ఓట్లకు రెక్కలొచ్చాయ్‌! | Ysrcp votes removing by tdp in kadapa | Sakshi
Sakshi News home page

ఓట్లకు రెక్కలొచ్చాయ్‌!

Published Thu, Aug 2 2018 3:40 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Ysrcp votes removing by tdp in kadapa - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: ఓటు.. దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఆయుధం. పవిత్రమైన ఓటు హక్కును పాలకులు కర్కశంగా కాలరాస్తున్నారు. ప్రతిపక్షానికి ఓటు వేస్తారనే అనుమానం వస్తే చాలు ఓటర్ల జాబితా నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తు న్నారు. ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఓట్లను మాయం చేసేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలన్న ఆరాటంతో ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్‌ విసురుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతల బరితెగింపుపై జనం మండిపడుతున్నారు. ప్రధానంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారుల ఓట్లు గల్లంతు కావడం గమనార్హం.

మరణించిన ఓటర్లు, డబుల్‌ ఎంట్రీలు, బోగస్‌ ఓట్లు, స్థానికంగా ఉండడం లేదు.. ఇలా పలు కారణాలతో ఓటర్ల జాబితాల నుంచి ఓట్లను తొలగించామని అధికారులు పైకి చెబుతున్నా.. వాస్తవానికి టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే వైఎస్సార్‌సీపీ మద్దతుదార్లు, అభిమానుల ఓట్లపై వేటు వేసినట్లు స్పష్టమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీల సభ్యుల ఇళ్లల్లోనే రెవెన్యూ సిబ్బంది కూర్చుని ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే టీడీపీ నాయకులు ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు.

ప్రజాప్రతినిధుల ఓట్లపై గురి ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అయిన వైఎస్సార్‌ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు అధికారమే అండగా ఇష్టారాజ్యంగావ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లనే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ జిల్లాలో దాదాపు 85 వేల ఓట్లను తొలగించారు. జిల్లా కేంద్రమైన కడపలో భారీగా ఓట్లు మాయమయ్యాయి. 2014 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌ జిల్లాలో దాదాపు 2,45,000 ఓట్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఒక్కసారిగా 1,60,000కు పడిపోయింది.

కడప ఎమ్మెల్యే ఎస్‌బీ అంజాద్‌ బాషా గోకుల్‌ సర్కిల్‌ సమీపంలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ వీధిలో డోర్‌ నంబరు సి–17–284లో నివాసం ఉంటుండగా.. ఆయన ఓటు మాత్రం డోర్‌ నంబరు సి–17–280లోకి మారిపోయింది. అక్కడ నివాసం ఉంటున్న వారి ఓట్లను జాబితా నుంచి తొలగించారు. కడప నగరంలో ఏకంగా కార్పొరేటర్ల ఓట్లు సైతం గల్లంతయ్యాయి. కడప నగర పాలక సంస్థ పరిధిలోని దాదాపు 12 మంది కార్పొరేటర్లతోపాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు జాబితా నుంచి కనిపించకుండా పోయాయి. వీరంతా 2014లో పార్లమెంట్, శాసనసభ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. తమ ఓటు హక్కును తొలగించడంతో కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు.

ప్రతిపక్షం బలంగా ఉన్న చోట కుట్రలు  
నెల్లూరు జిల్లాలో 2 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీ సాధించిన నియోజకవర్గాల్లోనే ఈ ఓట్లను తొలగించడం గమనార్హం. 2015 నాటికి సిద్ధం చేసిన ఓట్లర్ల తుది జాబితా, 2018 మార్చిలో ప్రకటించిన తుది జాబితా మధ్య భారీ వ్యత్యాసం ఉంది. గతంలో వైఎస్సార్‌సీపీకి చెందిన నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనీల్‌కుమార్‌యాదవ్, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యంతో సహా పదుల సంఖ్యలో ప్రముఖుల ఓట్లు గల్లంతయ్యాయి. అప్పట్లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు ఇవ్వడంతో వారి పేర్లు మళ్లీ ఓటర్ల జాబితాలో చేరాయి. నెల్లూరు జిల్లాలో 2015లో మొత్తం ఓటర్ల సంఖ్య 22,79,152 కాగా, ఈ ఏడాది మార్చి నాటికి ఆ సంఖ్య 20,78,627కు పడిపోయింది. అంటే 2,00,525 ఓట్లను తొలగించారు. విశాఖపట్నం జిల్లాలో 97,268 ఓట్లు కనుమరుగయ్యాయి.

కర్నూలు జిల్లాలో 3 లక్షల ఓట్లు తొలగింపు
కర్నూలు జిల్లాలో దాదాపు 3 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. అధికార పార్టీ నేతలు రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి, వైఎస్సార్‌సీపీ ప్రభావం బలంగా ఉన్న చోట ఆ పార్టీ మద్దతుదార్ల ఓట్లను తొలగించేలా జాగ్రత్తపడ్డారు. ముఖ్యంగా పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, కోడుమూరు, ఆదోని నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం ఓట్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. జిల్లాలో 2014 ఎన్నికల సమయంలో మొత్తం ఓటర్లు 30,56,867 కాగా, ఈ ఏడాది జూలై 20వ తేదీ నాటికి 27,56,222 మంది మిగిలారు. అంటే 3,00,645 ఓట్లపై వేటు పడింది.

నాలుగేళ్లలోనే 3,19,666 ఓట్లు గల్లంతు  
కృష్ణా జిల్లాలో 3,19,666 ఓట్లు గల్లంతైనట్లు తేలింది. 2014 ఎన్నికల నాటికి అధికారికంగా ఓటర్ల సంఖ్య 33,37,071 కాగా, ప్రస్తుత జాబితాలో 30,17,405 మంది ఉన్నారు. 3,19,666 మంది ఓటుహక్కు కోల్పోయారు. కేవలం నాలుగేళ్లలో 3 లక్షలకు పైగా ఓట్లు తగ్గిపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 2014లో ఓటర్ల సంఖ్య 30,35,542 కాగా, 2018 నాటికి ఈ సంఖ్య 28,42,188కు పడిపోయింది. 1,93,354 ఓట్లు గల్లంతయ్యాయి.

ఓటు హక్కు పోయింది
‘‘నేను నెల్లూరు నగరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నా. గత నాలుగు ఎన్నికల్లో ఓటు వేశాను. 20 ఏళ్లుగా నా చిరునామా మారలేదు. కానీ, నా చిరునామా తెలియక ఓటును తొలగించామని బీఎల్‌వో అధికారులు చెప్పారు. ఓటు హక్కు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నా’’ – జంగం ఆశోక్, చిరు వ్యాపారి, నెల్లూరు

కార్పొరేటర్ల ఓట్లు గల్లంతు
‘‘వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయనే ఉద్దేశంతోనే కడపలో అధిక సంఖ్యలో ఓట్లపై వేటు వేశారు. తొలగించిన వాటిలో మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులైన 12 మంది కార్పొరేటర్ల ఓట్లను కూడా తొలగించారు. అందులో నా ఓటు కూడా ఉంది. కుట్రపూరితంగా పెద్ద మొత్తంలో ఓట్లను తొలగించడం దారుణం’’  
– పాకా సురేష్‌కుమార్, 47వ డివిజన్‌ కార్పొరేటర్, కడప

30 శాతం పోలింగ్‌ కూడా జరగదు
‘‘వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో ఓట్లను తొలగించారు. ఓట్ల తొలగింపు గురించి ముగ్గురు కలెక్టర్లకు చెప్పాం, ఉన్నతాధికారులకు తెలియజేశాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. పాత ఓటరు జాబితాతో ఎన్నికలు జరిగితే 60 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదవుతోంది. కొత్త జాబితాతో ఎన్నికలకు వెళితే పోలింగ్‌ 30 శాతానికి మించదు’’ – ఎస్‌బీ అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే, కడప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement