దశాబ్దకాలంగా సీసీ రోడ్డుకు కూడా లేని కోడూరు పంచాయతీలోని ఓ వీధి (ఫైల్)
సాక్షి, తోటపల్లిగూడూరు (నెల్లూరు): అభివృద్ధి మాటున గత ఐదేళ్లుగా కోట్లాది రూపాయాలను అక్రమంగా దోచుకొని తమ ధనదాహాన్ని తీర్చుకున్నారు మండల తెలుగు తమ్ముళ్లు. టీడీపీ నాయకులే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి చేపట్టిన పనులన్నీ నాసిరకంగా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారు. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు, పర్శంటేజీలకు తలొగ్గి మిన్నకుండిపోయారనే విమర్శలున్నాయి.
సీసీరోడ్ల నిర్మాణాలు, ఉపాధి పనుల్లో భారీ దోపిడీ
మండలంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలు, ఉపాధి పనుల్లోనూ తెలుగు తమ్ముళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించి కోట్లాది రూపాయలు జేబుల్లోకి నింపుకున్నారు. పంచాయతీరాజ్ కింద గడిచిన ఐదేళ్లలో రూ.18.04 కోట్లను హెచ్చించి సీసీ రోడ్లు, అంగన్‌వాడీ బిల్డింగ్స్, శ్మశానవాటికలు తదితర 320 పనులను చేపట్టారు. పంచాయతీ నిధులకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులతో గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలు నాసిరకంగా జరిగాయి. నాణ్యతకు తిలోదకాలిస్తూ చేపట్టిన నిర్మాణాల్లో తెలుగు తమ్ముళ్లు రూ.కోట్లు గడించారు. అలాగే ఉపాధి నిధులతో చేపట్టిన చెత్త సంపద క్షేత్రాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాల్లోనూ అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడ్డారనే విమర్శలున్నాయి.
జన్మభూమి కమిటీల అనుగృహం ఉంటేనే..
గడిచిన ఐదేళ్లలో గృహ నిర్మాణ పథకం కింద మండలంలో 1,160 పక్కా గృహాలు, 3,436 రేషన్ కార్డులు, 1,071 పింఛన్లు, 734 మందికి ప్రభుత్వ రుణాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే 54 మందికి చంద్రన్న పెళ్లి కానుక, 233 మందికి చంద్రన్న బీమా చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయితే ఏ ప్రభుత్వ పథకం పొందాలన్నా చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల సిఫార్సు ఉండాల్సిందే. స్థానికంగా మంత్రి సోమిరెడ్డి అండతో జన్మభూమి కమిటీ సభ్యులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారయింది.
ఆత్మగౌరవం తాకట్టు
అరుంధతీయకాలనీలో నాసిరకంగా నిర్మించిన మరుగుదొడ్డి
మండలంలోని 22 పంచాయతీల్లో గత ఐదేళ్లలో 5,905 మరుగుదొడ్లను నిర్మించగా అందులో 4,850 మరుగుదొడ్లకే అభికారులు బిల్లులు చేశారు. అయితే నాచరల్ లీడర్ల పేరుతో తెలుగు తమ్ముళ్లే గ్రామాల్లో ఈ మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో నిర్మాణాలను నాసిరంగా చేపట్టి రూ.లక్షలు అక్రమంగా దోచుకున్నారు. ముఖ్యంగా తోటపల్లిగూడూరు, తోటపల్లి, ఈదూరు, కోడూరు, కొత్తపాళెం, వెంకన్నపాళెం గ్రామాల్లో దోపిడీ పర్వం అధికంగా సాగినట్లు విమర్శలున్నాయి. ఇలా నాసిరంగా నిర్మించిన నెల రోజులకే మరుగుదొడ్ల ట్యాంకులు కూలిపోవడం, తలుపులు, కిటీకీలు పగిలిపోవడం జరిగింది.
దీర్ఘకాలిక సమస్యలు
గ్రామాల్లో ప్రధాన సమస్యలైన తాగునీరు, వీధిదీపాలు, డ్రెయినేజీ వంటి వాటిని టీడీపీ నాయకులు పూర్తిగా విస్మరించారు. దీంతో స్థానికులు ఐదేళ్లుగా అనేక ఇబ్బందుల నడుమ జీవనం సాగించాల్సి వచ్చింది. మండలంలోని పలు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో స్థలాల కొరతపై ఐదేళ్లలో దాదాపు 1,200 మంది అధికార పార్టీ నాయకులకు వినతిపత్రాలను అందించినా ఎక్కడా అంకణం స్థలం చూపించిన దాఖలాలు లేవు. శిథిలావస్థకు చేరిన తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనానికి ఐదేళ్లలో మోక్షం కలగలేదు. పొట్లపూడి–కొత్తపాళెం ప్రధాన రహదారి గుంతలమయమై గత పదేళ్లుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నీరు–చెట్టు పనుల్లో చేతివాటం
కోడూరు బీచ్ సమీపంలో బకింగ్‌హాం కెనాల్‌పై నిర్మించిన బ్రిడ్జి రెండు నెలలకే గోతులు ఏర్పడిన దృశ్యం (ఫైల్)
ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నీరు–చెట్టు పనుల్లోనూ తెలుగు తమ్ముళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. మండలంలో ఐదేళ్లలో నీరు–చెట్టు కింద రూ.11.47 కోట్లతో మొత్తం 178 పనులు జరిగాయి. వాస్తవంగా రైతులకు ఉపయోగపడే కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలి. అయితే జరిగిన పనుల్లో అధిక శాతం అవసరం లేని అధికార పార్టీ నేతలు సూచించిన పనులే జరిగాయి. కొన్ని చోట్ల అధికారులను అడ్డం పెట్టుకుని చేయని పనులకు కూడా తమ్ముళ్లు బిల్లులు చేసుకొని లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులను దోచుకున్నారనే విమర్శలున్నాయి. అంతే కాకుండా కోడూరు, మాచర్లవారిపాళెం, వరిగొండ కెనాల్స్, వాటి కింద నడిచే చిన్న పారుదల కాలువల్లో జరిగిన పూడికతీత పనుల్లో తెలుగు తమ్ముళ్లు కోట్లాది రూపాయాల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బకింగ్ హాల్ కెనాల్‌పై వంతెన నిర్మాణం నాసిరకంగా ఉండడంతో రెండు నెలలకే గోతులు ఏర్పడ్డాయి. రైతుల ఇష్టాఇష్టాలతో పని లేకుండా లోపభూయిష్టంగా చేపట్టిన నీరు–చెట్టు పనుల వల్ల అధికార పార్టీ నాయకుల బాగుపడ్డారే తప్ప తమకేమి ఒరిగింది లేదని రైతులు అధికార పార్టీ నాయకుల తీరుపై బహిరంగంగానే మండిపడుతున్నారు.
జన్మభూమి కమిటీల పెత్తనమేంటి ?
ప్రభుత్వ పథకాల పంపిణీలో జన్మభూమి కమిటీ సభ్యులు పెత్తనం ఎక్కువై పేదలకు అన్యాయం జరిగింది. వీరి వల్ల ప్రజల చేత ఎన్నికైన తమలాంటి ప్రజా ప్రతినిధులకు విలువలేకుండా పోయింది. చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు.
– ఆకుల మధు, మాజీ సర్పంచ్, నరుకూరు
అవినీతే తప్ప అభివృద్ధి లేదు
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అవినీతే తప్ప అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏ అభివృద్ధి జరగలేదు. నీరు–చెట్టు, సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నేతలు అందిన కాడికి దొచుకున్నారు.
– మన్నెం చిరంజీవుల గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment