సాక్షి, చీరాల : తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ దర్శకత్వంలో నూతన దోపిడీకి తెరలేపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లే వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినట్లు ఓ కొత్త నాటకానికి తెరదీశారు. ఎవరైనా ప్రత్యర్థి పార్టీ ఓట్లు తొలగించాలని ప్రయత్నించడం సర్వసాధారణం. కానీ ఇక్కడ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తొలగించాలని అదే పార్టీ నాయకులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడం ఏంటి?
ఫారం–7 పేరుతో నియోజకవర్గంలోని చీరాల మున్సిపాలిటీ, చీరాల, వేటపాలెం మండలాల్లో 11 వేల వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించేందుకు ఆన్‌లైన్‌లో రెవెన్యూ అధికారులకు చేరాయంటే ఏ స్థాయిలో అధికారపార్టీ అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకెళితే.... చీరాల, వేటపాలెం మండలాల్లో 1,73,291 మంది ఓటర్లు ఉండగా మొత్తం 218 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. చీరాల మున్సిపాలిటీలో 60,078 ఓటర్లు ఉ ఉండగా వీరిలో పురుషులు 29,179, స్త్రీలు 30599 ఉన్నారు. చీరాల మండలంలోని 15 గ్రామాల్లోని 60,333 ఓటర్లు ఉండగా పురుషులు 29,827, స్త్రీలు 30,504 ఉన్నారు. వేటపాలెం మండలంలోని 9 గ్రామ పంచాయితీల్లో 52,872 ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 26,020, స్త్రీలు 26,852 ఉన్నారు.
వైఎస్సార్ సీపీ ఓట్ల గల్లంతు..
వైఎస్సార్ సీపీ ఓటర్లను తొలగించాలని కోరుతూ బూత్ కన్వీనర్లే ఫిర్యాదు చేశారంటూ ఆన్‌లైన్‌లో వైసీపీ ఓట్లు తొలగింపుకు పాల్పడుతున్నారు టీడీపీ నేతలు. ఒక్కో బూత్ కన్వీనర్ ద్వారా 50 నుంచి 100 మంది వైసీపీ ఓట్లు తొలగించేలా ఆన్‌లైన్‌లో ఫారం–7 ద్వారా దరఖాస్తులు చేసుకున్నారని చెప్పడం విశేషం. వీటిలో చీరాల మండలంలో 5965, మున్సిపాలిటీలో 3700, వేటపాలెం మండలంలో 2875 ఓట్లు తొలగించాలని ఫిర్యాదు చేయించారు.
భవిష్యత్తుకు భద్రత ఉందా..?
ప్రజాసాధికార సర్వేతో పాటుగా ఆధార్ అనుసంధానంతో ప్రజల బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు పొందిన వివరాలు, పొలం, కులం, ఏపార్టీకి సానుభూతిపరులు వంటి పూర్తి వివరాలు డేటా బేస్‌లో లభ్యం అవుతున్నాయి. అత్యంత నిక్షిప్తంగా ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన సమాచారం హైద్రాబాద్, విశాఖపట్నంలో టీడీపీ నాయకులకు చెందిన ఐటీ కంపెనీలకు ఓటర్లు, ప్రజల సమాచారం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు సైతం వేరే ఖాతాలకు వెళ్లే సైబర్ మోసాలు జరగనున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
చక్రం తిప్పుతున్న టీడీపీ ఎమ్మెల్సీ, నేతలు..
చీరాల్లో గత నాలుగు దఫాలుగా ఓటమి చెందిన టీడీపీ ఈ సారి ఎలాగైనా గెలవాలనే తలంపుతో అక్రమ మార్గాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ ఓటర్లును ఓటరు జాబితాలనుంచి తొలగిస్తే తమకు అడ్డు ఉండదని, టీడీపీ అధినేత, అతని కుమారుడు మంత్రి అండగా ఉండాడనే గర్వంతో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు తెరవెనక ఉండటం, మీసేవా కేంద్రాల నిర్వహకులు, మండల, నియోజకవర్గ అధికారులతో కలిసి చేశారని పట్టణంలో ప్రచారం జరుగుతోంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 50 నుంచి 100 వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగింపులు చేసేలా ఆన్‌లైన్ దరఖాస్తులు చేయించారంటే టీడీపీ నీచ రాజకీయాలకు అడ్డు అదుపులేదా అని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.
సైబర్ క్రైం కింద పోలీస్ కేసులు నమోదు..
నియోజకవర్గంలో 11వేల వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగింపుకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు రావడంతో విస్తుపోయిన అధికారులు చీరాల ఒన్‌టౌన్, వేటపాలెం పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అలానే ఫిర్యాదు దారుడికి, ఫిర్యాదులో పేర్కొన్న ఓటర్లుకు నోటీసులు అందించి వివరాలు, రికార్డులు చేయిస్తున్నారు. చీరాల్లో జరగుతున్న ఆన్‌లైన్ ఓటరు అక్రమాలపై పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైం క్రింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు.
టీడీపీ నాయకులు చేస్తున్న కుట్ర..
నేను వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్‌గా ఉన్నాను. నా పేరుతో మా ఊరిలో వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించాలని ఫారం–7క్రింద 70 అర్జీలు పెట్టారు. తాను ఎవ్వరి ఓటు తీసేయమని అర్జీలు దాఖలు చేయలేదు. ఓట్లు తొలగించాలని మేం ఎందుకు అర్జీలు దాఖలు చేస్తాం. ఇదంతా టీడీపీ నాయకులు చేస్తున్న కుట్ర. నిజాలు నిగ్గు తేల్చాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం.
–బి. చిట్టిబాబు
వక్రమార్గాలు టీడీపీకి పెట్టిన విద్య..
అధికారం కోసం అక్రమార్గాలకు పాల్పడటం టీడీపీ నీచ సంస్కృతికి నిదర్శనం. తమ వారి ఓట్లు 37 తొలగించాలని మేమే అర్జీలు పెట్టామని నోటీసులు అందించడం దారుణం. తమ వారి ఓట్లు తొలగించడంతో పాటుగా డేటా అంతా టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లడం రాజ్యాంగాన్ని అపహాసనం చేసినట్లే. నిందితులను గుర్తించి వెంటనే శిక్షించాలి.
–జి.వెంకటేశ్వర్లు.
ముందే గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా..
ఐటీ గ్రిడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేతులు కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు టార్గెట్ చేసి తొలగించేందుకు కుట్ర చేస్తున్నారు. ఫారం–7 ద్వారా వైఎస్సార్ సీపీ సానుభూతి ఓటర్లే తమ ఓట్లు తొలగించాలని దరఖాస్తులు చేశారని దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం ఎలాంటి కుట్రలకు పాల్పడుతుందో ప్రజలకు అర్థం అవుతోంది. దీన్ని ముందుగానే పసిగట్టి కొద్దిరోజుల క్రితమే జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశా. చివరకు నా సొంత మేనల్లుడు, కుటుంబ సభ్యుల ఓట్లు తొలగించేదుకు కుట్ర చేయడం దారుణం.
–ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, చీరాల
Comments
Please login to add a commentAdd a comment