నగరం నలుమూలల నుంచి 41 మంది
ప్రముఖులతో కలిపి మొత్తం 72 మంది ఎంపిక
గణతంత్ర వేడుకల వీక్షణకు ఆహ్వానం..
జాబితాలో కళాకారులు కృష్ణాచారి, గౌరిదేవి దంపతులు
ప్రధాని నుంచి ప్రత్యేక లేఖలు
ఘనం.. వారిరువురూ వృత్తి రిత్యా నగిషీ కళాకారులు.. వారసత్వంగా వచ్చిన వృత్తిపై మామకారాన్ని పెంచుకున్నారు. అంతటితో ఆగకుండా తమ వృత్తికి కళాత్మకతను జోడించి వివిధ కళారూపాలను తీర్చిదిద్దారు. తమ కళతో అందరినీ మెప్పించి అనేకమందిని ఆకర్షించారు. తమలోని భిన్నమైన కళతో ప్రముఖుల నుంచి శభాష్ అనిపించుకుంటున్నారు. వారే హైదరాబాద్‌లోని అంబర్‌పేట డీడీ కాలనీలో నివసించే కృష్ణాచారి, గౌరిదేవి దంపతులు..
గత 30 ఏళ్లుగా వెండితో ఫిలిగ్రీ కళారూపాలను తయారు చేస్తూ తమదైన ముద్ర వేసుకున్నారు. వీరి కళను గుర్తించి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను అందించి అభినందించింది. వీరి ఫిలిగ్రీ కళలో చేస్తున్న కృషికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటిప్పుడు గుర్తించి పలు అవార్డులను అందించి సత్కరిస్తున్నాయి.
గణతంత్ర వేడుకలకు..
ఫిలిగ్రీ కళలో వీరి ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు వీరిని ఆహా్వనించింది. 2025 జనవరి 26న జరిగే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే కబురు అందింది. ఈ నెల 23న ఢిల్లీకి చేరుకోవాల్సిందిగా కోరింది. దీంతో కృష్ణాచారి, గౌరిదేవి దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశ గణతంత్ర వేడుకలకు తమను ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఎంతో గర్వంగా ఉందన్నారు. ఢిల్లీ వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నామని వారు సాక్షితో వెల్లడించారు.
వివిధ కళారూపాలు..
వెండితో గత 30 ఏళ్లుగా వివిధ కళారూపాలను రూపొందిస్తున్నామన్నారు. ప్రజలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో అతిథుల జ్ఞాపికలు అందించేందుకు తమను సంప్రదించి ప్రత్యేక కళారూపాలను తయారు చేయించుకుని వెళ్తారన్నారు. వెండితో చార్మినార్, హైటెక్ సిటీ, చారిత్రాత్మక గుర్తులు, వీణ, రాట్నం, వెండి బుట్టలు వంటి కళారూపాలను రూపొందించామన్నారు. అవసరమైన వారికి తాము చెప్పిన రీతిలో అందిస్తామంటున్నారు.
కళను గుర్తించి..
కృష్ణాచారి శ్రమ, కళను గుర్తించి 2006 అప్పటి రాష్ట్రపతి ప్రతిభపాటిల్ జాతీయ అవార్డు అందజేశారు. తన సతీమణ గౌరిదేవికి 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ అవార్డు అందజేశారు. వీటితో పాటు రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులను ఈ దంపతులు అందుకున్నారు. ఫిలిగ్రీ కళ తరపున రాష్ట్ర, దేశ బృందాల్లో వీరు చోటు సంపాదించుకుని తమదైన ముద్ర వేస్తున్నారు.
మహేశ్వరం బీసీ హాస్టల్ విద్యార్థి గొల్ల అక్షయ్
మహేశ్వరం : దేశ రాజధాని ఢిల్లీలో జరిగే కర్తవ్య ఫరేడ్ విక్షించడానికి ప్రధాన మంత్రి యశస్వి పథకం కింద తెలంగాణ నుండి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం బీసీ హస్టల్లో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థి గొల్ల అక్షయ్ ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రదర్శన కారులు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా నిలిచన వారిని, ఇలా తెలంగాణ రాష్ట్రం నుండి 31 మందిని ఎంపిక చేశారు.
ఇందులో మహేశ్వరం బీసీ హస్టల్‌లో ఉంటూ స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న గొల్ల అక్షయ్‌ని ఎంపిక చేశారు. అక్షయ్ స్వగ్రామం కొల్పూరు, మండలం మగనూర్, నారాయణపేట్ జిల్లా. నీరుపేద కుటుంబానికి చెందిన అక్షయ్ తల్లి చిన్న తనంలో మరణించడంతో గొర్లకాపరి అయిన తండ్రి రంగప్ప కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన ఇద్దరి పిల్లలనూ 2021లో మహేశ్వరం బీసీ హస్టల్‌లో చేర్పించారు.
అక్షయ్ చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనభరుస్తున్నాడు. హస్టల్ వార్డెన్ కృష్ణ ప్రోత్సాహంతో ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రధాన మంత్రి యశస్వి పథకం కింద ఆర్థిక సాయాన్ని సంవత్సరానికి రూ.2 లక్షల ఉపకారవేతనం ప్రత్యేకంగా అందిస్తోంది. అక్షయ్ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొయినాబాద్ నుంచి బాత్కు అశ్విని..
మొయినాబాద్ రూరల్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నుంచి బాత్కు అశ్విని ముఖ్య అతిథిగా ఆహా్వనితులయ్యారు. ఈ మేరకు ఢిల్లీ హోంశాఖ విడుదల చేసిన స్పెషల్ కేటగిరి తెలంగాణ జాబితాలో 31 మంది ప్రత్యేక అతిథుల పేర్లల్లో అశ్విని ఆహా్వనం పొందారు. వివిధ రంగాలు, ప్రభుత్వ పతకాల వినియోగదారుల జాబితాలో మొయినాబాద్ మాడల్ మండల సమైక్యకు చెందిన బాత్కు అశ్విని ఆహా్వనం పొందడంతో ఆమె హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment