అల్లా..వారిని క్షమించరు! | The AP Muslim Council President Said That Corruption Can Not be Forgiven Chandra Babu | Sakshi
Sakshi News home page

అల్లా..వారిని క్షమించరు!

Published Sun, Mar 17 2019 8:18 AM | Last Updated on Sun, Mar 17 2019 8:18 AM

The AP Muslim Council President Said That Corruption Can Not be Forgiven Chandra Babu - Sakshi

‘సాక్షి’తో ఏపీ ముస్లిం కౌన్సిల్‌ అధ్యక్షులు సయ్యద్‌ రోషన్‌ ఆలీ

సాక్షి, కర్నూల్‌: అవినీతి, అక్రమాల్లో మునిగి తేలిన వారిని అల్లా కూడా క్షమించబోరని ఏపీ ముస్లిం కౌన్సిల్‌ అధ్యక్షుడు, రిటైర్డ్‌ తహసీల్దార్‌ సయ్యద్‌ రోషన్‌ ఆలీ అన్నారు. టీడీపీ ఐదేళ్ల  పాలనలో రెవెన్యూ, పోలీస్‌ శాఖలు పూర్తిగా నిర్వీర్యమై పోయాయని విమర్శించారు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితులు దాపురించాయన్నారు. ఉద్యోగాలు పోయినా బతికేస్తామనే భరోసాతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు.

రెవెన్యూ మంత్రికి తెలియకుండానే ప్రభుత్వ భూముల బదిలీలు జరిగిపోయాయని ఆరోపించారు. జిల్లాలోని ఓర్వకల్లు, జూపాడుబంగ్లా, కొలిమిగుండ్ల ప్రాంతాల్లో బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ వర్గాల నుంచి వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని.. ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి మార్గాలను చూపలేక పోయిందన్నారు. దుల్హన్‌ పథకం ఉన్నప్పుడే పేద, మధ్య తరగతి ప్రజలకు న్యాయం జరిగేదని, ప్రస్తుతం ఆ పథకం స్థానంలో ఉన్న చంద్రన్న పెళ్లి కానుకతో ముస్లిం, మైనారిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ‘సాక్షి’తో ఆయన ఇంకా ఏం చెప్పారంటే...          
ప్రభుత్వ భూములు విచ్చలవిడిగా కబ్జా ... 
ఎంతో విలువైన ప్రభు త్వ భూములను అధికారాన్ని అడ్డం పెట్టుకొని జిల్లాలో కొందరు నేతలు బహిరంగంగా కబ్జా చేస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. అనేక మండలాల్లో వీఆర్‌ఐ, ఆర్‌ఐ, తహసీల్దార్లకు తెలియకుండానే భూముల బదిలీలు జరిగిపోతున్నాయి. అవసరాలకు సొంత పట్టా భూములు అమ్ముకునేందుకు కూడా వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఆదోనిలో ఓ మాజీ ప్రజా ప్రతినిధి సోదరుని ప్రమేయం లేకుంటే ఎవరు భూములు, స్థలాలు అమ్ముకునేందుకు, కొనేందుకు వీలులేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను మునుపెన్నడూ చూడలేదు.  

చంద్రన్న పెళ్లి కానుకతో మైనారిటీలకు కష్టాలు ... 
దుల్హన్‌ పథకం స్థానంలో చంద్రన్న పెళ్లి కానుక ప్రవేశ పెట్టడం వల్ల మైనారిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. దుల్హన్‌ పథకంలో వివాహం అనంతరం దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సహకారం అందేది. ప్రస్తుతం చంద్రన్న పెళ్లి కానుకలో వివాహానికి 20 రోజుల ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు పలు రకాల నిబంధనలను పెట్టడం వల్ల నిరక్షరాస్యులైన మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఇబ్బంది పడుతున్నారు. దుల్హన్‌ పథకం కింద దరఖాస్తు చేసుకున్న 285 జంటలకు రూ.1,42,50,000 ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది. ఇక ... మైనారిటీ రుణాల గురించి చెప్పాల్సిన పని లేదు. ముందుగా అధికార పార్టీకి చెందిన వారికి మొదటి ప్రాధాన్యం, డబ్బున్నోడికి రెండవ ప్రాధాన్యతగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అర్హులైన పేద వారికి మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందని పరిస్థితి నెలకొనింది.  

స్థలాలు చూపించడంలో నిర్లక్ష్యం ... 
కేంద్ర ప్రభుత్వం పలు మైనారిటీ విద్యా సంస్థల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి 15 పాయింట్‌ ప్రోగ్రామ్‌ కింద జిల్లాకు నిధులు విడుదల చేసినా, ఆయా విద్యా సంస్థల ఏర్పాటుకు స్థలాలు చూపించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చాగలమర్రిలో మైనారిటీ విద్యా సంస్థకు 8 కిలోమీటర్ల దూరంలో స్థలం చూపించారు. నందికొట్కూరులో స్థలం లేక బ్రాహ్మణకొట్కూరులో చూపిస్తున్నారు. ఆదోనిలో మైనారిటీ జూనియర్‌ కళాశాలకు  రజకులకు సంబంధించిన స్థలం చూపించి రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించారు.

         

చుక్కల భూములతో రైతులకు చుక్కలు చూపించారు ... 
చుక్కల భూముల పేరుతో జిల్లాలో రైతులకు చుక్కలు చూపించారు. దాదాపు 1.75 లక్షల ఎకరాల చుక్కల భూములు ఉన్నట్లు తేలడంతో వేలాది మంది రైతులు తమ భూములను తిరిగి తమ అనుభవంలోకి తీసుకునేందుకు అనేక ఆర్థిక, మానసిక కష్టాలను అనుభవించారు.  

యువతకు లభించని ఉపాధి 
జిల్లాలోని ఓర్వకల్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌కు 16 వేల ఎకరాలు, గని సోలార్‌ పార్కుకు 5 వేలు, కొలిమిగుండ్ల సిమెంట్‌ హబ్‌కు 12 వేలు, జూపాడుబంగ్లా మెగా సీడ్‌ పార్కుకు 1600 ఎకరాల భూములను తీసుకున్నారు. అనేక మంది ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పట్టా భూమలను ఇష్టానుసారం ప్రభుత్వం లాగేసుకుంది. పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. నిరుద్యోగ యువతకు ఉపాధి చూపలేదు. ఉన్నత విద్యను అభ్యసించిన వేలాది మంది యువతీ యువకులు జిల్లాలో ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో పొట్ట చేతపట్టుకొని సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.  

4 శాతం రిజర్వేషన్‌ అమలు శూన్యం 
ముస్లింల కోసం వైఎస్సార్‌ అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్‌ చంద్రబాబు పాలనలో ఏ మత్రం అమలు కాలేదు. రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. ఇక అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన భర్తీ అవుతున్న ఉద్యోగాలు కూడా రాజకీయ పలుకుబడి, డబ్బు ఉన్న వారికి మాత్రమే దక్కుతున్నాయి. మైనారిటీ వర్గాలకు 4 శాతం రిజర్వేషన్‌ వల్ల ఈ పాలనలో ఎలాంటి ఉపయోగం కనిపించడం లేదు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement