ఇష్టారాజ్యం
– యూజీ పరీక్షల విభాగం అస్తవ్యస్తం !!
– డిగ్రీ కాన్వొకేషన్ సర్టిఫికెట్లు పరిశీలించకుండానే బీఈడీ సర్టిఫికెట్ల జారీ
– రాష్ట్రేతర విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయాలు
– డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాల్లోనూ తప్పిదాలు
– ఇంటర్నల్ మార్కులు కలపకుండానే ఫలితాల ప్రకటన
– ప్రొఫెసర్ల కమిటీ నిర్ధారణ
ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యూజీ పరీక్షల విభాగం పనితీరు అస్తవ్యస్తంగా తయారైంది. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల నమోదు, ప్రకటన, సర్టిఫికెట్ల జారీ ఇలా ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నా చర్యలు శూన్యం. ఫలితంగా విద్యార్థులు నష్టపోవాల్సిన పరిస్థితి.
నిర్ణీత శాతానికి మించి రాష్ట్రేతరులు..
బీఈడీ ప్రవేశాలు 85 శాతం స్థానికులు, 15 శాతం రాష్ట్రేతర విద్యార్థులతో భర్తీ చేయాల్సి ఉంది. కానీ 2014–15 విద్యాసంవత్సరంలో బీఈడీ రాష్ట్రేతర విద్యార్థులతో నిర్దేశించిన శాతం కంటే ఎక్కువ మందికి ప్రవేశాలు కల్పించారు. వీరిలో అధికంగా పశ్చిమబెంగాల్‌కు చెందిన విద్యార్థులూ ఉన్నారు. అనంతపురం జిల్లాలోని కళాశాలల్లోను ఇదే పరిస్థితి . 2014–15లో బీఈడీ ప్రాక్టికల్ రికార్డులు పశ్చిమబెంగాల్ విద్యార్థులు ఇంగ్లిష్‌లో రాయాల్సి ఉన్నప్పటికీ, తెలుగులో రాయడం వివాదమైంది. ఇందుకోసం కమిటీని నియమించి ఆయా కళాశాలలకు, విద్యార్థులకు జరిమానా విధించారు. తిరిగి రికార్డులు రాయాలని కమిటీ స్పష్టం చేసింది. సీడీసీ పూర్వానుమతి లేనిదే బీఈడీ సర్టిఫికెట్లు ఇవ్వరాదని యూజీ విభాగాలకు సూచించారు. యూజీ కాన్వోకేషన్ సర్టిఫికెట్లు సక్రమమైనవా? కాదా ? అని పరిశీలించకుండా బీఈడీ సర్టిఫికెట్లు జారీ చేస్తుండడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాల్లో తప్పిదాలు..
డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాలు సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేశారు. ఇంటర్నల్ మార్కులు ఆయా డిగ్రీ కళాశాలలు పంపలేదని ఇబ్బడిముబ్బడిగా విద్యార్థులను ఫెయిల్ చేశారు. ఇందుకోసం ఆచార్య ఏ. మల్లిఖార్జున రెడ్డి నేతత్వంలో కమిటీని నియమించారు. కమిటీ దర్యాప్తును వేగవంతం చేసింది. కొన్ని కళాశాలలు ఇంటర్నల్ మార్కులు పంపినప్పటికీ , ఆయా సబ్జెక్టులకు కలపలేదని కమిటీ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ట్యాబులేషన్‌లో పరిశీలించకుండానే నేరుగా ఫలితాలు ప్రకటించడంతో తప్పిదాలకు ఆస్కారం ఏర్పడిందని కమిటీ భావించింది. ఇంటర్నల్ మార్కులు ఆయా కళాశాలలు పంపకపోతే ఫలితాలు విత్‌హెల్డ్, ఎనౌన్స్ లేటర్ అని ప్రకటించాలని కానీ.. ఎందుకు ఫెయిల్‌గా చూపించారని యూజీ విభాగం అధికారులతో కమిటీ ఆరా తీసినట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు యూజీ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.