్ర ఉండటంతో ఆయన్ను కాపాడుకునేందుకు నేచురల్ లీడర్లు టీడీపీ నేతలు, కార్యకర్తల సహకారం కోరుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు పలువురు మండిపడుతున్నారు. దోచుకుంది మీరు, కాపాడేందుకు మేమా అంటున్నారు. మరుగుదొడ్లు నిర్మించకుండా నిర్మించినట్లు ఎందుకు చూపారంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాగా ఇప్పటికైనా కలెక్టర్ ముత్యాలరాజు కేటాయించిన వారందరికీ మరుగుదొడ్లు నిర్మించేలా చూడాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.