కార్పొరేషన్‌ రుణాలు కొందరికే ! | Corporation Loans Not Gave To All Eligible Candidates In Prakasam | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ రుణాలు కొందరికే !

Published Fri, Apr 5 2019 12:33 PM | Last Updated on Fri, Apr 5 2019 12:33 PM

Corporation Loans Not Gave To All Eligible Candidates In Prakasam - Sakshi

ఉలవపాడులో ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం వేచిఉన్న దరఖాస్తుదారులు (ఫైల్‌)

ఆశల పల్లకి ఎక్కించడం ఆపై నేలపై పడేయడం... మళ్లీ ఎన్నికల సమయంలో ఏదో చేస్తామంటూ మభ్యపెట్టడం.. ఇదీ తెలుగుదేశం పార్టీ తీరు. అర్హులైన పేదలందరికీ వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలిస్తామని ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించింది. అది నమ్మిన పేదలు రుణాల కోసం దరఖాస్తు చేసుకుని ఆపై అధికారులు, పార్టీ నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ప్రత్యేక కార్పొరేషన్లంటూ ఊదరగొడుతున్న చంద్రబాబుపై.. కార్పొరేషన్ల పేరుతో ఓట్లు దండుకోవాలనుకున్న అధికార పార్టీపై రుణం కోసం దరఖాస్తు చేసి నిరాశపడిన ప్రజానీకం భగ్గుమంటోంది.

సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): వివిధ కులాల పేరుతో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు కాగితాలకే పరిమితమవుతున్నాయి. కార్పొరేషన్ల కింద అర్హులందరికీ రుణాలిస్తామని చెబుతున్న మాటలు నీటిమూటలుగానే మిగులుతున్నాయి. 2018 జూన్‌లో రుణాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎందుకు రుణాలు పంపిణీ కాలేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రుణాలకు దరఖాస్తులు ఆహ్వానించే సమయంలో కార్పొరేషన్‌ వద్ద లక్ష్యానికి మించిన నిధులు సిద్ధంగా ఉండాలి. కానీ దరఖాస్తులను పెద్ద ఎత్తున ఆహ్వానించి, తరువాత పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. రుణానికి ఎంపికైనట్లు తెలుసుకున్న వారు ఎంపీడీఓ కార్యాలయాల వద్దకు వెళ్లి అడిగితే రుణం విడుదల కాలేదంటూ అధికారుల నుంచి వస్తున్న సమాధానం విని విస్మయం చెందుతున్నారు. దరఖాస్తుదారుల్లో 3 శాతం మందికి కూడా రుణాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, మోస్ట్‌బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ (ఎంబీసీ), బీసీ, కాపు, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్‌ మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులు, చివరకు ఈబీసీలకు సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అరకొర రుణాలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు.

కార్పొరేషన్‌ పేరు  దరఖాస్తుదారుల సంఖ్య రుణం పొందిన వారి సంఖ్య
ఎస్సీ  31264  1687 
ఎస్టీ  4827  171 
కాపు 10555  617
ఎంబిసి  579  0
బిసి  26008  2 
క్రిస్టియన్‌ మైనార్టీ 136 11
మైనార్టీ 6445  64
విభిన్న ప్రతిభావంతులు  478 
 ఈబీసీ 7085
మొత్తం 87377  2552

రుణ పంపిణీలోను కోతలే
తొలుత ఒక్కో లబ్ధిదారునికి గరిష్టంగా రూ.2 లక్షలు అందేది. కానీ ఈ ఏడాది కేవలం లక్షకు మాత్రమే పరిమితమైంది. రుణాల సంఖ్య సరే ఎందుకు రుణంలో కోత విధిస్తున్నారో అని అధికారులను అడిగితే సమాధానం ఉండదు. లబ్ధిదారుల సంఖ్యను పెంచుతున్నారా అంటే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ప్రధానంగా బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన  కార్పొరేషన్‌లు వాటికి సంబంధించిన నిధులు దారి మళ్లించి పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి పెంపు, సామాజిక పెన్షన్‌ పెంపు వంటి వాటికి కేటాయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  ఈ ఆర్థిక సంవత్సరంలో 26 వేల మంది బీసీలు దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికి మాత్రమే రుణాలు ఇచ్చారు. అది కూడా లక్ష రూపాయల చొప్పున మాత్రమే. ఒకరిది చీమకుర్తి మండలం కాగా , రెండో వ్యక్తిది దోర్నాల మండలం. 11 మంది క్రిస్టియన్‌ మైనార్టీలకు, 64 మంది ముస్లిం మైనార్టీలకు  మాత్రమే జిల్లా వ్యాప్తంగా ఇచ్చారు.

పలు కార్పొరేషన్లలో మంజూరే లేదు
మోస్ట్‌బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌గా పిలువబడుతున్న ఎంబీసీలు 579 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా రుణాలు మంజూరు కాలేదు.  కలెక్టర్‌ అంగీకరించి కార్పొరేషన్‌కు జాబితా పంపినా నేటికీ ఒక్కరికి కూడా రుణం విడుదల కాలేదు. అల్పాదాయ వర్గాల కార్పొరేషన్‌కు సంబంధించి కూడా 7 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నా ఒక్కరికి కూడా రుణం విడుదల కాకపోవడం గమనార్హం. ఇలా కార్పొరేషన్‌లకు సంబంధించిన రుణాల మంజూరులో ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్ప ఆచరణ మాత్రం శూన్యంగా కనిపిస్తుందని జిల్లా వ్యాప్తంగా 9 కార్పొరేషన్లకు సంబంధించి 87,377 మంది దరఖాస్తు చేసుకుంటే అరకొర లబ్ధి పొందిన వారి సంఖ్య 2552 మాత్రమే. అంటే ఆశపడి దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 2.9 శాతం అంటే ప్రతి వందమందిలో ముగ్గురికి కూడా తృప్తి కలగలేదని స్పష్టమవుతోంది. 

దరఖాస్తు ఖర్చులు అధికం...
రుణాలు వస్తాయని ఆశతో దరఖాస్తు చేసుకునే వారు అధికమయ్యారు. ఒక్కో  దరఖాస్తు చేయడానికి సామాన్య ప్రజలు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. దాని కోసం ప్రతి ఒక్కరికి షుమారు రూ.500 పైనే ఖర్చవుతుంది. అంటే సుమారు రూ.4 కోట్లు దరఖాస్తుల ద్వారా ఖర్చు చేశారు. ఇలా దరఖాస్తులు చేయడంతో పాటు పనులు మానుకుని ఇంటర్వ్యూలకు హాజరై, నాయకులు, అధికారుల చుట్టూ తిరగాలి. మండల కార్యాలయానికి గ్రామాల నుంచి రావాలి. ఇలా ఎన్ని ఖర్చులు పెట్టినా అరకొర రుణాలు మాత్రమే అందాయి.

జన్మభూమి కమిటీల పెత్తనంతోనే.. 
ఇచ్చిన ఈ అరకొర రుణాల్లో కూడా జన్మభూమి కమిటీల వారు పెత్తనం చెలాయిస్తారు. వారి సంతకాల కోçసం దరఖాస్తుదారులు కాళ్లరిగేలా తిరగాలి. వారు సంతకం పెడితేనే దరఖాస్తులు స్వీకరిస్తారు. వారికి మళ్లీ లంచాలు ఇస్తేనే  సంతకాలు పెడతారు. ఇలా జరిగిన తరువాత ఎంపిక చేసే సమయంలో మళ్లీ లోన్‌ కమిటీ ఉంటుంది. వారిని ప్రçసన్నం చేసుకోవాలి. తరువాత మళ్లీ ప్రజాప్రతినిధులు జాబితా ఇవ్వాలి. ఇంత చేసినా కూడా కనీసం 3 శాతం మందికి కూడా రుణాలు ఇవ్వలేదు.

దరఖాస్తుదారుల ఆగ్రహం..
అర్హులైన వారికి రుణాలు ఇవ్వకుండా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన వారికి మాత్రమే అరకొర రుణాలు అందజేశారు. సామాన్య ప్రజలు అయితే ఒక్కరు కూడా రుణం పొందలేదు. ఇచ్చిందే కొద్ది..   అవి కూడా కేవలం తెలుగు తమ్ముళ్ల కే ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెపుతామని సామాన్య ప్రజలు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement