minarty corporetion
-
కార్పొరేషన్ రుణాలు కొందరికే !
ఆశల పల్లకి ఎక్కించడం ఆపై నేలపై పడేయడం... మళ్లీ ఎన్నికల సమయంలో ఏదో చేస్తామంటూ మభ్యపెట్టడం.. ఇదీ తెలుగుదేశం పార్టీ తీరు. అర్హులైన పేదలందరికీ వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలిస్తామని ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించింది. అది నమ్మిన పేదలు రుణాల కోసం దరఖాస్తు చేసుకుని ఆపై అధికారులు, పార్టీ నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ప్రత్యేక కార్పొరేషన్లంటూ ఊదరగొడుతున్న చంద్రబాబుపై.. కార్పొరేషన్ల పేరుతో ఓట్లు దండుకోవాలనుకున్న అధికార పార్టీపై రుణం కోసం దరఖాస్తు చేసి నిరాశపడిన ప్రజానీకం భగ్గుమంటోంది. సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): వివిధ కులాల పేరుతో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు కాగితాలకే పరిమితమవుతున్నాయి. కార్పొరేషన్ల కింద అర్హులందరికీ రుణాలిస్తామని చెబుతున్న మాటలు నీటిమూటలుగానే మిగులుతున్నాయి. 2018 జూన్‌లో రుణాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎందుకు రుణాలు పంపిణీ కాలేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రుణాలకు దరఖాస్తులు ఆహ్వానించే సమయంలో కార్పొరేషన్ వద్ద లక్ష్యానికి మించిన నిధులు సిద్ధంగా ఉండాలి. కానీ దరఖాస్తులను పెద్ద ఎత్తున ఆహ్వానించి, తరువాత పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. రుణానికి ఎంపికైనట్లు తెలుసుకున్న వారు ఎంపీడీఓ కార్యాలయాల వద్దకు వెళ్లి అడిగితే రుణం విడుదల కాలేదంటూ అధికారుల నుంచి వస్తున్న సమాధానం విని విస్మయం చెందుతున్నారు. దరఖాస్తుదారుల్లో 3 శాతం మందికి కూడా రుణాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, మోస్ట్‌బ్యాక్ వర్డ్ క్లాస్ (ఎంబీసీ), బీసీ, కాపు, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులు, చివరకు ఈబీసీలకు సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అరకొర రుణాలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. కార్పొరేషన్ పేరు దరఖాస్తుదారుల సంఖ్య రుణం పొందిన వారి సంఖ్య ఎస్సీ 31264 1687 ఎస్టీ 4827 171 కాపు 10555 617 ఎంబిసి 579 0 బిసి 26008 2 క్రిస్టియన్ మైనార్టీ 136 11 మైనార్టీ 6445 64 విభిన్న ప్రతిభావంతులు 478 0 ఈబీసీ 7085 0 మొత్తం 87377 2552 రుణ పంపిణీలోను కోతలే తొలుత ఒక్కో లబ్ధిదారునికి గరిష్టంగా రూ.2 లక్షలు అందేది. కానీ ఈ ఏడాది కేవలం లక్షకు మాత్రమే పరిమితమైంది. రుణాల సంఖ్య సరే ఎందుకు రుణంలో కోత విధిస్తున్నారో అని అధికారులను అడిగితే సమాధానం ఉండదు. లబ్ధిదారుల సంఖ్యను పెంచుతున్నారా అంటే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ప్రధానంగా బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు వాటికి సంబంధించిన నిధులు దారి మళ్లించి పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి పెంపు, సామాజిక పెన్షన్ పెంపు వంటి వాటికి కేటాయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 26 వేల మంది బీసీలు దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికి మాత్రమే రుణాలు ఇచ్చారు. అది కూడా లక్ష రూపాయల చొప్పున మాత్రమే. ఒకరిది చీమకుర్తి మండలం కాగా , రెండో వ్యక్తిది దోర్నాల మండలం. 11 మంది క్రిస్టియన్ మైనార్టీలకు, 64 మంది ముస్లిం మైనార్టీలకు మాత్రమే జిల్లా వ్యాప్తంగా ఇచ్చారు. పలు కార్పొరేషన్లలో మంజూరే లేదు మోస్ట్‌బ్యాక్‌వర్డ్ క్లాస్‌గా పిలువబడుతున్న ఎంబీసీలు 579 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా రుణాలు మంజూరు కాలేదు. కలెక్టర్ అంగీకరించి కార్పొరేషన్‌కు జాబితా పంపినా నేటికీ ఒక్కరికి కూడా రుణం విడుదల కాలేదు. అల్పాదాయ వర్గాల కార్పొరేషన్‌కు సంబంధించి కూడా 7 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నా ఒక్కరికి కూడా రుణం విడుదల కాకపోవడం గమనార్హం. ఇలా కార్పొరేషన్లకు సంబంధించిన రుణాల మంజూరులో ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్ప ఆచరణ మాత్రం శూన్యంగా కనిపిస్తుందని జిల్లా వ్యాప్తంగా 9 కార్పొరేషన్లకు సంబంధించి 87,377 మంది దరఖాస్తు చేసుకుంటే అరకొర లబ్ధి పొందిన వారి సంఖ్య 2552 మాత్రమే. అంటే ఆశపడి దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 2.9 శాతం అంటే ప్రతి వందమందిలో ముగ్గురికి కూడా తృప్తి కలగలేదని స్పష్టమవుతోంది. దరఖాస్తు ఖర్చులు అధికం... రుణాలు వస్తాయని ఆశతో దరఖాస్తు చేసుకునే వారు అధికమయ్యారు. ఒక్కో దరఖాస్తు చేయడానికి సామాన్య ప్రజలు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. దాని కోసం ప్రతి ఒక్కరికి షుమారు రూ.500 పైనే ఖర్చవుతుంది. అంటే సుమారు రూ.4 కోట్లు దరఖాస్తుల ద్వారా ఖర్చు చేశారు. ఇలా దరఖాస్తులు చేయడంతో పాటు పనులు మానుకుని ఇంటర్వ్యూలకు హాజరై, నాయకులు, అధికారుల చుట్టూ తిరగాలి. మండల కార్యాలయానికి గ్రామాల నుంచి రావాలి. ఇలా ఎన్ని ఖర్చులు పెట్టినా అరకొర రుణాలు మాత్రమే అందాయి. జన్మభూమి కమిటీల పెత్తనంతోనే.. ఇచ్చిన ఈ అరకొర రుణాల్లో కూడా జన్మభూమి కమిటీల వారు పెత్తనం చెలాయిస్తారు. వారి సంతకాల కోçసం దరఖాస్తుదారులు కాళ్లరిగేలా తిరగాలి. వారు సంతకం పెడితేనే దరఖాస్తులు స్వీకరిస్తారు. వారికి మళ్లీ లంచాలు ఇస్తేనే సంతకాలు పెడతారు. ఇలా జరిగిన తరువాత ఎంపిక చేసే సమయంలో మళ్లీ లోన్ కమిటీ ఉంటుంది. వారిని ప్రçసన్నం చేసుకోవాలి. తరువాత మళ్లీ ప్రజాప్రతినిధులు జాబితా ఇవ్వాలి. ఇంత చేసినా కూడా కనీసం 3 శాతం మందికి కూడా రుణాలు ఇవ్వలేదు. దరఖాస్తుదారుల ఆగ్రహం.. అర్హులైన వారికి రుణాలు ఇవ్వకుండా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన వారికి మాత్రమే అరకొర రుణాలు అందజేశారు. సామాన్య ప్రజలు అయితే ఒక్కరు కూడా రుణం పొందలేదు. ఇచ్చిందే కొద్ది.. అవి కూడా కేవలం తెలుగు తమ్ముళ్ల కే ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెపుతామని సామాన్య ప్రజలు అంటున్నారు. -
రుణాలు రాక.. కష్టాలు తీరక
సాక్షి, కంభం (ప్రకాశం): ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకం అర్హులకు అందలేదు. ప్రతి పథకంలో జన్మభూమి కమిటీలదే పెత్తనం, రుణాలైనా, రేషన్‌కార్డులైన, పించన్‌లైనా ఇలా ఏది చూసుకున్నా పథకాలన్నీ పచ్చచొక్కాలకే పరిమితమైపోతున్నాయని అర్హులకు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక మైనారిటీ కార్పోరేషన్ ద్వారా ముస్లింల సబ్సిడీ రుణాల విషయంలో జన్మభూమి కమిటీల పెత్తనమే సాగింది వారు చెప్పిన వారిపేర్లనే అధికారులు ప్రతిపాదించారు. పోనీ వాళ్లకైనా రుణాలు ఇచ్చారా అంటే అదికూడాలేదు. 2018–19కి గానూ జిల్లాలో 11812 మంది మైనారిటీలు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోగా ఒక్కరికి కూడా నేటికి ఒక్కరుపాయి రుణం అందలేదు. దీంతో టిడిపి కార్యకర్తలు సైతం ప్రభుత్వం తీరుతో విస్తుపోయి సబ్సిడీ రుణాలపైన ఆశలు వదులుకున్నట్లు కన్పిస్తుంది. అర్హులకు అందని రుణాలు సబ్సిడీ రుణాలు ఒక్కరి ఖాతాలో కూడా జమ కాలేదు. ఒంగోలు మైనారిటీ కార్యాలయానికి వెళ్లి ఫొటోలు, ఇతర డాక్యుమెంట్లు కూడా అందజేసామని రుణాలకు ఎంపికైన అభ్యర్థులు తెలిపారు. త్వరలో బ్యాంకుల్లో లోన్ల డబ్బులు పడతాయని అధికారులు చెప్పినా నేటికి ఒక్కరుపాయి కూడా ఎవరికి అందలేదు. దీంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు కూడా వచ్చేయడంతో తమకు ఇక రుణాలు వస్తాయో లేదో అన్న అనుమానం కలుగుతుందని వాపోతున్నారు. కొందరు టీడీపీ నాయకులు రుణాలు ఇప్పిస్తామంటూ దరఖాస్తుదారుల వద్ద డబ్బులు కూడా వసూలు చేసినట్లు ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. మండలం మంజూరైన యూనిట్లు వచ్చిన రఖాస్తులు కంభం 69 554 బేస్తవారిపేట 34 144 గిద్దలూరు 37 237 రాచర్ల 36 265 కొమరోలు 53 267 అర్థవీడు 59 144 జన్మభూమి కమిటీలతో నష్టపోయా.. ఇప్పటికీ నాలుగుసార్లు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాను. జన్మభూమి కమిటీలదే పెత్తనం కావడంతో నాకు ఒక్కసారి కూడా రుణం మంజూరు కాలేదు. అధికారులు సైతం వారి మాటలే వినడంతో నాకు రుణం మంజూరు కాలేదు. –మహబూబ్ వలి, కందులాపురం ప్రతి ఏడాది దరఖాస్తు చేస్తున్నాను.. రుణం కోసం ప్రతి ఏడాది దరఖాస్తు చేసి కార్యాలయంలో దరఖాస్తులు ఇస్తున్నాను. ఇప్పటికి ఒక్కసారి కూడా మంజూరు కాలేదు. లబ్ధిదారుల ఎంపిక సజావుగా జరగక పోవడంతో అర్హులకు అన్యాయం జరుగుతుంది. - షేక్.మస్తాన్‌వలి రుణం వస్తే వ్యాపారం చేసుకుందామనుకున్నాను.. మైనారిటీ రుణం వస్తే చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చులే అనుకున్నాను. లోను మంజూరైందో లేదో కూడా తెలియడం లేదు. దీంతో కష్టంగా ఉన్న బేల్దారు పనికి పోతున్నాను. –నాయబ్ రసూల్, కంభం లబ్ధిదారుల జాబితా అప్లోడ్ చేశాం.. అర్హులను ఎంపిక చేసి ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలు అప్లోడ్ చేశాం. మైనారిటీ కార్పొరేషన్ రేషన్ నుంచి మంజూరు కావాల్సి ఉంది. ఇతర కార్పొరేన్లకు సంబంధించి కూడా ఎవరికి రుణాలు మంజూరు కాలేదు. దీనిపై అధికారులతో సమీక్షిస్తాం. –ప్రసూనాదేవి, ఎంపీడీఓ -
అల్లా..వారిని క్షమించరు!
సాక్షి, కర్నూల్: అవినీతి, అక్రమాల్లో మునిగి తేలిన వారిని అల్లా కూడా క్షమించబోరని ఏపీ ముస్లిం కౌన్సిల్ అధ్యక్షుడు, రిటైర్డ్ తహసీల్దార్ సయ్యద్ రోషన్ ఆలీ అన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో రెవెన్యూ, పోలీస్ శాఖలు పూర్తిగా నిర్వీర్యమై పోయాయని విమర్శించారు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితులు దాపురించాయన్నారు. ఉద్యోగాలు పోయినా బతికేస్తామనే భరోసాతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు. రెవెన్యూ మంత్రికి తెలియకుండానే ప్రభుత్వ భూముల బదిలీలు జరిగిపోయాయని ఆరోపించారు. జిల్లాలోని ఓర్వకల్లు, జూపాడుబంగ్లా, కొలిమిగుండ్ల ప్రాంతాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని.. ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి మార్గాలను చూపలేక పోయిందన్నారు. దుల్హన్ పథకం ఉన్నప్పుడే పేద, మధ్య తరగతి ప్రజలకు న్యాయం జరిగేదని, ప్రస్తుతం ఆ పథకం స్థానంలో ఉన్న చంద్రన్న పెళ్లి కానుకతో ముస్లిం, మైనారిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ‘సాక్షి’తో ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ప్రభుత్వ భూములు విచ్చలవిడిగా కబ్జా ... ఎంతో విలువైన ప్రభు త్వ భూములను అధికారాన్ని అడ్డం పెట్టుకొని జిల్లాలో కొందరు నేతలు బహిరంగంగా కబ్జా చేస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. అనేక మండలాల్లో వీఆర్ఐ, ఆర్ఐ, తహసీల్దార్లకు తెలియకుండానే భూముల బదిలీలు జరిగిపోతున్నాయి. అవసరాలకు సొంత పట్టా భూములు అమ్ముకునేందుకు కూడా వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఆదోనిలో ఓ మాజీ ప్రజా ప్రతినిధి సోదరుని ప్రమేయం లేకుంటే ఎవరు భూములు, స్థలాలు అమ్ముకునేందుకు, కొనేందుకు వీలులేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను మునుపెన్నడూ చూడలేదు. చంద్రన్న పెళ్లి కానుకతో మైనారిటీలకు కష్టాలు ... దుల్హన్ పథకం స్థానంలో చంద్రన్న పెళ్లి కానుక ప్రవేశ పెట్టడం వల్ల మైనారిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. దుల్హన్ పథకంలో వివాహం అనంతరం దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సహకారం అందేది. ప్రస్తుతం చంద్రన్న పెళ్లి కానుకలో వివాహానికి 20 రోజుల ముందే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు పలు రకాల నిబంధనలను పెట్టడం వల్ల నిరక్షరాస్యులైన మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఇబ్బంది పడుతున్నారు. దుల్హన్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న 285 జంటలకు రూ.1,42,50,000 ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది. ఇక ... మైనారిటీ రుణాల గురించి చెప్పాల్సిన పని లేదు. ముందుగా అధికార పార్టీకి చెందిన వారికి మొదటి ప్రాధాన్యం, డబ్బున్నోడికి రెండవ ప్రాధాన్యతగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అర్హులైన పేద వారికి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందని పరిస్థితి నెలకొనింది. స్థలాలు చూపించడంలో నిర్లక్ష్యం ... కేంద్ర ప్రభుత్వం పలు మైనారిటీ విద్యా సంస్థల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి 15 పాయింట్ ప్రోగ్రామ్ కింద జిల్లాకు నిధులు విడుదల చేసినా, ఆయా విద్యా సంస్థల ఏర్పాటుకు స్థలాలు చూపించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చాగలమర్రిలో మైనారిటీ విద్యా సంస్థకు 8 కిలోమీటర్ల దూరంలో స్థలం చూపించారు. నందికొట్కూరులో స్థలం లేక బ్రాహ్మణకొట్కూరులో చూపిస్తున్నారు. ఆదోనిలో మైనారిటీ జూనియర్ కళాశాలకు రజకులకు సంబంధించిన స్థలం చూపించి రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించారు. చుక్కల భూములతో రైతులకు చుక్కలు చూపించారు ... చుక్కల భూముల పేరుతో జిల్లాలో రైతులకు చుక్కలు చూపించారు. దాదాపు 1.75 లక్షల ఎకరాల చుక్కల భూములు ఉన్నట్లు తేలడంతో వేలాది మంది రైతులు తమ భూములను తిరిగి తమ అనుభవంలోకి తీసుకునేందుకు అనేక ఆర్థిక, మానసిక కష్టాలను అనుభవించారు. యువతకు లభించని ఉపాధి జిల్లాలోని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్‌కు 16 వేల ఎకరాలు, గని సోలార్ పార్కుకు 5 వేలు, కొలిమిగుండ్ల సిమెంట్ హబ్‌కు 12 వేలు, జూపాడుబంగ్లా మెగా సీడ్ పార్కుకు 1600 ఎకరాల భూములను తీసుకున్నారు. అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పట్టా భూమలను ఇష్టానుసారం ప్రభుత్వం లాగేసుకుంది. పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. నిరుద్యోగ యువతకు ఉపాధి చూపలేదు. ఉన్నత విద్యను అభ్యసించిన వేలాది మంది యువతీ యువకులు జిల్లాలో ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో పొట్ట చేతపట్టుకొని సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. 4 శాతం రిజర్వేషన్ అమలు శూన్యం ముస్లింల కోసం వైఎస్సార్ అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్ చంద్రబాబు పాలనలో ఏ మత్రం అమలు కాలేదు. రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. ఇక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన భర్తీ అవుతున్న ఉద్యోగాలు కూడా రాజకీయ పలుకుబడి, డబ్బు ఉన్న వారికి మాత్రమే దక్కుతున్నాయి. మైనారిటీ వర్గాలకు 4 శాతం రిజర్వేషన్ వల్ల ఈ పాలనలో ఎలాంటి ఉపయోగం కనిపించడం లేదు. -
ముస్లిం యువకుల ఆశలు అడియాసలేనా..?
సాక్షి, గిద్దలూరు: టీడీపీ ఐదేళ్ల పాలనలో ముస్లింల సంక్షేమాన్ని విస్మరించింది. నాలుగు సంవత్సరాల పాటు ముస్లింలకు ఎలాంటి పథకాలు అమలు చేయని ప్రభుత్వం ఎన్నికలకు ముందు నారా హమారా– టీడీపీ హమారా అంటూ సభలు నిర్వహించింది. నాలుగు సంవత్సరాల పాటు మరచిన ప్రభుత్వం కనీసం 2018–2019 ఆర్థిక సంవత్సరంలోనైనా తమకు న్యాయం చేయడాలని ముందుకొచ్చిందనుకుంటే చివరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయకుండా అన్యాయం చేశారని ముస్లిం యువకులు ఆరోపిస్తున్నారు. గతేడాది మే, జూన్ మాసాల్లో అన్ని జిల్లాల నుంచి ముస్లింలు సబ్సిడీ రుణాల కోసం పెద్ద ఎత్తున ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. వీటికి సంబంధించి జూలైలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. కేవలం నూటికి ఇద్దరికి చొప్పున రుణాలు మంజూరు చేసి మిగిలిన వారికి మొండిచేయి చూపించారు. మంజూరైన వారిలోనూ కొద్ది మందికి మాత్రమే బ్యాంకు ఖాతాల్లో నగదు జమైంది. మిగిలిన వారికి చెక్కులు ఇచ్చారేకానీ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఇలాంటి వారు కార్పొరేషన్లు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిధులు మళ్లించి మైనారిటీలకు అన్యాయం: ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పథకాలకు సంబంధించి ఆయా కార్పొరేషన్ల నిధులను మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా యూనిట్లకు రుణాలు పూర్తిస్థాయిలో మంజూరయ్యాయని చెబుతూ గత ఏడాది చివరి మూడు నెలల్లో గ్రౌండింగ్ మేళా ఏర్పాటు చేసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఆయా బ్యాంకులకు నిధులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులకు రుణాలు అందలేదు. వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎన్నికల కోడ్ రావడంతో ఆందోళనలో ముస్లిం యువకులు: ఆదివారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సబ్సిడీ రుణాలు లబ్ధిదారులకు అందే అవకాశం లేదన్న ప్రచారం సాగుతోంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకాలం జాప్యం చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు ముస్లిం సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మైనారిటీలను కేవలం మభ్యపెట్టేందుకే రుణాలు మంజూరు చేస్తున్నామంటూ దరఖాస్తులు ఆహ్వానించారని, ఒక్కో లబ్ధిదారుడు ఐదారు వందల రూపాయలు వెచ్చించి దరఖాస్తులు చేసుకుని, వేల రూపాయలు ఖర్చు చేసి జిల్లా మైనారిటీ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోవడంతో తమకు రుణాలు మంజూరు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల అమరావతిలో మంత్రి నక్కా ఆనందబాబును కలిసి మైనారిటీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. -
స్కాలర్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం అర్బన్ : భారత ప్రభుత్వం ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్ షిప్‌కు సంబంధించి 2016–17 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీ కమ్యూనిటీ విద్యార్థినీవిద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ కార్పొరేషన్ ఈడీ ఎస్.జమీర్ అహ్మద్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌ల కోసం ఆగస్టు 6, మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్ షిప్ కోసం అక్టోబరు 31 చివరి తేది. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఒకట తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్ నుంచి పీహెచ్డీ వరకు, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుకునే మైనార్టీ కమ్యూనిటీ విద్యార్థులు అర్హులు.