Votes remove process
-
HYD: డబుల్ ఓట్ ఇక ఔట్!.. ఎన్నికల సంఘం స్పెషల్ డ్రైవ్..
సొంతూరిలో ఒక ఓటు.. చదువుకున్న చోట మరో ఓటు.. ఉద్యోగం కోసం వలస వెళ్లిన చోట మరో ఓటు.. కొందరికైతే ఒకే నియోజకవర్గంలో వేర్వేరు చోట్ల ఓట్లు.. ఇలా చాలా మందికి ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. దీనితో ఎన్నికల సమయంలో గందరగోళం, కొన్నిసార్లు అక్రమాలకు ఆస్కారం కలుగుతోంది. ఈ క్రమంలో మల్టిపుల్ ఓట్లను ఏరివేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 14 లక్షలకుపైగా మల్టిపుల్ ఓట్లను గుర్తించి తొలగించింది. తాజాగా మరోదఫా పరిశీలనకు సిద్ధమైంది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 మేరకు దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుంది. అయితే దేశంలో ఎక్కడో ఒక్కచోట మాత్రమే ఆ ఓటు నమోదై ఉండాలి. మరోచోటికి మారితే.. మొదట ఉన్నచోట రద్దు చేసుకుని, కొత్త ప్రాంతంలో నమోదు చేసుకోవాలి. కానీ రాష్ట్రంలో కొందరికి ఐదు నుండి పది ఓట్లు ఉండటం, ఒకే ఇంటి నంబర్‌పై నాలుగైదు వందల ఓట్లు నమోదుకావడం వంటివి వెలుగుచూశాయి. హైదరాబాద్‌లో కేవలం 85 ఇంటి నంబర్లపై ఏకంగా 14,037 ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. మేడ్చల్–మల్కాజిగిరిలో 28 ఇంటి నంబర్లలో 5,501 ఓట్లు, రంగారెడ్డి జిల్లాలో 33 ఇంటి నంబర్లలో 5,430 ఓట్లు, నల్లగొండలో 74 ఇంటి నంబర్లలో 11,126 ఓట్లు, ఖమ్మంలో 11 ఇంటి నంబర్లలో 2,678 ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటివి ఉన్నట్టు తేల్చారు. రాష్ట్రంలోని మొత్తం ముప్పైమూడు జిల్లాల్లో కేవలం 289 ఇంటి నంబర్లలో ఏకంగా 47,325 మంది ఓటర్లుగా నమోదై ఉన్నట్టు తాజా లెక్కలు చెప్తున్నాయి. అంటే ఒక్కో ఇంట్లో సగటున 160 మందికిపైనే ఓటర్లు ఉన్నట్టు అన్నమాట. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పరిశీలన జరిపి.. ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా.. ఒకే పేరు, ఫోటోతో వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారిని గుర్తించింది. ఇలా ఇప్పటివరకు 14,09,294 ఓట్లను రద్దు చేసింది. ఇంకా ఇలాంటి ఓట్లు భారీగా ఉన్నట్టు రాజకీయ పక్షాలు ఫిర్యాదులు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఒక ఇంటి నంబర్‌పై ఆరు కంటే ఎక్కువ ఓట్లు ఉన్నచోట ప్రత్యేక పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. తాజాగా రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో సాధారణ సగటుకు మించి ఓటర్లున్న ప్రాంతాలపై ప్రత్యేక పరిశీలన మొదలుపెట్టింది. నోటీసులు ఇచ్చి.. డిక్లరేషన్ తీసుకుని.. ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో గుర్తిస్తున్నారు. అలాంటి వారికి ఎక్కడో ఒకేచోట ఓటును ఎంచుకోవాలంటూ నోటీసులు ఇస్తున్నారు. వారికి కావాల్సిన చోట ఓటుకు సంబంధించి డిక్లరేషన్ తీసుకుంటున్నారు. మిగతా చోట్ల ఉన్న ఓట్లను తొలగిస్తున్నారు. ఇలా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షలకుపైగా ఓట్లను రద్దు చేశారు. అయితే.. ఇప్పటికీ 289 ఇంటి నంబర్లలో ఒక్కో ఇంట్లో వందకు పైగా.. మరో 23,247 ఇంటి నంబర్లలో ఒక్కో ఇంట్లో 20కిపైగా ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. శనివారం నాటికి మొత్తంగా 2,99,77,659 మంది ఓటర్లు ఉన్నట్టు నిర్ధారించారు. ఎక్కువ నివాసాలు ఉంటే ప్రత్యేక నంబర్లు.. హైదరాబాద్ నగరంలో ఒకే ఇంటి నంబర్‌పై చాలా వ్యక్తిగత నివాసాలున్న ప్రాంతాలను గుర్తించి... ఆయా నివాసాలకు ప్రత్యేక నంబర్లు కేటాయించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఎన్నికల సంఘం తాజాగా సూచించింది. ఒకే ఇంటి నంబర్‌తో అపార్ట్మెంట్లు ఉంటే.. అందులోని ఫ్లాట్లకు వేర్వేరు నంబర్లు కేటాయించే పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరింది. ఇది కూడా చదవండి: తెలంగాణకు మరోసారి ప్రధాని మోదీ.. -
డేటా దోపిడీ.. జర భద్రం!
సాక్షి, చీరాల : తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ దర్శకత్వంలో నూతన దోపిడీకి తెరలేపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లే వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించాలని ఆన్లైన్లో దరఖాస్తు చేసినట్లు ఓ కొత్త నాటకానికి తెరదీశారు. ఎవరైనా ప్రత్యర్థి పార్టీ ఓట్లు తొలగించాలని ప్రయత్నించడం సర్వసాధారణం. కానీ ఇక్కడ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తొలగించాలని అదే పార్టీ నాయకులు ఆన్లైన్లో ఫిర్యాదు చేయడం ఏంటి? ఫారం–7 పేరుతో నియోజకవర్గంలోని చీరాల మున్సిపాలిటీ, చీరాల, వేటపాలెం మండలాల్లో 11 వేల వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించేందుకు ఆన్లైన్లో రెవెన్యూ అధికారులకు చేరాయంటే ఏ స్థాయిలో అధికారపార్టీ అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకెళితే.... చీరాల, వేటపాలెం మండలాల్లో 1,73,291 మంది ఓటర్లు ఉండగా మొత్తం 218 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. చీరాల మున్సిపాలిటీలో 60,078 ఓటర్లు ఉ ఉండగా వీరిలో పురుషులు 29,179, స్త్రీలు 30599 ఉన్నారు. చీరాల మండలంలోని 15 గ్రామాల్లోని 60,333 ఓటర్లు ఉండగా పురుషులు 29,827, స్త్రీలు 30,504 ఉన్నారు. వేటపాలెం మండలంలోని 9 గ్రామ పంచాయితీల్లో 52,872 ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 26,020, స్త్రీలు 26,852 ఉన్నారు. వైఎస్సార్ సీపీ ఓట్ల గల్లంతు.. వైఎస్సార్ సీపీ ఓటర్లను తొలగించాలని కోరుతూ బూత్ కన్వీనర్లే ఫిర్యాదు చేశారంటూ ఆన్లైన్లో వైసీపీ ఓట్లు తొలగింపుకు పాల్పడుతున్నారు టీడీపీ నేతలు. ఒక్కో బూత్ కన్వీనర్ ద్వారా 50 నుంచి 100 మంది వైసీపీ ఓట్లు తొలగించేలా ఆన్లైన్లో ఫారం–7 ద్వారా దరఖాస్తులు చేసుకున్నారని చెప్పడం విశేషం. వీటిలో చీరాల మండలంలో 5965, మున్సిపాలిటీలో 3700, వేటపాలెం మండలంలో 2875 ఓట్లు తొలగించాలని ఫిర్యాదు చేయించారు. భవిష్యత్తుకు భద్రత ఉందా..? ప్రజాసాధికార సర్వేతో పాటుగా ఆధార్ అనుసంధానంతో ప్రజల బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు పొందిన వివరాలు, పొలం, కులం, ఏపార్టీకి సానుభూతిపరులు వంటి పూర్తి వివరాలు డేటా బేస్‌లో లభ్యం అవుతున్నాయి. అత్యంత నిక్షిప్తంగా ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన సమాచారం హైద్రాబాద్, విశాఖపట్నంలో టీడీపీ నాయకులకు చెందిన ఐటీ కంపెనీలకు ఓటర్లు, ప్రజల సమాచారం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు సైతం వేరే ఖాతాలకు వెళ్లే సైబర్ మోసాలు జరగనున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చక్రం తిప్పుతున్న టీడీపీ ఎమ్మెల్సీ, నేతలు.. చీరాల్లో గత నాలుగు దఫాలుగా ఓటమి చెందిన టీడీపీ ఈ సారి ఎలాగైనా గెలవాలనే తలంపుతో అక్రమ మార్గాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ ఓటర్లును ఓటరు జాబితాలనుంచి తొలగిస్తే తమకు అడ్డు ఉండదని, టీడీపీ అధినేత, అతని కుమారుడు మంత్రి అండగా ఉండాడనే గర్వంతో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు తెరవెనక ఉండటం, మీసేవా కేంద్రాల నిర్వహకులు, మండల, నియోజకవర్గ అధికారులతో కలిసి చేశారని పట్టణంలో ప్రచారం జరుగుతోంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 50 నుంచి 100 వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగింపులు చేసేలా ఆన్లైన్ దరఖాస్తులు చేయించారంటే టీడీపీ నీచ రాజకీయాలకు అడ్డు అదుపులేదా అని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. సైబర్ క్రైం కింద పోలీస్ కేసులు నమోదు.. నియోజకవర్గంలో 11వేల వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగింపుకు ఆన్లైన్లో ఫిర్యాదులు రావడంతో విస్తుపోయిన అధికారులు చీరాల ఒన్‌టౌన్, వేటపాలెం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అలానే ఫిర్యాదు దారుడికి, ఫిర్యాదులో పేర్కొన్న ఓటర్లుకు నోటీసులు అందించి వివరాలు, రికార్డులు చేయిస్తున్నారు. చీరాల్లో జరగుతున్న ఆన్లైన్ ఓటరు అక్రమాలపై పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైం క్రింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న కుట్ర.. నేను వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్‌గా ఉన్నాను. నా పేరుతో మా ఊరిలో వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించాలని ఫారం–7క్రింద 70 అర్జీలు పెట్టారు. తాను ఎవ్వరి ఓటు తీసేయమని అర్జీలు దాఖలు చేయలేదు. ఓట్లు తొలగించాలని మేం ఎందుకు అర్జీలు దాఖలు చేస్తాం. ఇదంతా టీడీపీ నాయకులు చేస్తున్న కుట్ర. నిజాలు నిగ్గు తేల్చాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం. –బి. చిట్టిబాబు వక్రమార్గాలు టీడీపీకి పెట్టిన విద్య.. అధికారం కోసం అక్రమార్గాలకు పాల్పడటం టీడీపీ నీచ సంస్కృతికి నిదర్శనం. తమ వారి ఓట్లు 37 తొలగించాలని మేమే అర్జీలు పెట్టామని నోటీసులు అందించడం దారుణం. తమ వారి ఓట్లు తొలగించడంతో పాటుగా డేటా అంతా టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లడం రాజ్యాంగాన్ని అపహాసనం చేసినట్లే. నిందితులను గుర్తించి వెంటనే శిక్షించాలి. –జి.వెంకటేశ్వర్లు. ముందే గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా.. ఐటీ గ్రిడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేతులు కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు టార్గెట్ చేసి తొలగించేందుకు కుట్ర చేస్తున్నారు. ఫారం–7 ద్వారా వైఎస్సార్ సీపీ సానుభూతి ఓటర్లే తమ ఓట్లు తొలగించాలని దరఖాస్తులు చేశారని దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం ఎలాంటి కుట్రలకు పాల్పడుతుందో ప్రజలకు అర్థం అవుతోంది. దీన్ని ముందుగానే పసిగట్టి కొద్దిరోజుల క్రితమే జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశా. చివరకు నా సొంత మేనల్లుడు, కుటుంబ సభ్యుల ఓట్లు తొలగించేదుకు కుట్ర చేయడం దారుణం. –ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, చీరాల -
టీడీపీ అధికార దుర్వినియోగం
-
ఓట్లకు రెక్కలొచ్చాయ్!
సాక్షి నెట్వర్క్: ఓటు.. దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఆయుధం. పవిత్రమైన ఓటు హక్కును పాలకులు కర్కశంగా కాలరాస్తున్నారు. ప్రతిపక్షానికి ఓటు వేస్తారనే అనుమానం వస్తే చాలు ఓటర్ల జాబితా నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తు న్నారు. ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఓట్లను మాయం చేసేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలన్న ఆరాటంతో ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ విసురుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతల బరితెగింపుపై జనం మండిపడుతున్నారు. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఓట్లు గల్లంతు కావడం గమనార్హం. మరణించిన ఓటర్లు, డబుల్ ఎంట్రీలు, బోగస్ ఓట్లు, స్థానికంగా ఉండడం లేదు.. ఇలా పలు కారణాలతో ఓటర్ల జాబితాల నుంచి ఓట్లను తొలగించామని అధికారులు పైకి చెబుతున్నా.. వాస్తవానికి టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే వైఎస్సార్సీపీ మద్దతుదార్లు, అభిమానుల ఓట్లపై వేటు వేసినట్లు స్పష్టమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీల సభ్యుల ఇళ్లల్లోనే రెవెన్యూ సిబ్బంది కూర్చుని ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే టీడీపీ నాయకులు ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ప్రజాప్రతినిధుల ఓట్లపై గురి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన వైఎస్సార్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు అధికారమే అండగా ఇష్టారాజ్యంగావ్యవహరించారు. వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లనే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ జిల్లాలో దాదాపు 85 వేల ఓట్లను తొలగించారు. జిల్లా కేంద్రమైన కడపలో భారీగా ఓట్లు మాయమయ్యాయి. 2014 ఎన్నికల సమయంలో వైఎస్సార్ జిల్లాలో దాదాపు 2,45,000 ఓట్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఒక్కసారిగా 1,60,000కు పడిపోయింది. కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజాద్ బాషా గోకుల్ సర్కిల్ సమీపంలోని ఎస్ఎఫ్ఎస్ వీధిలో డోర్ నంబరు సి–17–284లో నివాసం ఉంటుండగా.. ఆయన ఓటు మాత్రం డోర్ నంబరు సి–17–280లోకి మారిపోయింది. అక్కడ నివాసం ఉంటున్న వారి ఓట్లను జాబితా నుంచి తొలగించారు. కడప నగరంలో ఏకంగా కార్పొరేటర్ల ఓట్లు సైతం గల్లంతయ్యాయి. కడప నగర పాలక సంస్థ పరిధిలోని దాదాపు 12 మంది కార్పొరేటర్లతోపాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు జాబితా నుంచి కనిపించకుండా పోయాయి. వీరంతా 2014లో పార్లమెంట్, శాసనసభ, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. తమ ఓటు హక్కును తొలగించడంతో కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిపక్షం బలంగా ఉన్న చోట కుట్రలు నెల్లూరు జిల్లాలో 2 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీ సాధించిన నియోజకవర్గాల్లోనే ఈ ఓట్లను తొలగించడం గమనార్హం. 2015 నాటికి సిద్ధం చేసిన ఓట్లర్ల తుది జాబితా, 2018 మార్చిలో ప్రకటించిన తుది జాబితా మధ్య భారీ వ్యత్యాసం ఉంది. గతంలో వైఎస్సార్సీపీకి చెందిన నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనీల్‌కుమార్‌యాదవ్, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యంతో సహా పదుల సంఖ్యలో ప్రముఖుల ఓట్లు గల్లంతయ్యాయి. అప్పట్లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు ఇవ్వడంతో వారి పేర్లు మళ్లీ ఓటర్ల జాబితాలో చేరాయి. నెల్లూరు జిల్లాలో 2015లో మొత్తం ఓటర్ల సంఖ్య 22,79,152 కాగా, ఈ ఏడాది మార్చి నాటికి ఆ సంఖ్య 20,78,627కు పడిపోయింది. అంటే 2,00,525 ఓట్లను తొలగించారు. విశాఖపట్నం జిల్లాలో 97,268 ఓట్లు కనుమరుగయ్యాయి. కర్నూలు జిల్లాలో 3 లక్షల ఓట్లు తొలగింపు కర్నూలు జిల్లాలో దాదాపు 3 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. అధికార పార్టీ నేతలు రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి, వైఎస్సార్సీపీ ప్రభావం బలంగా ఉన్న చోట ఆ పార్టీ మద్దతుదార్ల ఓట్లను తొలగించేలా జాగ్రత్తపడ్డారు. ముఖ్యంగా పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, కోడుమూరు, ఆదోని నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం ఓట్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. జిల్లాలో 2014 ఎన్నికల సమయంలో మొత్తం ఓటర్లు 30,56,867 కాగా, ఈ ఏడాది జూలై 20వ తేదీ నాటికి 27,56,222 మంది మిగిలారు. అంటే 3,00,645 ఓట్లపై వేటు పడింది. నాలుగేళ్లలోనే 3,19,666 ఓట్లు గల్లంతు కృష్ణా జిల్లాలో 3,19,666 ఓట్లు గల్లంతైనట్లు తేలింది. 2014 ఎన్నికల నాటికి అధికారికంగా ఓటర్ల సంఖ్య 33,37,071 కాగా, ప్రస్తుత జాబితాలో 30,17,405 మంది ఉన్నారు. 3,19,666 మంది ఓటుహక్కు కోల్పోయారు. కేవలం నాలుగేళ్లలో 3 లక్షలకు పైగా ఓట్లు తగ్గిపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 2014లో ఓటర్ల సంఖ్య 30,35,542 కాగా, 2018 నాటికి ఈ సంఖ్య 28,42,188కు పడిపోయింది. 1,93,354 ఓట్లు గల్లంతయ్యాయి. ఓటు హక్కు పోయింది ‘‘నేను నెల్లూరు నగరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నా. గత నాలుగు ఎన్నికల్లో ఓటు వేశాను. 20 ఏళ్లుగా నా చిరునామా మారలేదు. కానీ, నా చిరునామా తెలియక ఓటును తొలగించామని బీఎల్వో అధికారులు చెప్పారు. ఓటు హక్కు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నా’’ – జంగం ఆశోక్, చిరు వ్యాపారి, నెల్లూరు కార్పొరేటర్ల ఓట్లు గల్లంతు ‘‘వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయనే ఉద్దేశంతోనే కడపలో అధిక సంఖ్యలో ఓట్లపై వేటు వేశారు. తొలగించిన వాటిలో మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులైన 12 మంది కార్పొరేటర్ల ఓట్లను కూడా తొలగించారు. అందులో నా ఓటు కూడా ఉంది. కుట్రపూరితంగా పెద్ద మొత్తంలో ఓట్లను తొలగించడం దారుణం’’ – పాకా సురేష్‌కుమార్, 47వ డివిజన్ కార్పొరేటర్, కడప 30 శాతం పోలింగ్ కూడా జరగదు ‘‘వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో ఓట్లను తొలగించారు. ఓట్ల తొలగింపు గురించి ముగ్గురు కలెక్టర్లకు చెప్పాం, ఉన్నతాధికారులకు తెలియజేశాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. పాత ఓటరు జాబితాతో ఎన్నికలు జరిగితే 60 శాతం మాత్రమే పోలింగ్ నమోదవుతోంది. కొత్త జాబితాతో ఎన్నికలకు వెళితే పోలింగ్ 30 శాతానికి మించదు’’ – ఎస్బీ అంజాద్ బాషా, ఎమ్మెల్యే, కడప -
ఓట్ల తొలగింపు ప్రక్రియపై సీఈసీ దృష్టి
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపు ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఓట్ల తొలగింపు ప్రక్రియపై రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులిచ్చాయి. పార్టీల ఫిర్యాదుల మేరకు స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా చర్యలు చేపట్టింది. దాంతో ఇద్దరు ఎన్నికల సంఘం సభ్యులు గురువారం హైదరాబాద్ చేరుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు నగరంలో వివిధ పార్టీ నేతలను ఎన్నికల సంఘం సభ్యులు కలవనున్నట్టు సమాచారం.