సాక్షి ప్రతినిధి, కడప: రాజంపేట తెలుగుదేశంలో ముసలం పుట్టిందా.. పార్టీకి వీరవిధేయులుగా ఉన్న నేతలు తిరుగుబావుటాకు సిద్ధమయ్యారా.. టీడీపీలోని కోవర్టుల కారణంగానే అర్హులకు అన్యాయం చోటుచేసుకుంటున్నదని భావిస్తున్నారా.. ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం లభిస్తోంది.. రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కమ్మ, బలిజ సామాజిక వర్గాలు అండగా నిలుస్తున్నాయి. అందులో భాగంగా కష్టనష్టాలను ఓర్చుకుని పార్టీని నెట్టుకొస్తున్నారు. పార్టీలో ఉన్న వారినే ప్రోత్సహించాలని అభిప్రాయ పడుతూ వస్తున్నారు. తమలో ఒకరిని ఎంపిక చేయాలని, తాము సమర్థులం కాదని భావిస్తే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. అన్నింటికి తలూపిన నేతలు ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో మండిపడుతున్నారు. ఎన్నికల్లో డబ్బే ప్రధాన అస్త్రంగా పనిచేస్తుందనుకోవడం పొరపాటని, వాస్తవాలను విస్మరించి నేతలు ఊహల్లో పయనిస్తున్నారని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు.
చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం....
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం 2.12గంటలకు కాంగ్రెస్ పార్టీ నేత మేడా మల్లికార్జునరెడ్డి తెలుగుదేశం కండువా వేసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గత ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన డబ్బును మంచినీళ్లు లెక్కన ఖర్చుపెట్టినా ఘోరంగా ఓడిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాథరెడ్డి చేతిలో 38,219 భారీ ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సన్నిహితుడుగా మెలుగుతూ వచ్చిన మేడా మల్లికార్జునరెడ్డి కొంతకాలంగా ఊగిసలాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ఆదివారం టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
రగులుతున్న తెలుగుతమ్ముళ్లు....
కాంగ్రెస్ నేత మేడా మల్లికార్జునరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతుండటంతో తెలుగుతమ్ముళ్లు రగిలిపోతున్నారు. పార్టీకోసం కష్టపడుతున్న వారికి ప్రాధాన్యత ఉండటం లేదని ఆరోపిస్తున్నారు.
మాజీ మంత్రి బ్రహ్మయ్య తనయుడు సైతం అసమ్మతి బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. మేడా మల్లికార్జునరెడ్డికి టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీలో చేరాలనే తలంపు అధికంగా ఉండేదని, అటు వైపు అవకాశం లేకపోవడంతో తెలుగుదేశం పంచన చేరుతున్నారని, ఇలాంటి వాస్తవాలను గ్రహించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని వారు నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. మేడాను పార్టీలో చేర్చుకునే ముందుగా సీనియర్ నేతలను సైతం సంప్రదించకపోవడాన్ని అక్కడి నేతలు జీర్ణించుకోలేకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు సమాచారం.
రాజంపేట దేశంలో ముసలం
Published Sun, Mar 16 2014 3:51 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement
Advertisement