వేంపల్లెలో ఓటు వేసేందుకు బారులుదీరిన ఓటర్లు
‘స్థానిక’ ఘట్టం పూర్తయింది. శుక్రవారంతో రెండోవిడత పోలింగ్ కూడా ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికలు జరిగిన నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కామనూరులో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.
పెండ్లిమర్రి మండలం మాచునూరు, తిప్పరాజుపల్లెలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మిట్టమీదపల్లిలో ఓటేసేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు ఎండదెబ్బకు తాళలేక మృతిచెందింది. కోగటం, పెద్దశెట్టిపల్లి, శంకరాపురం, కొత్తపేటలో ఈ ఎన్నికల్లో ఓటింగ్ జరగడం గమనార్హం.
సాక్షి, కడప: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లోని 21 జెడ్పీటీసీ, 209 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 9 గంటల వరకూ నెమ్మదిగా సాగిన ఓటింగ్ ఆ తర్వాత జోరందుకుంది. 9 నుంచి మధ్యాహ్నం 1 గంటలోపే చాలాచోట్ల 50 శాతంపైగా ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగిసింది. జిల్లా అంతటా 84.15 శాతం ఓటింగ్ నమోదైంది.
కామనూరులో రిగ్గింగ్!
ప్రొద్దుటూరు పరిధిలోని కామనూరులో రిగ్గింగ్ జరిగింది. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు పోలింగ్‌బూత్‌లో కూర్చోవడంతో కొద్దిసేపు పోలింగ్ జరిగింది. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన తనయుడు కొండారెడ్డి బూత్‌లోకి వచ్చి బయటకు వెళ్లాలని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై హుకుం జారీ చేశారు. దీంతో ఏజెంట్లు బయటకు వచ్చారు. ఆపై సాయంత్రం వరకూ విడతల వారీగా ‘సైకిల్’ గుర్తుపై రిగ్గింగ్ చేసుకున్నారు.
కోగటంలో పోలింగ్
ఎమ్మెల్యే వీరశివారెడ్డి స్వగ్రామం కోగటంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరగడం గమనార్హం. ఎమ్మెల్యే వీరశివాతో, పుత్తా నరసింహారెడ్డి ఏకం కావడంతో ఈ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ తప్పదని అంతా భావించారు. అయితే వీరశివా సోదరుడు ప్రతాప్‌రెడ్డి తనయులు ఏజెంట్లుగా కూర్చోవడంతో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఇక్కడ 2833 ఓట్లు ఉండగా 2099 ఓట్లు పోలయ్యాయి. తమకు నచ్చిన వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకునేందుకు ఓటేయడం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.
కలెక్టర్ హామీతో ఓటింగ్
ప్రొద్దుటూరు నియోజకవర్గం చెన్నమరాజుపల్లె ఎంపీటీసీ పరిధిలోని నాగాయపల్లె ఎస్సీకాలనీలో జెడ్పీటీసీ ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. తమ సమస్యలు ఎవ్వరూ పట్టించుకోలేదని ఇందిరమ్మ బిల్లుల నుంచి వీధిలైట్ల వరకూ అన్ని సమస్యలు ఉన్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు. దీంతో ఆర్వో బాలసుబ్రహ్మణ్యం పరిస్థితిని కలెక్టర్‌కు వివరించారు. సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ పంచాయతీ సర్పంచ్ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి బంధువు కావడం విశేషం.
జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు సంఘటనలు...:
పెండ్లిమర్రి మండలం మాచునూరులో వైఎస్సార్‌సీపీ, టీడీ పీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో ఏడగురు వైఎస్సార్‌సీపీ, ఆరుగురు టీడీపీ అభ్యర్థులకు గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
పెండ్లిమర్రి మండలం తిప్పరాజుపల్లెలోనూ వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ప్రొద్దుటూరు పరిధిలోని పెన్నానగర్‌లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. వన్‌టౌన్ సీఐ మహేశ్వరరెడ్డి ఏకపక్షంగా వ్యవహరించి వైఎస్సార్‌సీపీ వర్గీయులపై కన్నెర్ర చేశారు.పెద్దశెట్టిపల్లి, శంకరాపురం, కొత్తపేట, నరసింహాపురంలో 20 ఏళ్ల తర్వాత స్వేచ్ఛాయుత ఓటింగ్ జరిగడం విశేషం.
వేముల మండలం పెద్దజూటూరులో భారీ బందోబస్తు మధ్య ఓటింగ్ నిర్వహించారు.సంతకొవ్వూరులో ఉదయం బ్యాలెట్ పేపర్‌పై ‘ముద్ర’ సరిగాపడలేదని ఓటర్లు ఆరోపించారు. దీంతో అధికారులు స్టాంపును పరిశీలించి పోలింగ్‌ను సజావుగా నిర్వహించారు.