మహారాష్ట్ర శకటానికి మొదటి బహుమతి
సాక్షి, ముంబై: గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శించిన మహారాష్ట్ర శకటానికి మొదటి స్థానం దక్కింది. వివిధ విభాగాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, పలు రాష్ట్రాలకు చెందిన మొత్తం 25 శకటాలను జనవరి 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌పై ప్రదర్శించారు. వీటిలో ‘వారీ నుంచి పండరిపూర్’ అన్న అంశాన్ని ప్రదర్శించిన మహారాష్ట్ర శకటానికి మొదటి బహుమతి లభించింది.
పండరిపూర్‌లో జరిగే ఆశాడి ఏకాదశి ఉత్సవాలకు సంబంధించిన సందేశాత్మక అలంకరణ ఎంతో ఆకట్టుకుంది. యేటా పండరిపూర్‌లో ఘనంగా నిర్వహించే ఆశాడి ఏకాదశి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు కాలినడకన 15 రోజుల ముందే బయలుదేరుతారు. ఆ రోజు చంద్రబాగ నదిలో స్నానాలుచేసి విఠల్, రుక్మాయిని దర్చించుకుంటారు. ఇలా భక్తులు కాలినడకన ఎలా చేరుకుంటారనే దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు ఆ శకటంలో చూపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంప్రదాయాలు, సంస్కృతులతోపాటు అశ్వాలతో నిర్వహించే ‘రింగన్ ఉత్సవ్’ ను కూడా శకటంపై ప్రదర్శించారు.
ఈ సందేశాత్మక చిత్ర ప్రదర్శనను ప్రముఖ కళా దర్శకుడు చంద్రశేఖర్ మోరే రూపొందించారు. ఆయన మార్గదర్శనంలో మొత్తం 65 మంది కళాకారులు రేయింబవళ్లు శ్రమించి ఈ శకటాన్ని తీర్చిదిద్దారు. రాజ్‌పథలో జరిగిన పరేడ్‌లో మహారాష్ట్ర శకటం వెంట 31 మంది కళాకారులు పాల్గొన్నారు.
శకటంపై ముందు భాగంలో తలపై కలశాన్ని ఎత్తుకున్న మహిళ, పండర్‌పూర్‌లో విఠల్, రుక్మాయి మందిరం నమూనా, అశ్వాల పరుగులు (రింగన్ ఉత్సవం), సంత్ జ్ఞానేశ్వర్, తుకారాం మహారాజ్‌ల భారీ విగ్రహాలు, శకటానికి ఇరుపక్కల పల్లకీతో బోయిలు, చేతిలో వీణ, మృదంగం పట్టుకున్న భక్తుల బృందం ఇలా పండరిపూర్ వైభవాన్ని ప్రదర్శించిన రాష్ట్ర శకటం న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుంది.