Republic celebration
-
రాష్ట్రపతి రిపబ్లిక్ డే ప్రసంగంలో అయోధ్య ప్రస్తావన
ఢిల్లీ: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం, భారతరత్న పొందిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ గురించి ప్రస్తావించారు. అయోధ్యలో మహిమాన్వితమైన రామ మందిర ప్రారంభోత్సవాన్ని ముర్ము ప్రశంసించారు. అయోధ్యను భారతదేశ నాగరికత వారసత్వానికి మైలురాయిగా చరిత్రకారులు భావిస్తారని చెప్పారు. భారతరత్న అవార్డు పొందిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు ముర్ము నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన కర్పూరి ఠాకూర్ శత జయంతి ఉత్సవాలు ముగిశాయని పేర్కొన్న ముర్ము.. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ప్రజాస్వామ్యానికి తల్లి.. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాశ్చాత్య ప్రజాస్వామ్య భావన కంటే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా పురాతనమైనదని చెప్పారు. భారతదేశం అమృత్కాల్ దశలో ఉందని పేర్కొన్న ముర్ము.. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే సువర్ణావకాశం దేశ ప్రజలకు ఉందని పేర్కొన్నారు. 'దేశం అమృత్ కాల్ ప్రారంభ సంవత్సరాల్లో ఉంది. ఇది పరివర్తన సమయం. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మనకు సువర్ణావకాశం లభించింది. మన లక్ష్యాలను సాధించడంలో ప్రతి పౌరుడి సహకారం చాలా కీలకం.’’ అని ఆమె అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ గురించి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. టెక్నాలజీ మన జీవితంలో ఎలా భాగమైందో కూడా వివరించారు. 'అమృత్ కాల్' కాలం అపూర్వమైన సాంకేతిక మార్పుల కాలం అని ముర్ము పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పురోగతులు మన దైనందిన జీవితంలో భాగమవుతున్నాయని చెప్పారు. యువత కొత్త సరిహద్దులను అన్వేషిస్తోందని తెలిపిన ముర్ము.. వారి మార్గం నుండి అడ్డంకులను తొలగించడానికి, వారి పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు మనం చేయగలిగినదంతా చేయాలని అన్నారు. ఇదీ చదవండి: జైపూర్‌లో మోదీ, మాక్రాన్ రోడ్ షో -
కొందరికి నేను నచ్చకపోవచ్చు.. రిపబ్లిక్ డే వేడుకల్లో తమిళిసై షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: ‘కొందరికి నేను నచ్చకపోవచ్చు.. కానీ తెలంగాణ అంటే ఇష్టం. ఎంతకష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా’ అని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణ రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకలకు ప్రభుత్వ పెద్దలు హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వేడుకల్లో గవర్నర్ ప్రసంగిస్తూ.. ‘‘రాజ్యాంగం ప్రకారమే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం. కొందరికి ఫార్మ్‌హౌస్‌లు కాదు.. అందరికీ ఫార్మ్‌లు కావాలి. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.. తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణ యువత ధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని గవర్నర్ పిలుపునిచ్చారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలకు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్.. సమ్మక్క, సారలమ్మ, కొమురం భీంలను సర్మించుకున్నారు. ‘‘ఎందరో వీరుల త్యాగ ఫలితం మన స్వాతంత్య్రం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది.. నిజమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం దిక్సూచి. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదు. అభివృద్ధి అంటే జాతి నిర్మాణం’’ అని తమిళిసై అన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున హైవేలు నిర్మించిన ప్రధానికి గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు -
ఈజిప్ట్‌తో బంధం బలోపేతం
న్యూఢిల్లీ: ఈజిప్టుతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ నిర్ణయించింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి (68)తో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమావేశమయ్యారు. రక్షణ, భద్రత, వర్తకం రంగాలతో పాటు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో కూడా పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. 700 కోట్ల డాలర్లున్న ద్వైపాక్షిక వర్తకాన్ని ఐదేళ్లలో 1,200 కోట్ల డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. ఆహార, ఇంధన, ఎరువులు తదితర రంగాలపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తదితరాలు చర్చకు వచ్చాయి. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, యువత, సమాచార, సాంస్కృతిక రంగాలకు సంబంధించి ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఐదు ఒప్పందాలు కుదిరాయి. ‘‘ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక బంధం స్థాయికి పెంపొందించుకోవాలని భేటీలో నిర్ణయించాం. ఇరు దేశాల వ్యూహాత్మక సహకారం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో శాంతికి, ప్రగతికి బాటలు పరుస్తుంది’’ అని మోదీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచమంతటా ఉగ్రవాదం పెచ్చరిల్లుతుండటంపై ఇరు దేశాలూ ఆందోళనతో ఉన్నాయి. ఇది మానవాళి భద్రతకు అతి పెద్ద సమస్యగా మారిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నాయి. ఉగ్రవాద భావజాల వ్యాప్తికి సైబర్ స్పేస్ దుర్వినియోగం చేస్తున్న తీరుకు అడ్డుకట్ట వేసేందుకు చేతులు కలపాలని నిర్ణయించాం’’ అన్నారు. కరోనా, యుద్ధంతో దెబ్బ తిన్న ఆహార, ఫార్మా సరఫరాలను బలోపేతం చేయడంపై చర్చించామన్నారు. చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వట్రా తెలిపారు. ఇదే తొలిసారి గణతంత్ర ఉత్సవాలకు ఈజిప్టు అధ్యక్షున్ని ఆహ్వానించడం ఇదే తొలిసారి. ఈజిప్టు సైనిక బృందం కూడా గణతంత్ర పరేడ్‌లో పాల్గొంటోంది. మూడో ఇండియా–ఆఫ్రికా ఫోరం శిఖరాగ్రంలో పాల్గొనేందుకు సిసి 2015లో తొలిసారి భారత్‌లో పర్యటించారు. తర్వాత ఏడాదికే మరోసారి పర్యటించారు. యువతే అతిపెద్ద లబ్ధిదారులు అభివృద్ధి చెందిన భారతదేశంలో యువతే అతిపెద్ద లబ్ధిదారులుగా మారబోతున్నారని ప్రధానినరేంద్ర మోదీ చెప్పారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే అతిపెద్ద బాధ్యత సైతం వారిపైనే ఉందన్నారు. గణతంత్ర పరేడ్‌లో పాల్గొననున్న ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘అమృతకాలంలో దేశ ఆకాంక్షలు, కలలకు యువత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేటితరానికి ఎన్నెన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశం సాధిస్తున్న ఘనతల్లోనే ప్రపంచం తన భవిష్యత్తును వెతుక్కుంటోంది. జాతి లక్ష్యాలు, ఆకాంక్షలతో యువతను ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అనుసంధానిస్తున్నాయి. యువత మాట్లాడడం ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. భారత్ సారథ్యం వహిస్తున్న జి–20 కూటమి గురించి పాఠశాలలు, కళాశాలల్లో చర్చించుకోవాలి’’ అని సూచించారు. స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని యువతను కోరారు. -
గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం జరుగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో నగర పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యలను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రిపబ్లిక్–డే పరేడ్ జరిగే సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌ను గురువారం నాటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జరిగే రిహార్సల్స్‌ను వీక్షించే ఉన్నతాధికారులు భద్రతా చర్యల్లో తీసుకోవాల్సిన మార్పు చేర్పులను సూచించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. గ్రౌండ్స్ చుట్టూ అనునిత్యం పెట్రోలింగ్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొనున్నాయి. దాదాపు 1500 మంది సిబ్బందిని బందోబస్తుకు వినియోగించనున్నట్లు సమాచారం. నగర వ్యాప్తంగా నిఘా, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించారు. పరేడ్ గ్రౌండ్స్‌లోకి దారి తీసే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు ప్రధాన ద్వారాల దగ్గర మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రజలు తమ వెంట హ్యాండ్ బ్యాగ్స్, కెమెరాలు, టిఫిన్ బాక్సులు, బ్రీఫ్ కేసులను తీసుకురావడాన్ని నిషేధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈసారి గగన తలంపై నిఘా సైతం ఏర్పాటు చేశారు. రూఫ్ టాప్ వాచ్ కోసం ఎత్తయిన బిల్డింగ్స్‌పైన సుశిక్షితులైన సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క శనివారం సాయంత్రం గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌లోనూ ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో సోమాజిగూడ పరిసరాల్లోనూ గట్టి బందోబస్తుఉండబోతోంది. రాజ్‌భవన్ పరిసరాల్లో ఇలా... రిపబ్లిక్–డేను పురస్కరించుకుని గవర్నర్ తన అధికార నివాసంలో ఇవ్వనున్న ఎట్ హోమ్ విందు నేపథ్యంలో రాజ్‌భవన్ పరిసరాల్లోనూ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ పేర్కొన్నారు. గులాబీ రంగు పాస్‌లతో వచ్చే ఆహుతులు రాజ్‌భవన్ గేట్–1 ద్వారా లోపలకు ప్రవేశించాలి. దర్బార్ హాలు ఎదురుగా వాహనాలు ఆపాలి. వీటిని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గర పార్క్ చేసుకోవాలి. ఆకుపచ్చ రంగు పాస్‌లకు గేట్–2 కేటాయించారు. ఇవి కూడా దర్బార్ హాల్ దగ్గర ఆహుతులను దింపి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గర పార్క్ చేసుకోవాలి. తెల్లరంగు పాస్‌లకు గేట్–3 కేటాయించారు. వీరికి దిల్కుష్గెస్ట్ హౌస్‌లో పార్కింగ్ కేటాయించారు. మిగిలిన వారంతా తమ వాహనాలను ఎంఎంటీఎస్ స్టేషన్లో పార్క్ చేసుకోవాలి. డ్యూటీ వెహికిల్స్‌కు చిల్లా వద్ద పార్కింగ్ చేయాలి. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో శనివారం జరుగనున్న గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఆ పరిసరాల్లో, గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు వీటిని గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు. ♦ సికింద్రాబాద్‌లోని సర్దార్‌పటేల్ రోడ్‌లోని సెంట్రల్ టెలిగ్రాఫ్ ఆఫీసు జంక్షన్–వైఎంసీఏ చౌరస్తా మధ్య శనివారం ఉదయం 7–11 గంటల మధ్య వన్–వే అమలులో ఉంటుంది. దీని ప్రకారం పరేడ్ ప్రారంభానికి ముందు సీటీవో జంక్షన్ నుంచి వైఎంసీఏ వైపు, పూర్తయిన తరవాత వైఎంసీఏ నుంచి సీటీవో జంక్షన్ వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. ఇదే సమయంలో కంటోన్మెంట్ గార్డెన్స్–ఎస్బీహెచ్ చౌరస్తా మధ్య ఎలాంటి వాహనాల ప్రవేశానికి అనుమతి ఉండదు. ♦ బేగంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు సీటీఓ ఫ్లైఓవర్ కింది నుంచి ప్రయాణించి ప్యారడైజ్, బాలమ్రాయ్ మీదుగా పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకోవాలి. ♦ సెయింట్ జాన్స్ రోటరీ నుంచి వచ్చే వాహనాలు వైఎంసీఏ ఫ్లైఓవర్ కింది నుంచి వచ్చి ఉప్కార్ చౌరస్తా లేదా క్లాక్ టవర్ మీదుగా గ్రౌండ్స్‌కు రావాలి. ♦ సికింద్రాబాద్ క్లబ్ ఇన్‌గేట్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్బీహెచ్ చౌరస్తాకు అనుమతించరు. వైఎంసీఏ క్రాస్‌రోడ్స్ లేదా టివోలీ చౌరస్తా మీదుగా వెళ్లాలి. ♦ ఆర్పీ రోడ్ నుంచి ఎస్బీహెచ్ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్ ప్యాట్నీ నుంచి ప్యారడైజ్ లేదా క్లాక్ టవర్ వైపు మళ్లాల్సి ఉంటుంది. -
రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎల్పీయూ విద్యార్థిని
జలంధర్: ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్‌కు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)కి చెందిన అంబికా మిశ్రా ఎంపికయ్యారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అంబిక ప్రస్తుతం ఎల్పీయూలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్‌గా ఏడాదిలో 145 గంటలు పనిచేయడంతో పాటు కథక్ నృత్యం, పాటలు, ఉపన్యాసం తదితర విభాగాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా అంబిక పరేడ్‌కు ఎంపికైనట్లు ఎల్పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తెలిపారు. -
విమానాలకు ‘గణతంత్ర వేడుకల’ దెబ్బ!
