
వైఎస్సార్ జిల్లా: దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 14 పంటలకు మద్ధతు ధర పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని, కేంద్ర ప్రభుత్వం నిధులు పంపుతుంటే ఇక్కడ పేర్లు మార్చుకుని జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాహా చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. బీజీపీ సీనియర్ నాయకుడు కందుల రాజమోహన్ రెడ్డి ఎస్టేట్‌లో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఆడపడుచుల బంగారం బ్యాంకు అధికారులు వేలం వేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని చంద్రబాబునుద్దేశించి ప్రశ్నించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప ఎయిర్‌పోర్టు నిర్మాణం చేస్తే, దానిని వినియోగంలోకి తెచ్చింది ప్రధాని నరేంద్ర మోదీనేనని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అవకాశాన్ని చట్టంలో పరిశీలించమన్నారు..సెయిల్ మీటింగ్‌లో కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులే చెప్పారని గుర్తు చేశారు. ఆ తర్వాత తాము సమాచారం ఇచ్చి మెకేన్ ఆధ్వర్యంలో కమిటీ వేశామని తెలిపారు. దానికి కావాల్సిన సమాచారం ఇవ్వకుండా చంద్రబాబు నాటకాలు వేశారని, తన వైఫల్యం బయటపడుతుందని దొంగదీక్షలకు దిగారని ఎద్దేవా చేశారు.
20వ తేదీన దీక్షకు కూర్చుని 22న సమాచారం ఇచ్చిన ఘనత చంద్రబాబుదని అన్నారు. కేంద్రం లక్షన్నర కోట్ల నిధులు ఇస్తే ఏమీ ఇవ్వలేదని అంటున్నారని, ఇచ్చిన ప్రతి రూపాయి పందికొక్కుల్లా మెక్కారని తీవ్రంగా విమర్శించారు. ఐదేళ్లు దోచుకున్నారు..మళ్లీ అధికారం కావాలని అడుగుతున్నారని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టండి..రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment