సాక్షి, విశాఖపట్నం, న్యూస్‌లైన్ : సాగరతీరం శనివారం సాయంత్రం జై సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఉద్యోగ సంఘాలు చేపట్టిన సాగరజల లక్ష గళ గర్జన కార్యక్రమం విజయవంతమైంది. సమైక్యాంధ్ర ధూం..ధాం అంటూ కుటుంబ సభ్యులతో సహా ఉద్యోగ సంఘాలు బీచ్‌రోడ్డులో చేపట్టిన నిరసన మిన్నంటింది. ఏపీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, విశాఖ జిల్లా అధికారుల సంఘం, ఉద్యోగ/ఉపాధ్యాయ/కార్మిక/కర్షక సమైక్యాంధ్ర పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వేలాదిమంది తరలివచ్చారు.
అల్లూరి సీతారామారాజు విగ్రహానికి పూలమాలు వేసిన అనంతరం వేలాది మంది ర్యాలీగా ఆర్కేబీచ్ వైపు బయల్దేరారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. రాజీనామా చేయని మంత్రుల తీరును దుయ్యబట్టారు. ర్యాలీలో గుడ్‌షెపర్డ్ స్కూల్ విద్యార్థులు 1000 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. అనంతరం బీచ్ రోడ్డులో కాళికామాత దేవాలయం వద్ద సభ నిర్వహించారు. వివిధ వర్గాల నాయకులు సంఘీభావంగా చేతులు కలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు ఆటపాటలతో అలరించారు. దేశభక్తి గేయాలతో కార్యక్రమం ఆకట్టుకుంది. బాణసంచా, ఆకాశపు లాంతర్లతో బీచ్‌రోడ్డు మిరుమిట్లు గొలిపింది. ఫ్లాష్‌మ్యాబ్, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
విడిపోతే వెనకబడిపోతాం...
రాష్ట్రాన్ని విడగొట్టేందుకు పాలకులు చేస్తున్న కుట్రను తిప్పికొట్టాల్సిందేనని ఈ సభలో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఏపీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1990లో పీవీ నర్సింహరావు సంస్కరణలు చేపట్టిన సమయంలో రాష్ట్ర విభజన ప్రస్తావన వచ్చి ఉంటే నిర్దేశించిన నిష్పత్తిలో మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకునేవాళ్లమని అన్నారు. ఇటువంటి ఆలోచన లేకపోవడం వల్లనే హైదరాబాద్‌ను ఎంతో ఉన్నతంగా సీమాంధ్రులంతా రెక్కల కష్టంతో తీర్చిదిద్దామన్నారు.
రాష్ట్రం విడిపోతే మళ్లీ అంతటి అభివృద్ధి సాధించలేమన్నారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రాష్ట్రవిభజన కారణంగా రైతాంగం, విద్యార్థులు ఎంతో నష్టపోవాల్సివస్తుందన్నారు. ఏపీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు మాట్లాడుతూ అధికారులు హోదా మరిచి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారని అన్నారు. ఆర్టీసీ సీమాంధ్ర ఉద్యమకర్తలు పీపీఎం రాజు (ఈయూ), ఎంవీఆర్ మూర్తి (ఎన్‌ఎంయూ) మాట్లాడుతూ 13 జిల్లాల్లో 123 డిపోల్లో 70 వేల మంది ఉద్యోగులు రాత్రనక, పగలనక సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నామని అన్నారు.
ఏపీఎన్‌జీవో జిల్లా సభ్యుడు గోపాలకృష్ణ ప్రసంగిస్తూ మంత్రుల వ్యవహారశైలిని ఎండగట్టారు. ఉద్యమనేత ఆడారి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ ఫ్లై ఓవర్ నిర్మాణానికే ఆరేళ్లు పట్టిందంటే రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర అభివృద్ధికి ఎన్నేళ్లు పడుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదని అన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల, ఉద్యోగ సంఘాల ఉద్యమకర్తలు వై.నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, గణపతి, యోగేశ్వరరావు, ఇమంది పైడిరాజు, ఎం.ఆదినారాయణ, జగన్నాథరావు, శ్యామసుందర్, వై.నర్సింహరావు, విజయప్రసాద్, శ్రీరామమూర్తి, చిట్టిరాజు, డికుమార్‌రావు, చంద్రశేఖర్, హరిప్రసాద్‌లు పాల్గొన్నారు.
సాగరతీరంలో సమైక్య ఘోష
Published Sun, Sep 15 2013 3:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement