అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై సరిగ్గా నెలన్నరైంది. అయినా సడలని సంకల్పంతో సమైక్యవాదులు ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై మండిపడుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, న్యాయవాదులు, మేధావులు, మహిళలు, కవులు, కళాకారులు, కర్షకులు, శ్రామికులు, విద్యార్థులు... ఇలా అన్ని వర్గాల ప్రజలు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ సమర నినాదం చేస్తున్నారు. 45వ రోజైన శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధృతంగా సాగింది. ఏపీ ఎన్జీఓ సంఘం పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా తపాలా, బీఎస్‌ఎన్‌ఎల్ తదితర అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల ఎదుట నిరసనలు చేపట్టారు. అనంతపురం నగరంలో ఎస్‌వీ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ సి.సోమశేఖర్‌రెడ్డి నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు భారీ ప్రరద్శన నిర్వహించారు. సప్తగిరి సర్కిల్‌లో మానవహారం నిర్మించి.. సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగించారు. జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పొట్టిశ్రీరాములు విగ్రహం ఎదుట ఉపాధ్యాయులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు.
అధ్యాపక జేఏసీ నేతలు వేపమండలతో నిరసన ర్యాలీ చేశారు. సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌లను చింపాంజీలుగా చిత్రీకరించిన ఫ్లెక్సీలతో విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు స్థానిక ఫాతీమాబీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పంచాయతీరాజ్, వాణిజ్య పన్నుల శాఖ, హంద్రీ-నీవా, ఎన్‌జీవో, హౌసింగ్ ఉద్యోగులు, న్యాయవాదులు, ముస్లిం జేఏసీ నేతల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హమాలీ కార్మికులు దీక్ష చేపట్టారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నేతలు రిలే దీక్షలు కొనసాగిస్తూనే... పోస్టాఫీసు, బ్యాంకులను బంద్ చేయించారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీకి చిలమత్తూరులో సమైక్యవాదుల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
కళ్యాణదుర్గంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ఘెరావ్ చేశారు. కళ్యాణదుర్గంలో వాల్మీకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగిస్తూనే నిరసన ర్యాలీలు చేశారు. ధర్మవరంలో సమైక్యవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బత్తలపల్లిలో ఐకేపీ మహిళలు వంటా వార్పు చేపట్టారు. గుంతకల్లులో వైఎస్సార్ సీపీ, ఉద్యోగ జేఏసీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు రిలే దీక్షలను కొనసాగించారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మోటార్ బైకుల ర్యాలీ, మానవహారం చేపట్టారు. హిందూపురంలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ చేశారు.
ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కదిరిలో న్యాయవాదులు, మున్సిపల్ ఉపాధ్యాయులు రిలే దీక్షలను కొనసాగిస్తున్నారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు రాస్తారోకో, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు స్కూల్ బస్సులతో ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో జేఏసీ నేతలు కారు శుభ్రం చేసి, చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు.
పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, గోరంట్ల, రాయదుర్గంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీలు,వివిధ సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యమే ధ్యేయమంటూ కణేకల్లులో కురుబ కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌జీవోలు లాంతర్లలో నిరసన తెలిపారు. కనగానపల్లిలో సమైక్యవాదులు పరిశ్రమల కేంద్రాన్ని మూసివేయించారు. రామగిరి మండలం పేరూరు నుంచి ధర్మవరానికి బైకు ర్యాలీ చేపట్టారు. గార్లదిన్నె మండలం కల్లూరులో సమైక్యవాదులు రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థులు, ఆర్టీసీ ఉద్యోగులు,యాడికిలో విలేకరులు, ఉరవకొండలో వివిధ సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దపప్పూరులో పలువురు ఎంఆర్‌పీఎస్ నాయకులు రాజీనామా చేశారు.
‘నారీగర్జన’కు సర్వం సిద్ధం
సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం అనంతపురం నగరంలో ‘నారీగర్జన’ నిర్వహించనున్నారు. ఇందుకు మహిళా ఉద్యోగులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18న రైతు గర్జన నిర్వహించడానికి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమాయత్తమయ్యారు. కాగా రాష్ట్ర విభజన నిర్ణయంపై తీవ్ర కలత చెంది ఓడీ చెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్‌కు చెందిన సమైక్యవాది చంద్ర అలియాస్ ధర్మరాజు(48), అనంతపురం ఆర్టీసీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రామశేషయ్య (54), చిన్న వడుగూరుకు చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు హనుమంత రెడ్డి (60) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు.
అందరి నోటా అదే మాట
Published Sat, Sep 14 2013 4:49 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement