మహాపరాధం | TDP Leaders Fear on Telangana Elections Results | Sakshi
Sakshi News home page

మహాపరాధం

Published Wed, Dec 12 2018 10:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TDP Leaders Fear on Telangana Elections Results - Sakshi

తెలంగాణ ఫలితం ‘అనంత’ టీడీపీ నేతల్లో గుబులు రేపుతోంది. ఏపీలోనూ ఘెర పరాభవం తప్పదేమోననే చర్చ జరుగుతోంది. టీడీపీ పొత్తు తమ కొంప ముంచిందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయ పడుతుండగా..     ఏపీలో ఆయనతో దోస్తీ వద్దేవద్దనే నిర్ణయానికి ఇక్కడి నేతలు దాదాపుగా వచ్చేశారు. ఓటమి తప్పదని తెలిసీ హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలో నిలిపి ఆ కుటుంబాన్ని చంద్రబాబు వీధిన పడేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మొత్తంగా తెలంగాణ ‘ఫలితం’తో టీడీపీ నేతల భవిష్యత్‌ వారి కళ్లెదుట కనిపించినట్లయింది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం : తెలంగాణ ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్ష తీర్పునిచ్చారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ మహా కూటమి (ప్రజా ఫ్రంట్‌) పేరుతో తలపడ్డాయి. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత కచ్చితంగా ఉంటుంది. 2004–09 కాలంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి జనరంజక పాలనను అందించారు. 2004తో పోలిస్తే 2009తో సీట్లు తగ్గాయి. ‘మాకు ప్రజలు పాస్‌ మార్కులే ఇచ్చారు’ అని వైఎస్‌ అప్పట్లో పేర్కొన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు 2014తో పోలిస్తే 20కి పైగా స్థానాలు అధికంగా వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇన్ని స్థానాలు రావడానికి  ప్రధాన కారణం ‘ప్రజా కూటమి’ అని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకోవడంలో గత ఎన్నికల్లో విఫలమయ్యామని, ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ తమకు అనుకూలంగా ఉంటుందని, కచ్చితంగా అధికారంలోకి వస్తామని    కాంగ్రెస్‌ తొలుత భావించింది. ఈ క్రమంలో టీజేఎస్, సీపీఐని కలుపుకోవడంతో ఇంకాస్త బలంగా కన్పించింది. అయితేటీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్‌ వ్యతిరేక పునాదులపై ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా సోనియా, రాహుల్‌ ముందు చంద్రబాబు మోకరిల్లారనే భావన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. తెలంగాణ ప్రజలు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇటు కాంగ్రెస్‌ శ్రేణులు కూడా ఈ కలయికను స్వాగతించలేదు. దీంతో పరిణామాలన్నీ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారాయి.

కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై ‘అనంత’లో గుబులు
తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు బెడిసికొట్టడంతో ఆ ప్రభావం ఏపీలో పడుతుందని ‘అనంత’ టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు తీవ్ర తప్పిదం చేశారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఆ పరిస్థితి వస్తే తాను ఉరేసుకుంటానని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారంటే ఆ కలయిక ఎంత అపవిత్రమైందో తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని డీసీసీ అధ్యక్షుడు కోట సత్యం వ్యాఖ్యానిస్తున్నారంటే టీడీపీ పట్ల కాంగ్రెస్‌ శ్రేణుల్లో కూడా ఏస్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. గ్రామాలకు వెళ్లినప్పుడు కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపై సాధారణ ప్రజలు, విద్యావంతులు ప్రశ్నిస్తే టీడీపీ నేతలు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని ‘అనంత’ టీడీపీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు చెబుతున్నారు. చంద్రబాబు తప్పుచేశారని పేరు చెప్పేందుకు ఇష్టపడని చాలామంది మండల కన్వీనర్లు, టీడీపీ జిల్లా కమిటీలోని నాయకులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఫలితాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడా ఘోర పరాభావం తప్పదనే నిర్ణయానికి వచ్చారు. కనీసం కాంగ్రెస్‌తో పొత్తు లేకుంటే కాస్తయినా గౌరవం దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేసీఆర్, మోదీతో శత్రుత్వం పెంచుకోవడం కూడా ఇబ్బందే..
టీడీపీతో పొత్తు దెబ్బకు తెలంగాణలో కాంగ్రెస్‌ కుదేలవడంతో పాటు జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్యతో పాటు చాలా మంది హేమాహేమీలైన నేతలు ఓటమిపాలయ్యారు. దీంతో ‘అనంత’లో కూడా కీలక నేతల్లో ఓటమి గుబులు మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు తమపై కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉండటంతో ఆందోళన మరింత పెరిగింది. ముఖ్యంగా నందమూరి సుహాసినిని కూకట్‌పల్లిలో పోటీ చేయించడం, ఆమె ఓడిపోవడంతో నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు వీధిలో పడేశారనే భావన టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. తన కుమారుడు లోకేశ్‌ను ఎక్కడా పోటీ చేయించకుండా మంత్రివర్గంలోకి తీసుకున్న చంద్రబాబు హరికృష్ణ కుటుంబానికి అండగా నిలవాలనుకుంటే ఆమెను కూడా మంత్రివర్గంలోకి తీసుకుని ఉండొచ్చని, కానీ తెలంగాణలో పోటీ చేయించి వారి ప్రతిష్టను దిగజార్చారనే చర్చ సాగుతోంది. దీనికి తోడు ‘ఇంటగెలవలేనమ్మ రచ్చ గెలిచిందంట’ అన్నట్లు పొరుగు తెలుగు రాష్ట్రంలో గెలవలేని స్థితి ఉన్నప్పుడు జాతీయ రాజకీయాల్లో వేలుపెట్టి చంద్రబాబు మరింత తప్పు చేశారనే భావన టీడీపీ నేతల్లో నెలకొంది. తెలంగాణలో జోక్యం చేసుకుని కేసీఆర్‌తో, బీజేపీ వ్యతిరేక కూటమి పేరుతో జాతీయస్థాయి నేతలను కలిసి మోదీతో చంద్రబాబు శత్రుత్వం పెంచుకున్నారు. ఇద్దరితో శత్రుత్వం పెంచుకున్న ప్రభావం ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ప్రతికూలంగా ఉంటాయని టీడీపీ ఎమ్మెల్యేలే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో హిందూపురం, అనంతపురం, ధర్మవరం, రాప్తాడు ఎమ్మెల్యేలు కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లిలో, మహబూబ్‌నగర్‌లో కాలవ శ్రీనివాసులు ప్రచారం చేశారు.
వీరు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాలతో పాటు తాడిపత్రి, పెనుకొండ స్థానాల్లో టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ప్రజావ్యతిరేకత ఉంది.
అవినీతి ఆరోపణలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు.
ఇప్పటికే శింగనమల, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, గుంతకల్లు, కదిరి నియోజకవర్గాల సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందని, గెలిచే పరిస్థితి లేదని చెప్పకనే చెప్పారు.
ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకత, తమపై ఉన్న వ్యతిరేకత వెరసి ‘అనంత’లో వచ్చే ఎన్నికల్లో ఫలితాలు పూర్తిగా తారుమారయ్యే పరిస్థితి ఉందనే నిర్ణయానికి వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement