janma bhoomi comitees
-
కేంద్ర పథకాలను జన్మభూమి కమిటీలు దోచుకున్నాయి
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి కులం, మతం రంగు పూయాలని చాలా మంది ప్రయత్నించారన్నారు. కానీ కులమతాలకతీతంగా పార్టీలో చేరికలు జరుగుతున్నాయన్నారు. ఇందిరా గాంధీ టైంలో గరీబీ హఠావో తప్ప ఇంకే పథకం లేదన్నారు. మోదీ టీ అమ్ముకునే స్థాయి నుంచి వచ్చారని.. బీజేపీలో నాయకులందరూ కింది స్థాయి నుంచి వచ్చారని.. ప్రజల కష్టసుఖాలు బాగా తెలుసని కన్నా పేర్కొన్నారు. దేశంలో ప్రజలు మోదీ పాలనను కోరుకుంటున్నారన్నారు. -
కార్పొరేషన్ రుణాలు కొందరికే !
ఆశల పల్లకి ఎక్కించడం ఆపై నేలపై పడేయడం... మళ్లీ ఎన్నికల సమయంలో ఏదో చేస్తామంటూ మభ్యపెట్టడం.. ఇదీ తెలుగుదేశం పార్టీ తీరు. అర్హులైన పేదలందరికీ వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలిస్తామని ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించింది. అది నమ్మిన పేదలు రుణాల కోసం దరఖాస్తు చేసుకుని ఆపై అధికారులు, పార్టీ నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ప్రత్యేక కార్పొరేషన్లంటూ ఊదరగొడుతున్న చంద్రబాబుపై.. కార్పొరేషన్ల పేరుతో ఓట్లు దండుకోవాలనుకున్న అధికార పార్టీపై రుణం కోసం దరఖాస్తు చేసి నిరాశపడిన ప్రజానీకం భగ్గుమంటోంది. సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): వివిధ కులాల పేరుతో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు కాగితాలకే పరిమితమవుతున్నాయి. కార్పొరేషన్ల కింద అర్హులందరికీ రుణాలిస్తామని చెబుతున్న మాటలు నీటిమూటలుగానే మిగులుతున్నాయి. 2018 జూన్‌లో రుణాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎందుకు రుణాలు పంపిణీ కాలేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రుణాలకు దరఖాస్తులు ఆహ్వానించే సమయంలో కార్పొరేషన్ వద్ద లక్ష్యానికి మించిన నిధులు సిద్ధంగా ఉండాలి. కానీ దరఖాస్తులను పెద్ద ఎత్తున ఆహ్వానించి, తరువాత పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. రుణానికి ఎంపికైనట్లు తెలుసుకున్న వారు ఎంపీడీఓ కార్యాలయాల వద్దకు వెళ్లి అడిగితే రుణం విడుదల కాలేదంటూ అధికారుల నుంచి వస్తున్న సమాధానం విని విస్మయం చెందుతున్నారు. దరఖాస్తుదారుల్లో 3 శాతం మందికి కూడా రుణాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, మోస్ట్‌బ్యాక్ వర్డ్ క్లాస్ (ఎంబీసీ), బీసీ, కాపు, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులు, చివరకు ఈబీసీలకు సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అరకొర రుణాలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. కార్పొరేషన్ పేరు దరఖాస్తుదారుల సంఖ్య రుణం పొందిన వారి సంఖ్య ఎస్సీ 31264 1687 ఎస్టీ 4827 171 కాపు 10555 617 ఎంబిసి 579 0 బిసి 26008 2 క్రిస్టియన్ మైనార్టీ 136 11 మైనార్టీ 6445 64 విభిన్న ప్రతిభావంతులు 478 0 ఈబీసీ 7085 0 మొత్తం 87377 2552 రుణ పంపిణీలోను కోతలే తొలుత ఒక్కో లబ్ధిదారునికి గరిష్టంగా రూ.2 లక్షలు అందేది. కానీ ఈ ఏడాది కేవలం లక్షకు మాత్రమే పరిమితమైంది. రుణాల సంఖ్య సరే ఎందుకు రుణంలో కోత విధిస్తున్నారో అని అధికారులను అడిగితే సమాధానం ఉండదు. లబ్ధిదారుల సంఖ్యను పెంచుతున్నారా అంటే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ప్రధానంగా బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు వాటికి సంబంధించిన నిధులు దారి మళ్లించి పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి పెంపు, సామాజిక పెన్షన్ పెంపు వంటి వాటికి కేటాయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 26 వేల మంది బీసీలు దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికి మాత్రమే రుణాలు ఇచ్చారు. అది కూడా లక్ష రూపాయల చొప్పున మాత్రమే. ఒకరిది చీమకుర్తి మండలం కాగా , రెండో వ్యక్తిది దోర్నాల మండలం. 11 మంది క్రిస్టియన్ మైనార్టీలకు, 64 మంది ముస్లిం మైనార్టీలకు మాత్రమే జిల్లా వ్యాప్తంగా ఇచ్చారు. పలు కార్పొరేషన్లలో మంజూరే లేదు మోస్ట్‌బ్యాక్‌వర్డ్ క్లాస్‌గా పిలువబడుతున్న ఎంబీసీలు 579 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా రుణాలు మంజూరు కాలేదు. కలెక్టర్ అంగీకరించి కార్పొరేషన్‌కు జాబితా పంపినా నేటికీ ఒక్కరికి కూడా రుణం విడుదల కాలేదు. అల్పాదాయ వర్గాల కార్పొరేషన్‌కు సంబంధించి కూడా 7 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నా ఒక్కరికి కూడా రుణం విడుదల కాకపోవడం గమనార్హం. ఇలా కార్పొరేషన్లకు సంబంధించిన రుణాల మంజూరులో ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్ప ఆచరణ మాత్రం శూన్యంగా కనిపిస్తుందని జిల్లా వ్యాప్తంగా 9 కార్పొరేషన్లకు సంబంధించి 87,377 మంది దరఖాస్తు చేసుకుంటే అరకొర లబ్ధి పొందిన వారి సంఖ్య 2552 మాత్రమే. అంటే ఆశపడి దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 2.9 శాతం అంటే ప్రతి వందమందిలో ముగ్గురికి కూడా తృప్తి కలగలేదని స్పష్టమవుతోంది. దరఖాస్తు ఖర్చులు అధికం... రుణాలు వస్తాయని ఆశతో దరఖాస్తు చేసుకునే వారు అధికమయ్యారు. ఒక్కో దరఖాస్తు చేయడానికి సామాన్య ప్రజలు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. దాని కోసం ప్రతి ఒక్కరికి షుమారు రూ.500 పైనే ఖర్చవుతుంది. అంటే సుమారు రూ.4 కోట్లు దరఖాస్తుల ద్వారా ఖర్చు చేశారు. ఇలా దరఖాస్తులు చేయడంతో పాటు పనులు మానుకుని ఇంటర్వ్యూలకు హాజరై, నాయకులు, అధికారుల చుట్టూ తిరగాలి. మండల కార్యాలయానికి గ్రామాల నుంచి రావాలి. ఇలా ఎన్ని ఖర్చులు పెట్టినా అరకొర రుణాలు మాత్రమే అందాయి. జన్మభూమి కమిటీల పెత్తనంతోనే.. ఇచ్చిన ఈ అరకొర రుణాల్లో కూడా జన్మభూమి కమిటీల వారు పెత్తనం చెలాయిస్తారు. వారి సంతకాల కోçసం దరఖాస్తుదారులు కాళ్లరిగేలా తిరగాలి. వారు సంతకం పెడితేనే దరఖాస్తులు స్వీకరిస్తారు. వారికి మళ్లీ లంచాలు ఇస్తేనే సంతకాలు పెడతారు. ఇలా జరిగిన తరువాత ఎంపిక చేసే సమయంలో మళ్లీ లోన్ కమిటీ ఉంటుంది. వారిని ప్రçసన్నం చేసుకోవాలి. తరువాత మళ్లీ ప్రజాప్రతినిధులు జాబితా ఇవ్వాలి. ఇంత చేసినా కూడా కనీసం 3 శాతం మందికి కూడా రుణాలు ఇవ్వలేదు. దరఖాస్తుదారుల ఆగ్రహం.. అర్హులైన వారికి రుణాలు ఇవ్వకుండా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన వారికి మాత్రమే అరకొర రుణాలు అందజేశారు. సామాన్య ప్రజలు అయితే ఒక్కరు కూడా రుణం పొందలేదు. ఇచ్చిందే కొద్ది.. అవి కూడా కేవలం తెలుగు తమ్ముళ్ల కే ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెపుతామని సామాన్య ప్రజలు అంటున్నారు. -
దోపిడీ మంత్రం
సాక్షి, తోటపల్లిగూడూరు (నెల్లూరు): అభివృద్ధి మాటున గత ఐదేళ్లుగా కోట్లాది రూపాయాలను అక్రమంగా దోచుకొని తమ ధనదాహాన్ని తీర్చుకున్నారు మండల తెలుగు తమ్ముళ్లు. టీడీపీ నాయకులే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి చేపట్టిన పనులన్నీ నాసిరకంగా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారు. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు, పర్శంటేజీలకు తలొగ్గి మిన్నకుండిపోయారనే విమర్శలున్నాయి. సీసీరోడ్ల నిర్మాణాలు, ఉపాధి పనుల్లో భారీ దోపిడీ మండలంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలు, ఉపాధి పనుల్లోనూ తెలుగు తమ్ముళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించి కోట్లాది రూపాయలు జేబుల్లోకి నింపుకున్నారు. పంచాయతీరాజ్ కింద గడిచిన ఐదేళ్లలో రూ.18.04 కోట్లను హెచ్చించి సీసీ రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్స్, శ్మశానవాటికలు తదితర 320 పనులను చేపట్టారు. పంచాయతీ నిధులకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులతో గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలు నాసిరకంగా జరిగాయి. నాణ్యతకు తిలోదకాలిస్తూ చేపట్టిన నిర్మాణాల్లో తెలుగు తమ్ముళ్లు రూ.కోట్లు గడించారు. అలాగే ఉపాధి నిధులతో చేపట్టిన చెత్త సంపద క్షేత్రాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణాల్లోనూ అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడ్డారనే విమర్శలున్నాయి. జన్మభూమి కమిటీల అనుగృహం ఉంటేనే.. గడిచిన ఐదేళ్లలో గృహ నిర్మాణ పథకం కింద మండలంలో 1,160 పక్కా గృహాలు, 3,436 రేషన్ కార్డులు, 1,071 పింఛన్లు, 734 మందికి ప్రభుత్వ రుణాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే 54 మందికి చంద్రన్న పెళ్లి కానుక, 233 మందికి చంద్రన్న బీమా చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయితే ఏ ప్రభుత్వ పథకం పొందాలన్నా చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల సిఫార్సు ఉండాల్సిందే. స్థానికంగా మంత్రి సోమిరెడ్డి అండతో జన్మభూమి కమిటీ సభ్యులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారయింది. ఆత్మగౌరవం తాకట్టు అరుంధతీయకాలనీలో నాసిరకంగా నిర్మించిన మరుగుదొడ్డి మండలంలోని 22 పంచాయతీల్లో గత ఐదేళ్లలో 5,905 మరుగుదొడ్లను నిర్మించగా అందులో 4,850 మరుగుదొడ్లకే అభికారులు బిల్లులు చేశారు. అయితే నాచరల్ లీడర్ల పేరుతో తెలుగు తమ్ముళ్లే గ్రామాల్లో ఈ మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో నిర్మాణాలను నాసిరంగా చేపట్టి రూ.లక్షలు అక్రమంగా దోచుకున్నారు. ముఖ్యంగా తోటపల్లిగూడూరు, తోటపల్లి, ఈదూరు, కోడూరు, కొత్తపాళెం, వెంకన్నపాళెం గ్రామాల్లో దోపిడీ పర్వం అధికంగా సాగినట్లు విమర్శలున్నాయి. ఇలా నాసిరంగా నిర్మించిన నెల రోజులకే మరుగుదొడ్ల ట్యాంకులు కూలిపోవడం, తలుపులు, కిటీకీలు పగిలిపోవడం జరిగింది. దీర్ఘకాలిక సమస్యలు గ్రామాల్లో ప్రధాన సమస్యలైన తాగునీరు, వీధిదీపాలు, డ్రెయినేజీ వంటి వాటిని టీడీపీ నాయకులు పూర్తిగా విస్మరించారు. దీంతో స్థానికులు ఐదేళ్లుగా అనేక ఇబ్బందుల నడుమ జీవనం సాగించాల్సి వచ్చింది. మండలంలోని పలు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో స్థలాల కొరతపై ఐదేళ్లలో దాదాపు 1,200 మంది అధికార పార్టీ నాయకులకు వినతిపత్రాలను అందించినా ఎక్కడా అంకణం స్థలం చూపించిన దాఖలాలు లేవు. శిథిలావస్థకు చేరిన తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనానికి ఐదేళ్లలో మోక్షం కలగలేదు. పొట్లపూడి–కొత్తపాళెం ప్రధాన రహదారి గుంతలమయమై గత పదేళ్లుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు–చెట్టు పనుల్లో చేతివాటం కోడూరు బీచ్ సమీపంలో బకింగ్‌హాం కెనాల్‌పై నిర్మించిన బ్రిడ్జి రెండు నెలలకే గోతులు ఏర్పడిన దృశ్యం (ఫైల్) ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నీరు–చెట్టు పనుల్లోనూ తెలుగు తమ్ముళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. మండలంలో ఐదేళ్లలో నీరు–చెట్టు కింద రూ.11.47 కోట్లతో మొత్తం 178 పనులు జరిగాయి. వాస్తవంగా రైతులకు ఉపయోగపడే కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలి. అయితే జరిగిన పనుల్లో అధిక శాతం అవసరం లేని అధికార పార్టీ నేతలు సూచించిన పనులే జరిగాయి. కొన్ని చోట్ల అధికారులను అడ్డం పెట్టుకుని చేయని పనులకు కూడా తమ్ముళ్లు బిల్లులు చేసుకొని లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులను దోచుకున్నారనే విమర్శలున్నాయి. అంతే కాకుండా కోడూరు, మాచర్లవారిపాళెం, వరిగొండ కెనాల్స్, వాటి కింద నడిచే చిన్న పారుదల కాలువల్లో జరిగిన పూడికతీత పనుల్లో తెలుగు తమ్ముళ్లు కోట్లాది రూపాయాల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బకింగ్ హాల్ కెనాల్‌పై వంతెన నిర్మాణం నాసిరకంగా ఉండడంతో రెండు నెలలకే గోతులు ఏర్పడ్డాయి. రైతుల ఇష్టాఇష్టాలతో పని లేకుండా లోపభూయిష్టంగా చేపట్టిన నీరు–చెట్టు పనుల వల్ల అధికార పార్టీ నాయకుల బాగుపడ్డారే తప్ప తమకేమి ఒరిగింది లేదని రైతులు అధికార పార్టీ నాయకుల తీరుపై బహిరంగంగానే మండిపడుతున్నారు. జన్మభూమి కమిటీల పెత్తనమేంటి ? ప్రభుత్వ పథకాల పంపిణీలో జన్మభూమి కమిటీ సభ్యులు పెత్తనం ఎక్కువై పేదలకు అన్యాయం జరిగింది. వీరి వల్ల ప్రజల చేత ఎన్నికైన తమలాంటి ప్రజా ప్రతినిధులకు విలువలేకుండా పోయింది. చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. – ఆకుల మధు, మాజీ సర్పంచ్, నరుకూరు అవినీతే తప్ప అభివృద్ధి లేదు ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అవినీతే తప్ప అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏ అభివృద్ధి జరగలేదు. నీరు–చెట్టు, సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నేతలు అందిన కాడికి దొచుకున్నారు. – మన్నెం చిరంజీవుల గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు -
కేంద్ర నిధులు..జన్మభూమి పేరుతో స్వాహా: కన్నా
వైఎస్సార్ జిల్లా: దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 14 పంటలకు మద్ధతు ధర పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని, కేంద్ర ప్రభుత్వం నిధులు పంపుతుంటే ఇక్కడ పేర్లు మార్చుకుని జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాహా చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. బీజీపీ సీనియర్ నాయకుడు కందుల రాజమోహన్ రెడ్డి ఎస్టేట్‌లో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఆడపడుచుల బంగారం బ్యాంకు అధికారులు వేలం వేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని చంద్రబాబునుద్దేశించి ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప ఎయిర్‌పోర్టు నిర్మాణం చేస్తే, దానిని వినియోగంలోకి తెచ్చింది ప్రధాని నరేంద్ర మోదీనేనని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అవకాశాన్ని చట్టంలో పరిశీలించమన్నారు..సెయిల్ మీటింగ్‌లో కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులే చెప్పారని గుర్తు చేశారు. ఆ తర్వాత తాము సమాచారం ఇచ్చి మెకేన్ ఆధ్వర్యంలో కమిటీ వేశామని తెలిపారు. దానికి కావాల్సిన సమాచారం ఇవ్వకుండా చంద్రబాబు నాటకాలు వేశారని, తన వైఫల్యం బయటపడుతుందని దొంగదీక్షలకు దిగారని ఎద్దేవా చేశారు. 20వ తేదీన దీక్షకు కూర్చుని 22న సమాచారం ఇచ్చిన ఘనత చంద్రబాబుదని అన్నారు. కేంద్రం లక్షన్నర కోట్ల నిధులు ఇస్తే ఏమీ ఇవ్వలేదని అంటున్నారని, ఇచ్చిన ప్రతి రూపాయి పందికొక్కుల్లా మెక్కారని తీవ్రంగా విమర్శించారు. ఐదేళ్లు దోచుకున్నారు..మళ్లీ అధికారం కావాలని అడుగుతున్నారని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టండి..రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. -
దోపిడీ కమిటీలు!
సాక్షి, అమరావతి : జన్మభూమి కమిటీల ముసుగులో రాష్ట్రంలో నాలుగేళ్లుగా అధికార పార్టీ నేతల దోపిడీ ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. టీడీపీ సర్కారు ఈ కమిటీలను రాజ్యాంగేతర శక్తులుగా మార్చి స్థానిక సంస్థల్లో విపక్ష ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వీరిని పక్కన పెట్టి టీడీపీకి చెందిన చోటామోటా నేతలతో కూడిన జన్మభూమి కమిటీలే అన్ని వ్యవహారాల్లో పెత్తనం చెలాయిస్తున్నాయి. ఇవి పేరుకు జన్మభూమి కమిటీలైనా వాస్తవంగా టీడీపీ కమిటీలన్నది బహిరంగ రహస్యమే. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏయే పనులు చేయాలో నిర్ణయించాల్సింది గ్రామాల్లో గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మున్సిపాలిటీలు, నగరాల్లో నగరపాలక సంస్థలు. స్థూలంగా గ్రామాల్లో సర్పంచులు, మున్సిపాలిటీల్లో చైర్మన్, నగరపాలక సంస్థల్లో మేయర్ పాలక మండళ్లతో కలిసి తీర్మానించిన పనులను చేపట్టాలి. కానీ, అన్నిచోట్లా జన్మభూమి కమిటీలే శాసిస్తున్నాయి. ఏ సంక్షేమ పథకం కింద లబ్ధి పొందాలన్నా జన్మభూమి కమిటీల ముందు అర్హులు మోకరిల్లాల్సిందే. ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఎస్టీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల నుంచి రుణాలు కావాలన్నా ఈ కమిటీల సిఫార్సులే కీలకం. ముడుపులిచ్చి న వారినే ఈ కమిటీలు లబ్ధిదారులుగా చేర్చేందుకు సిఫార్సు చేస్తున్నాయి. ఈ కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించడం సరికాదని హైకోర్టు సైతం వ్యాఖ్యానించింది. అయినా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఒక్కో పనికి ఒక్కో రేటు జన్మభూమి కమిటీల సభ్యులు ఒక్కో పనికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు మంజూరుకు లబ్ధిదారుల జాబితాలో పేరు చేర్చాలంటే రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. పట్టణాల్లో రూ.30 వేల నుంచి రూ.40 వేలు లేదా మంజూరయ్యే మొత్తంలో పది శాతం వరకు డిమాండ్ చేస్తున్నారు. రుణాల మంజూరుకు రూ.20 వేలు, పింఛన్లు, రేషన్ కార్డులకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు తీసుకుంటున్నారు. రహదారులు, మురుగు కాలువలు, వంతెనలు లాంటి పనులను కూడా ఈ కమిటీలే సిఫారసు చేస్తూ కాంట్రాక్టర్ల నుంచి వసూళ్ల పర్వం సాగిస్తున్నాయి. కాగా.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం నరుకుళ్లపాడు సర్పంచ్ మాచారపు లక్ష్మీతులసి తమ గ్రామంలో జన్మభూమి కమిటీల పెత్తనాన్ని ప్రశ్ని ంచడంతో అధికార పార్టీ నేతలు ఆమెను రెండుసార్లు సస్పెండ్ చేయించారు. న్యాయపోరాటం ద్వారా ఆమె సస్పెన్షన్‌ను తొలగించుకున్నారు. ఆమె తమ మాట వినడం లేదనే అక్కసుతో జన్మభూమి కమిటీ సభ్యులు ఈ గ్రామంలో ఎటువంటి పనులు చేయనీయడంలేదు. కమిటీలు చెప్పిందే వేదం.. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్నచోట కూడా జన్మభూమి కమిటీలు చెప్పిందే వేదంగా సాగుతోంది. గ్రామ జన్మభూమి కమిటీలో సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు, డ్వాక్రా సంఘాల నుంచి ఇద్దరు, సేవా సంస్థల తరఫున ఇద్దరు, పంచాయతీ కార్యదర్శి (కన్వీనర్) కలిపి మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. ఏ పని చేయాలన్నా, ఎవరిని లబ్ధిదారులుగా చేర్చాలన్నా ఈ కమిటీ మెజారిటీ నిర్ణయమే ఫైనల్. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు ఇద్దరూ వ్యతిరేకించినప్పటికీ నామినేట్ అయిన నలుగురు సభ్యులు చెప్పినదే మెజారిటీ తీర్మానమవుతుంది. విపక్షానికి చెందినవారు ప్రజాప్రతినిధులుగా ఉన్న చోట జన్మభూమి కమిటీ సభ్యులే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులున్న ప్రాంతాల్లో పరిస్థితి ఏకపక్షమే. అంతా అధికార పార్టీ వారే అయినందున వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు. దీంతో నాలుగేళ్ల క్రితం వరకూ సైకిళ్లపై తిరిగిన టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు మోటారు సైకిళ్లు, కార్లలో తిరుగుతున్నారు. మంచి భవనాలు నిర్మించుకుని ఆర్థికంగా స్థితిమంతులమని చాటుకుంటున్నారు. టీడీపీ సానుభూతిపరులకే అవకాశం జన్మభూమి కమిటీలు టీడీపీకి చెందినవే అయినందున ఆ పార్టీ అభిమానులు, సానుభూతిపరులనే వివిధ సంక్షేమ పథకాలకు ఎంపిక చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీల వారూ అర్హులైనప్పటికీ వారి ఇళ్లు, పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ రుణాల దరఖాస్తులను పక్కన పడేస్తున్నారు. అలాగే, వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు రహదారులు,మురుగు కాలువలు లాంటి పనులు మంజూరు చేయకుండా ఈ కమిటీలు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నాయి. అన్నింటా దోపిడీనే - ఈ కమిటీల సభ్యులు చెరువుల్లోని మట్టిని సైతం అమ్ముకున్నారు. గుంటూరు జిల్లా నెమలికల్లులోని చెరువు మట్టిని రూ.4 లక్షలకు జన్మభూమి కమిటీ వారు అమ్ముకున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరుకు కూడా ముడుపులు తీసుకుంటున్నారు. - కర్నూలు జిల్లాలోని 890 గ్రామ పంచాయతీల్లో జన్మభూమి కమిటీలు నాలుగేళ్లుగా సాగించిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఒకరి రేషన్ కార్డు ద్వారా మరొకరికి పింఛన్లు మంజూరు చేసిన సంఘటనలు కోకొల్లలు. ఉదాహరణకు.. వెల్దుర్తికి చెందిన షేక్ ఫాతిమాబీకి పింఛన్ మంజూరు చేసేందుకు జన్మభూమి కమిటీ సభ్యులు హిందువుల రేషన్ కార్డు పెట్టడం గమనార్హం. డబ్ల్యూఏపీ132900300462 నెంబర్ గల కార్డు కురువ శేఖర్ అనే హిందువుది. అయితే, ఈ కార్డుతో షేక్ ఫాతిమాబీకి పింఛన్ మంజూరు చేయించారు. ఇందుకోసం జన్మభూమి కమిటీ సభ్యులు రూ.4 వేలు తీసుకున్నట్టు సమాచారం. - వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండేవారిని పింఛన్ల జాబితా నుంచి ఈ కమిటీలు తొలగించాయి. ఒక్క విశాఖ జిల్లాలోనే ఈ కమిటీలు సిఫార్సు చేసి 15 వేల మంది పేర్లను జాబితా నుంచి తప్పించాయి. అంతేకాకుండా ఇదే జిల్లాలో అధికారులపై ఒత్తిడి తెచ్చి పలువురు సర్పంచుల చెక్‌పవర్‌ను రద్దు చేయించారు. మరుగుదొడ్ల మంజూరుకూ ముడుపులు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల మాటకు విలువ ఇవ్వకుండా టీడీపీవారికి ఇళ్లు, మరుగుదొడ్లు, పింఛన్లు మంజూరు చేస్తున్నారు. లబ్ధిదారుల నుంచి మరుగుదొడ్డి మంజూరుకు రూ.500–రూ.1000, పక్కా ఇల్లు మంజూరుకు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు. – ఆళ్ల శివలక్ష్మీకుమారి, ఎంపీటీసీ, నెమలికల్లు, అమరావతి మండలం, గుంటూరు జిల్లా ప్రజా ప్రతినిధులుగా విలువ లేదు ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధులకు విలువలేకుండా పోయింది. సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం, ఉపాధి హామీ పనులు, నీరు–చెట్టు పనులు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాల పంపిణీ ఇలా అన్నింటా చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. గ్రామ సర్పంచ్‌గా నాకు తెలియకుండా అనేక పనులు చేశారు. – తీల సుభద్రమ్మ, సర్పంచ్, వెంకంపేట, పార్వతీపురం కక్ష కట్టి పింఛన్ రద్దు చేయించారు మాది విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం మండలం రామయ్యపట్నం. 20 ఏళ్ల క్రితం నా భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు నెలలపాటు వెయ్యి రూపాయల చొప్పున పింఛన్ ఇచ్చారు. మా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ సభ్యుడైన పి.చంద్రరావు కక్షకట్టి మరీ నా పింఛన్ రద్దు చేయించాడు. – కుండల సత్యవతి, రామయ్యపట్నం, విశాఖ జిల్లా నా చెక్ పవర్ రద్దు చేయించారు జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నాయి. వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక మాకు తెలీకుండానే జరుగుతోంది. జన్మభూమి కమిటీలే ఎంపిక చేస్తున్నాయి. అభివృద్ధి పనులూ ఆ కమిటీలకే. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు రబ్బర్ స్టాంపుల్లా మారారు. ప్రశ్నిస్తున్నానని నా చెక్ పవర్ రద్దు చేయించారు. – చోడిపల్లి శ్రీను, సర్పంచ్, వెంకటనగరం, విశాఖ జిల్లా -
రుణాలకూ ‘బయోమెట్రిక్’
జన్మభూమి కమిటీకి పూర్తి పెత్తనం 3 నుంచి 9 మందికి కమిటి సభ్యులు పెంపు జీఓ నంబర్ 18 జారీ ఆందోళనలో దళితులు ‘బయోమెట్రిక్’ ఈ పేరు వినని వారుండరు. ఎందుకంటే దీని వల్ల పింఛను తీసుకునే అభాగ్యులు, రేషన్ షాపుల్లో నిత్యావసరాలు తీసుకునే లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న వారే. ఇది చాలదన్నట్లు ప్రభుత్వం నిరుపేదలకు సబ్సిడీ రుణాలకు దూరం చేసేందుకు కుట్ర పన్నింది. ఈ నేపథ్యంలోనే సబ్సిడీ రుణాలకూ బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇది తమకు రుణాలు అందకుండా చేసేందుకేనని దళితులు విమర్శిస్తున్నారు. నెల్లూరు(సెంట్రల్): సబ్సిడీ రుణాలు పేదలకు అందకుండే చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇందులో భాగంగా రుణాల మంజూరులో బయోమెట్రిక్ విధానంలో అమల్లోకి తెచ్చింది. అంతేగాక రుణాల మంజూరులో జన్మభూమి కమిటీలకు పూర్తి పెత్తనం కట్టబెట్టింది. ఇందులో భాగంగా ముగ్గురు సభ్యులున్న కిమిటీలో ఏకంగా 9 మంది ఉండేటట్లు చేసింది. మొత్తం పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. బయోమెట్రిక్‌తో ఇబ్బందులే ఇప్పటికే బయో మెట్రిక్ వల్ల పింఛను, రేషన్ అందక లబ్ధిదారులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇప్పుడు ఎస్సీ, బీసీ పేదలకు ఇచ్చే రుణాలకు సైతం బయోమెట్రిక్ పెట్టడంతో వీరి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విధంగా చంద్రబాబు పాలను చూస్తుంటే దళితులపై కక్ష సాధింపు చర్యగా తెలుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. జన్మభూమి కమిటీలో వీరే... జన్మభూమి కమిటీలో మొత్తం ప్రస్తుతం నియోజక వర్గంలో 3 ఉన్నారు. ఈ ముగ్గురు టీడీపీ నాయకులే.. కాని ఇప్పుడు కొత్తగా ఇద్దరు సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు, 1 ఎంపీపీ, 1 జెడ్పీటీసీలు అంతా కలిసి ఆరు మంది కాగా గతంలో ఉన్న ముగ్గరితో కలిపి మొత్తం 9 మంది కమిటీలో ఉంటారు. అర్హులైన వారికి రుణాలు అందిస్తామని చెపుతున్నా సీఎం చంద్రబాబు సర్కారు ఈ విధంగా అధికార పార్టీకి చెందిన వారిని కమిటీలో నియమిస్తే అర్హులైన అందరికి ఏ విధంగా రుణాలు వస్తాయని పలువురు విమర్శలు చేస్తున్నారు. దళితులను పూర్తిగా మోసం చేయడమే: పందిటి సుబ్బయ్య, ఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ కార్యదర్శి చంద్రబాబు పాలన చూస్తుంటే ఎవరికి లేని విధంగా దళితులపై కక్ష సాధింపు చర్యలుగా చేపట్టినట్లు ఉంది. ఇచ్చే అరకొర రుణాలకు సైతం బయోమెట్రిక్ పెట్టి రుణాలను ఇవ్వకుండా చేయడానికే ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఉంది. ముఖ్యంగా మాదిగలపై బాబు సర్కారు కక్ష సాధింపు చేస్తోంది. జన్మభూమి కమిటీలను పూర్తిగా రద్దు చేయాలి: వాదనాల వెంకటరమణ, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు జన్మభూమి కమిటీ సభ్యుల వల్ల చాలా మంది అర్హులైన వారికి రుణాలు అందడం లేదు. దీనికి తోడు 9 మందిని కమిటీ సభ్యులను పెట్టడం అన్యాయం. దళితులకు ఇచ్చే రుణాలను కూడా కమిటీ సభ్యుల వద్దకు వెళ్లి అడుక్కోవాలా.. ఇది ఎక్కడి న్యాయం ..పాలకుల తీరు మారక పోతే కష్టం. -
కమీషన్ల గోల !
సాక్షి ప్రతినిధి, గుంటూరు : నీరు-చెట్టు పథకానికి సంబంధించి కమీషన్ల వివాదం ముదురుతోంది. చెరువుల మరమ్మతులు చేసిన జన్మభూమి కమిటీల నుంచి జలవనరుల శాఖ, పే అండ్ అకౌంట్స్ విభాగాల అధికారులు కమీషన్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఆ శాఖలు డిమాండ్ చేసిన కమీషన్లు ఇవ్వకపోతే మరమ్మతులకు సంబంధించిన బిల్లులను పెండింగ్ పెడుతున్నారు. ఆ బిల్లులకు సంబంధించిన వివరాలు లేవంటూ కొర్రీలు వేస్తున్నారు. చెరువులకు అసలు మరమ్మతులు చేయకుండా, తవ్వగా వచ్చిన మట్టిని అమ్ముకుని గ్రామ కమిటీలు కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందాయని ఈ శాఖల అధికారుల వాదన. సులభంగా గడించిన ఆదాయంలోనూ తమకు కమీషన్లు ఇవ్వకుండా పొలిటికల్ పవర్ చూపిస్తూ బెదిరించే స్థితికి వచ్చాయంటున్నారు. మొత్తం మీద ఈ కమీషన్ల వివాదం కారణంగా రూ.4 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపులకు నోచుకోలేదు. 330 చెరువుల్లో మెరకతీత పనులు పూర్తి జిల్లాలో నీరు-చెట్టు పథకం కింద మే నెలలో చెరువుల తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 611 చెరువుల్లో మెరక తీసే పనులను గ్రామ కమిటీలు ప్రారంభించాయి. క్యూబిక్ మీటరు మట్టిని తవ్వినందుకు రూ.29 లను ప్రభుత్వం గ్రామ కమిటీలకు అందజేసింది. దాదాపు 330 చెరువుల్లో మెరక పనులు పూర్తి చేస్తే మిగిలిన చెరువుల్లో తవ్వకాలు అసంపూర్తిగా మిగిలి పోయాయి. సుమారు 80 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఈ కమి టీలు తవ్వాయి. ఇందుకు రూ.23.20 కోట్లను జన్మభూమి కమిటీలకు చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.15 కోట్ల వరకు గ్రామ కమిటీలకు నగదు చెల్లింపులు జరిగాయి. కొన్ని కమిటీలు ఈ శాఖలు డిమాండ్ చేసిన కమీషన్లు చెల్లిస్తే, మరికొన్ని కమిటీలు తిరస్కరించాయి. కమీషన్లు భారీగా చెల్లించాలంటూ ఈ శాఖల అధికారులు డిమాండ్ చేశారని ఈ కమిటీలు ఆరోపిస్తున్నాయి. ఇతర పనులకు కమీషన్లు ఇలా..సాధారణంగా ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లు ఇతర కాంట్రాక్టర్ల నుంచి బిల్లు మొత్తంపై 10 నుంచి 12 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నారు. ఇందులో వర్క్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజినీరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, డిప్యూటీ ఎస్ఈ, ఆ సర్కిల్ సూపరింటెండెంట్ వరకు వాటాలు ఉంటాయి. ఈ వాటాల పంపిణీ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతుంది. అసాధారణ లాభాలు .. అయితే నీరు-చెట్టు పథకం పనులు చేపట్టిన అభివృద్ధి కమి టీలకు అసాధారణ లాభాలు వచ్చాయి. తవ్విన మట్టికి క్యూబిక్ మీటరుకు రూ.29లను ప్రభుత్వం నుంచి పొందడమే కాకుండా తవ్విని మట్టిని ఆ గ్రామాల్లోని రైతులకు విక్రయించాయి. ట్రాక్టరు ట్రక్కు రూ.400 నుంచి రూ.600 లకు విక్రయించి అసాధారణ లాభాలు పొందాయి. ఇది బహిరంగ రహస్యం కావడంతో కొందరు ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లు, పే అండ్ అకౌంట్స్ విభాగ అధికారులు బిల్లుపై అధిక మొత్తంలో కమీషన్ డిమాండ్ చేశారు. ఇరిగేషన్ శాఖ 20 శాతం కమీషన్ తీసుకుంటే, పే అండ్ అకౌంట్స్ విభాగం 8 నుంచి 10 శాతం కమీషన్ తీసుకుంది. కొన్ని జన్మభూమి కమిటీలు వీరితో వివాదానికి దిగకుండా తమకు వచ్చిన అసాధారణ లాభంలో ఈ కమీషన్ చెల్లించాయి. మరి కొన్ని కమిటీలు ఇంత కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదంటూ వివాదానికి దిగాయి. రాజకీయంగా పలుకుబడి కలిగిన కొన్ని జన్మభూమి కమిటీలు ఈ శాఖల అధికారులను బ్లాక్మెయిల్ చేశాయి కూడా. ఈ వివాదం, ఇతర కొర్రీల కారణంగా రూ.4 కోట్ల విలువైన బిల్లులు పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉండిపోయాయి.