సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఎం.ప్రశాంతి
దిలావర్‌పూర్ : జిల్లాలోని ప్రతీ మండలం, గ్రామం స్వచ్ఛతవైపు అడుగు వేయాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. మండలంలోని న్యూలోలం గ్రామంలో అన్ని కుటుంబాలు మరుగుదొడ్డి నిర్మించుకుని జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారు. ఈనేపథ్యంలో గ్రామాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటిస్తూ శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ అతిథిగా హాజరై గ్రామస్తులను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి అక్టోబర్ 2వరకు సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా ప్రకటించేలా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 50 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులను సైతం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నట్ల తెలిపారు. మరుగుదొడ్లను నిర్మించుకోవడమే కాకుండా వాటిని వినియోగించాలన్నారు.
జిల్లాలోని ప్రతీ గ్రామం స్వచ్ఛతపై దృష్టిసారిస్తే గ్రామాలన్నీ పారిశుధ్య గ్రామాలుగా మారి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందన్నారు. హైలెవల్ కెనాల్‌లో భూమి కోల్పోయిన న్యూలోలం గ్రామ రైతులకు వారం రోజుల్లో పరిహారం చెక్కులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల్లో స్థానికంగా ఎలాంటి అవకతవకలు ఏర్పడినా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను స్థానిక సర్పంచ్ డి.లింబాదేవి, స్వయం సహాయక మహిళా సంఘాల ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలోడీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జెడ్పీటిసి సభ్యురాలు ఆమ్గోత్ సుజాతమేర్వాన్, ఎంపీటీసీ సభ్యుడు సత్యం చంద్రకాంత్, ఎంపీడీఓ గంగాధర్, తహసీల్దార్ నర్సయ్య, ఏపీవో జగన్నాథ్, ఏపీఎం విజయలక్షి, ఓడీఎఫ్ ప్రత్యేకాధికారి దేవేందర్‌రెడ్డి , ఎంఈవో శంకర్, నాయకులు పాల్దె శ్రీనివాస్, ఒడ్నం కృష్ణ, స్వామిగౌడ్, బి.గంగన్నతోపాటు వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
ఉపాధి పనులను పరిశీలించిని కలెక్టర్
అనంతరం గ్రామ సమీపంలో సారంగాపూర్ మండలం బీరవెల్లి వెళ్లే మార్గంలో కొనసాగుతున్న ఉపాధి పనులను కలెక్టర్ పరిశీలించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు కూలీల సాయంతో గుంతలు తీసే పనులు చేపట్టారు. వీటిని పరిశీలించిన కలెక్టర్ అధికారులు, కూలీలకు పలు సూచనలు , సలహాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment