స్వల్ప సంఘటనలు మినహా తొలిపోరు ప్రశాంతం | first phase elections | Sakshi
Sakshi News home page

స్వల్ప సంఘటనలు మినహా తొలిపోరు ప్రశాంతం

Published Mon, Apr 7 2014 3:18 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

స్వల్ప సంఘటనలు మినహా తొలిపోరు ప్రశాంతం - Sakshi

స్వల్ప సంఘటనలు మినహా తొలిపోరు ప్రశాంతం

 స్థానిక పోరులో తొలి అంకం పరిసమాప్తమైంది. 5 నియోజకవర్గాల పరిధిలోని 29 మండలాల్లోని 29 జెడ్పీటీసీ, 326 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం పోలింగ్ ముగిసింది. టీడీపీ నేతలు ఆర్థిక, అంగ బలంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పలు చోట్ల తెగబడ్డారు. కొన్నిచోట్ల భౌతిక దాడికి పాల్పడి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను గాయపరిచారు.

 

ఎమ్మెల్సీ బత్యాల తన సొంత పంచాయతీలో రిగ్గింగ్‌కు తెగించారు. సుండుపల్లి మండలం వీఎన్ పల్లిలో ఓటేసేందుకు వచ్చిన వృద్ధురాలు ఎండదెబ్బకు మృత్యువాతపడ్డారు. ఇలాంటి సంఘటనలు మినహా తక్కిన అన్నిచోట్ల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకే ఓటర్లు పట్టం కట్టినట్లు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది.


 
 
 సాక్షి, కడప: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తొలిపోరులో మైదుకూరు, బద్వేలు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని 29 మండలాల్లో 29 జెడ్పీటీసీ, 326 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా 80.40 శాతం పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ నిర్వహించారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 9 గంటల తర్వాత ఊపందుకుంది. 9 గంటల వరకు  12 శాతం పోలింగ్ నమోదైంది.

 11 గంటలకు 38.2 శాతం, ఒంటిగంటకు 60 శాతం, 3 గంటలకు 70.8 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలకు 80.40 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం వరకూ ఓటర్లరద్దీ కొనసాగింది. ఆపై తగ్గింది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసింది.
 
 ‘టీడీపీ’ తెగబడింది ఇక్కడే:

  రాయచోటి మండలం దిగువాబోరం గ్రామంలో ఏజెంట్ల నియామకంలో తలెత్తిన వివాదంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు కట్టెలతో దాడికి తెగబడ్డారు. దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల చలపతి నాయుడు చెవి తెగిపోయింది. వెంకటరమణ తలకు గాయమైంది. పుల్లంపేట మండలం దొండ్లపల్లిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ సుబ్రహ్మణంపై టీడీపీ ఏజెంట్లు దాడి చేశారు.

తీవ్రంగా గాయపడిన సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రికి తరలించారు.చిన్నమండెం మండలం మల్లూరులో ఓ టీడీపీ కార్యకర్త పోలీసుతో గొడవకు దిగారు.  పోలీస్ టీపీని విసిరేసిన టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు.

 ఎంపీటీసీ స్థానాలు 332...

 ఓటింగ్ జరిగింది 326:తొలివిడత ఎన్నికలు జరగాల్సిన ఎంపీటీసీ స్థానాలు 332 ఉన్నాయి. అయితే ఇందులో ఆరుస్థానాలు(చాపాడు-2, కోడూరు-1, ఓబుళవారిపల్లి-1, రామాపురం-1, సుండుపల్లి-1) ఏకగ్రీవమయ్యాయి. ఇవి మినహా తక్కిన అన్ని స్థానాలకు పోలింగ్ జరిగింది.

 పోలింగ్ ప్రశాంతం:

 జిల్లా యంత్రాంగం పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించడంలో విజయం సాధించారు. రెండు, మూడు చోట్ల చెదుమదురు సంఘటనలు జరిగినా తక్కిన అన్ని చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు సాగడంలో జిల్లా కలెక్టర్ శశిధర్, ఎస్పీ అశోక్‌కుమార్ కీలకపాత్ర పోషించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement