సొంతూరిలో ఒక ఓటు.. చదువుకున్న చోట మరో ఓటు.. ఉద్యోగం కోసం వలస వెళ్లిన చోట మరో ఓటు.. కొందరికైతే ఒకే నియోజకవర్గంలో వేర్వేరు చోట్ల ఓట్లు.. ఇలా చాలా మందికి ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. దీనితో ఎన్నికల సమయంలో గందరగోళం, కొన్నిసార్లు అక్రమాలకు ఆస్కారం కలుగుతోంది. ఈ క్రమంలో మల్టిపుల్ ఓట్లను ఏరివేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 14 లక్షలకుపైగా మల్టిపుల్ ఓట్లను గుర్తించి తొలగించింది. తాజాగా మరోదఫా పరిశీలనకు సిద్ధమైంది.
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 మేరకు దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుంది. అయితే దేశంలో ఎక్కడో ఒక్కచోట మాత్రమే ఆ ఓటు నమోదై ఉండాలి. మరోచోటికి మారితే.. మొదట ఉన్నచోట రద్దు చేసుకుని, కొత్త ప్రాంతంలో నమోదు చేసుకోవాలి. కానీ రాష్ట్రంలో కొందరికి ఐదు నుండి పది ఓట్లు ఉండటం, ఒకే ఇంటి నంబర్‌పై నాలుగైదు వందల ఓట్లు నమోదుకావడం వంటివి వెలుగుచూశాయి.
హైదరాబాద్‌లో కేవలం 85 ఇంటి నంబర్లపై ఏకంగా 14,037 ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. మేడ్చల్–మల్కాజిగిరిలో 28 ఇంటి నంబర్లలో 5,501 ఓట్లు, రంగారెడ్డి జిల్లాలో 33 ఇంటి నంబర్లలో 5,430 ఓట్లు, నల్లగొండలో 74 ఇంటి నంబర్లలో 11,126 ఓట్లు, ఖమ్మంలో 11 ఇంటి నంబర్లలో 2,678 ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటివి ఉన్నట్టు తేల్చారు. రాష్ట్రంలోని మొత్తం ముప్పైమూడు జిల్లాల్లో కేవలం 289 ఇంటి నంబర్లలో ఏకంగా 47,325 మంది ఓటర్లుగా నమోదై ఉన్నట్టు తాజా లెక్కలు చెప్తున్నాయి. అంటే ఒక్కో ఇంట్లో సగటున 160 మందికిపైనే ఓటర్లు ఉన్నట్టు అన్నమాట.
ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పరిశీలన జరిపి..
ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా.. ఒకే పేరు, ఫోటోతో వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారిని గుర్తించింది. ఇలా ఇప్పటివరకు 14,09,294 ఓట్లను రద్దు చేసింది. ఇంకా ఇలాంటి ఓట్లు భారీగా ఉన్నట్టు రాజకీయ పక్షాలు ఫిర్యాదులు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఒక ఇంటి నంబర్‌పై ఆరు కంటే ఎక్కువ ఓట్లు ఉన్నచోట ప్రత్యేక పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. తాజాగా రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో సాధారణ సగటుకు మించి ఓటర్లున్న ప్రాంతాలపై ప్రత్యేక పరిశీలన మొదలుపెట్టింది.
నోటీసులు ఇచ్చి.. డిక్లరేషన్ తీసుకుని..
ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో గుర్తిస్తున్నారు. అలాంటి వారికి ఎక్కడో ఒకేచోట ఓటును ఎంచుకోవాలంటూ నోటీసులు ఇస్తున్నారు. వారికి కావాల్సిన చోట ఓటుకు సంబంధించి డిక్లరేషన్ తీసుకుంటున్నారు. మిగతా చోట్ల ఉన్న ఓట్లను తొలగిస్తున్నారు. ఇలా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షలకుపైగా ఓట్లను రద్దు చేశారు. అయితే.. ఇప్పటికీ 289 ఇంటి నంబర్లలో ఒక్కో ఇంట్లో వందకు పైగా.. మరో 23,247 ఇంటి నంబర్లలో ఒక్కో ఇంట్లో 20కిపైగా ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. శనివారం నాటికి మొత్తంగా 2,99,77,659 మంది ఓటర్లు ఉన్నట్టు నిర్ధారించారు.
ఎక్కువ నివాసాలు ఉంటే ప్రత్యేక నంబర్లు..
హైదరాబాద్ నగరంలో ఒకే ఇంటి నంబర్‌పై చాలా వ్యక్తిగత నివాసాలున్న ప్రాంతాలను గుర్తించి... ఆయా నివాసాలకు ప్రత్యేక నంబర్లు కేటాయించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఎన్నికల సంఘం తాజాగా సూచించింది. ఒకే ఇంటి నంబర్‌తో అపార్ట్‌మెంట్లు ఉంటే.. అందులోని ఫ్లాట్లకు వేర్వేరు నంబర్లు కేటాయించే పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరింది.
ఇది కూడా చదవండి: తెలంగాణకు మరోసారి ప్రధాని మోదీ..
Comments
Please login to add a commentAdd a comment