
బుల్దానాలోని షేగావ్ తాలూకా గ్రామాలకు ‘సెలీనియం’శాపం
గోధుమ పిండిలో అధిక శాతం సెలీనియంతో ఇటీవల పలువురికి బట్టతల, జుట్టు సమస్యలు
ప్రస్తుతం 30 మంది గోళ్ల సంబంధిత సమస్యలు..
ముంబై: బుల్ధానా జిల్లాలోని షెగావ్ తాలూకా గ్రామాల ప్రజలను ‘సెలీనియం’శాపం వేధిస్తోంది. తాలుకాలోని నాలుగు గ్రామాల్లో దాదాపు 30 మంది గోళ్ల సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారని, వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని బుల్దానా ఆరోగ్య అధికారి డాక్టర్ అనిల్ బంకర్ తెలిపారు.
సెలీనియం అధిక వినియోగం వల్లే...
కాగా గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో షెగావ్ తాలూకా జాతీయ వార్తల్లో ప్రధానంగా నిలిచింది. తమకు హఠాత్తుగా బట్టతల వచ్చిందని, జుట్టు విపరీతంగా ఊడిపోయిందని పలువురు ఆరోగ్యశాఖ అధికారులను ఆశ్రయించారు. నిజనిజాలపై నిపుణులు ఆరా తీయగా రేషన్ దుకాణాలు పంపిణీ చేసిన గోధుమల్లో అత్యధిక శాతం సెలీనియం ఉండటం, దానిని వినియోగించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని తేలింది. అయితే కొందరు ఈ వాదనను ఖండించారు. ఏది ఏమైనప్పటికీ బాధితులు తీవ్ర ఆవేదన చెందారు. కాగా తాజాగా షేగావ్ తాలూకాలోని నాలుగు గ్రామాల్లో దాదాపు 30 మందికి గోళ్ల సంబంధిత సమస్యలు తలెత్తాయి. కాగా సెలీనియం అధిక వినియోగం వల్లే ఈ సమస్య తలెత్తి ఉండవచ్చునని భావిస్తున్నట్లు అనిల్ బంకర్ తెలిపారు.
గతంలో ఈ సమస్యను ఛేదించిన పద్మశ్రీ వైద్యుడు హిమ్మత్రావ్ బవాస్కర్
రాత్రికి రాత్రే మహారాష్ట్రలోని బుల్ధానాలో, 4 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల 300 మంది గ్రామస్తుల ప్రజలు జుట్టు రాలిపోవడం, ఇతర సమస్యలతో బాధపడ్డాడు. తొలుతు దీనికి నీటి కాలుష్యం కారణమని అంతా భావించారు. కానీ తేలు కాటు చికిత్సలో తన కృషికి ప్రసిద్ధి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హిమ్మత్రావ్ బవాస్కర్ దీన్ని నమ్మలేదు. 92 వేల రూపాయలకు పైగా సొంత ఖర్చులతో ఒక నెల రోజులపాటు పరిశోధన చేశారు. జుట్టు, రక్తం, మూత్రం, ఆహార నమూనాలను సేకరించి, ఆహారం, ఆహార వనరులు, లక్షణాలను నిశితంగా విశ్లేషించింది. దీనికి అధికమోతాదులో ఉన్న సెలీనియం కారణమని తేల్చారు. సురక్షితమైన పరిమితికి 600 రెట్లు ఎక్కువ ఉంటుంది. కలుషితమైన గోధుమలను,గోధుమ పిండి (అట్టా) పంపిణీతో, గ్రామస్తులు తెలియకుండానే వారి రోజువారీ భోజనం ద్వారా విషపూరిత స్థాయిలలో సెలీనియంను వినియోగించారని వెల్లడించారు.
సెలీనియం ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ లక్షణాలు
దీర్ఘకాలంగా సెలీనియం ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధినే సెలెనోసిస్ అంటారు.సెలీనియం అనేది ఒక రసాయన మూలకం. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. సెలీనియం ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఇది చిన్ని మొత్తంలోనే శరీరానికి అవసరం. జీవక్రియ, థైరాయిడ్ పనితీరులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిసుంది. అయితే దీని వినియోగం ఎక్కువైతే కొన్ని దుష్పరిణామాలు తప్పవు.
లక్షణాలు : జుట్టు రాలడం, గోర్లు పెళుసుగా మారడం లేదా రాలిపోవడం, నోటిలో లోహ రుచి, శ్వాస వెల్లుల్లి వాసన, చర్మపు దద్దుర్లు, వికారం, విరేచనాలు, అలసట, చిరాకు, నాడీ వ్యవస్థలో లోపాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, తలనొప్పి.
సెలీనియం విషప్రభావం తొలిలక్షణాలు: శ్వాసలో వెల్లుల్లి వాసన, నోటిలో లోహ రుచి.
సెలీనియం అధికంగా ఉండే ఆహారాలు: బ్రెజిల్ నట్స్ చేపలు, షెల్ షిఫ్ ఎర్ర మాంసం, ధాన్యాలు, గుడ్లు, కోడి మాంసం, కాలేయం, వెల్లుల్లి.
ఇవీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
కరణ్ జోహార్ షాకింగ్ వెయిట్ లాస్ ఒజెంపిక్ ఇంజెక్షన్లే కారణమా?