న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిషేధాజ్ఞల వల్ల ఇక్కడి ఇందిరాగాంధీ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వెయ్యికిపైగా విమానాలు ప్రభావితం కానున్నాయి. గణతంత్ర వేడుకల సందర్భంగా జనవరి 18 నుంచి 26 వరకూ రోజూ ఉదయం 10.35 గంటల నుంచి 12.15 గంటల వరకు గగనతలంపై నిషేధం ఉంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) పలు విమానయాన సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీచేసిందన్నారు. -
ప్రపంచం కీర్తించే ఐదుగురిలో ముగ్గురు భారతీయులే
గుడివాడ: ప్రపంచం కీర్తించే ఐదుగురు మహానుభావుల్లో ముగ్గురు మన భారతదేశంలో పుట్టిన వారు కావడం ఎంతో గర్వకారణమని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. ఏపీలోని గుడివాడలో ఉన్న విశ్వభారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో గురువారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి చిన్నచిన్న రాజ్యాలుగా ఉన్న ప్రాంతాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో విలీనం చేశారని, భారతదేశాన్ని గణతంత్ర దేశంగా తీర్చిదిద్దుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించారని వివరించారు. ప్రపంచం కీర్తించే మహానుభావులు శ్రీకృష్ణుడు, జీసెస్, మహ్మద్ ప్రవక్త, బుద్ధుడు, మహాత్మాగాంధీ అని, వారిలో ముగ్గురు భారత గడ్డపై పుట్టినవారు కావడం మనం గర్వించదగ్గ విషయమన్నారు. భారతదేశ విశిష్టతను విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమం అనంతరం 3,214 మీటర్ల పొడవైన జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీని యార్లగడ్డ ప్రారంభించారు. నాలుగు గంటలపాటు 3,500 మంది విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ డీఎస్పీ అంకినీడు ప్రసాద్, టూటౌన్ సీఐ శివాజీ, పాఠశాల వ్యవస్థాపకుడు పొట్లూరి శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. -
మహారాష్ట్ర శకటానికి మొదటి బహుమతి
సాక్షి, ముంబై: గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శించిన మహారాష్ట్ర శకటానికి మొదటి స్థానం దక్కింది. వివిధ విభాగాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, పలు రాష్ట్రాలకు చెందిన మొత్తం 25 శకటాలను జనవరి 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌పై ప్రదర్శించారు. వీటిలో ‘వారీ నుంచి పండరిపూర్’ అన్న అంశాన్ని ప్రదర్శించిన మహారాష్ట్ర శకటానికి మొదటి బహుమతి లభించింది. పండరిపూర్‌లో జరిగే ఆశాడి ఏకాదశి ఉత్సవాలకు సంబంధించిన సందేశాత్మక అలంకరణ ఎంతో ఆకట్టుకుంది. యేటా పండరిపూర్‌లో ఘనంగా నిర్వహించే ఆశాడి ఏకాదశి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు కాలినడకన 15 రోజుల ముందే బయలుదేరుతారు. ఆ రోజు చంద్రబాగ నదిలో స్నానాలుచేసి విఠల్, రుక్మాయిని దర్చించుకుంటారు. ఇలా భక్తులు కాలినడకన ఎలా చేరుకుంటారనే దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు ఆ శకటంలో చూపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంప్రదాయాలు, సంస్కృతులతోపాటు అశ్వాలతో నిర్వహించే ‘రింగన్ ఉత్సవ్’ ను కూడా శకటంపై ప్రదర్శించారు. ఈ సందేశాత్మక చిత్ర ప్రదర్శనను ప్రముఖ కళా దర్శకుడు చంద్రశేఖర్ మోరే రూపొందించారు. ఆయన మార్గదర్శనంలో మొత్తం 65 మంది కళాకారులు రేయింబవళ్లు శ్రమించి ఈ శకటాన్ని తీర్చిదిద్దారు. రాజ్పథలో జరిగిన పరేడ్‌లో మహారాష్ట్ర శకటం వెంట 31 మంది కళాకారులు పాల్గొన్నారు. శకటంపై ముందు భాగంలో తలపై కలశాన్ని ఎత్తుకున్న మహిళ, పండర్‌పూర్‌లో విఠల్, రుక్మాయి మందిరం నమూనా, అశ్వాల పరుగులు (రింగన్ ఉత్సవం), సంత్ జ్ఞానేశ్వర్, తుకారాం మహారాజ్‌ల భారీ విగ్రహాలు, శకటానికి ఇరుపక్కల పల్లకీతో బోయిలు, చేతిలో వీణ, మృదంగం పట్టుకున్న భక్తుల బృందం ఇలా పండరిపూర్ వైభవాన్ని ప్రదర్శించిన రాష్ట్ర శకటం న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుంది. -
గణతంత్ర వేడుకల నిర్వహణ
కలెక్టరేట్, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్మి తా సబర్వాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు నివేదికలను జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారికి అందజేయాలని ఆదేశించారు. శాఖల వారీగా ప్రగతి శకటాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిపై పథకాల వివరాలు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా రూపొందించాలన్నారు. శకటాలకు రోలింగ్ షీల్డ్‌తో ప్రగతి బహుమతి అందజేస్తామన్నారు. ఎగ్జిబిషన్ స్టాల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కార్యక్రమానికి హాజరయ్యే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేలా ఏర్పాటు చేయాలని డీఈఓ రమేశ్‌ను ఆదేశించారు. సమావేశంలో డాక్టర్ శరత్, అదనపు ఎస్పీ మధుసూదన్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు బాల్‌రెడ్డి, రవీందర్, రామలక్ష్మి, ఆశీర్వాదం, లక్ష్మణాచారి, కిరణ్‌కుమార్, రమేశ్, శ్రీనివాసులు సంగారెడ్డి డీఎస్పీ వెంకటేశం, సంగారెడ్డి ఆర్డీఓ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. పల్స్‌పోలియో విజయవంతం సంగారెడ్డి అర్బన్: జిల్లాలో పల్స్ పోలి యో కార్యక్రమం విజయవంతమైందని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంతో 101శాతం సాధించామని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 3,57,200 మంది చిన్నారులకు పో లియో చుక్కలు వేసి 101శాతం లక్ష్యం సాధించామన్నారు.19వ తేదీన 3,34,204 మంది చిన్నారులకు, 20వ తేదీన 19,204 మంది చిన్నారులకు, 21న 3,642 మందికి పోలియో చుక్కలు వేశామన్నారు. జిల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా పోలియో చుక్కలు వేశామన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, గ్రామైక్య సంఘాలు, వైద్య శాఖ అధికారులు, సిబ్బందితోపాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పల్స్‌పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భినందనలు తెలిపారు.