జై సమైక్యాంధ్ర అంటూ సమైక్య వాదులు శనివారం రాజంపేటలో రణభేరి మోగించారు. భానుడి సెగను సైతం లెక్కచేయక కేంద్రానికి వినపడేలా సమైక్య నినాదాలు చేశారు. వంగపండు ఉష బృందం ఆలపించిన పాటలు సమైక్య వాదులను ఉత్తేజపరిచాయి.
రాజంపేట, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై రగిలిన గుండెలతో రాజంపేటలో శనివారం రణభేరి మోగించారు. స్థానిక ప్రభుత్వ క్రీడామైదానంలో సమైక్యాంధ్రపరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో లక్షగళ సమైక్య రణభేరి పెద్దఎత్తున నిర్వహించారు. ఈ రణభేరికి సమైక్యవాదులు వేలాదిగా తరలివచ్చారు. భానుడి సెగను సైతం లెక్క చేయకుండా కేంద్రానికి వినబడేలా నినదించారు. ఆధ్యంతం సమైక్యహోరుతో రణభేరి కొనసాగింది. విభజనపై వ్యతిరేకతను ఎలుగెత్తి చాటారు. ఎమ్మెల్యే ఆకేపాటి, కాంగ్రెస్ ఇన్‌చార్జి మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య పాల్గొన్నారు. వంగపండు ఉష బృందం ఆలపించిన పాటలు సభికులను ఉత్తేజపరిచాయి. అల్లూరి సీతారామరాజు, తెలుగుతల్లి వేషధారణలు ఆకట్టుకున్నాయి. తెలుగుతల్లి ఆక్రందనే సీమాంధ్ర ఉద్యమమని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేసి బయటికి వస్తే అసెంబ్లీ, పార్లమెంటులో విభజన బిల్లు ఎలా ఆమోదం పొందుతుందన్నారు. విభజన వల్ల అనేక విధాలుగా నష్టపోయేది సీమాంధ్ర అన్నారు. విభజన కాక ముందే కేసీఆర్ చేస్తున్న ప్రకటనలతో సీమాంధ్ర ఉద్యమం మరింత ఎగిసిపడుతోందన్నారు. ప్రజల కోసం రాజకీయాలు చేయాలే తప్ప పదవుల కోసం కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మయ్య మాట్లాడుతూ తెలంగాణావాసులు వెనకబడి ఉన్నారని చెప్పడం అవాస్తవమన్నారు. ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తర్వాత అభివృద్థి చెందింది తెలంగాణవారేనన్నారు. మన ప్రాంతం నుంచి వచ్చే ఆదాయంతో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద భాగ్యనగరంగా అవతరించిందన్నారు.
ఏఐటీఎస్ అధినేత చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం రెండృుగా చీలిపోతే రాయలసీమ ఎడారిగా మిగిలిపోతుందన్నారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఉద్యమాలతో రగిలిపోతుంటే ఇంతవరకు కేంద్రం ఏ మాత్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. మోదుగుల కళావతమ్మ కళాశాల అధినేత పెంచలయ్య, ఉద్యోగ రాజంపేట జేఏసీ చైర్మన్ ఎస్వీరమణ తదితరులు కూడా ఈ సందర్భంగా ప్రసంగించారు. సభ ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.
రణ నారీ భేరి
Published Sun, Sep 15 2013 3:25 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement