సాక్షి కడప/రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులతో చెలగాటమాడుతోంది. పాలకుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలక్ష్యం వెరసి వారికి తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. విద్యా సంవత్సరాలు ముగుస్తున్నా అందాల్సిన రీయింబర్స్‌మెంట్ అందకపోవడంతో విద్యార్థులకు అవస్థలు ఎదురవుతున్నాయి. పైగా నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజుల రూపంలో కోట్లకు కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.
దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ప్రస్తుత టీడీపీ సర్కార్ పుణ్యమా అని చెదలు పడుతోంది. 2019వ విద్యా సంవత్సరం చివరి దశకు వచ్చినా విద్యార్థులకు సంబంధించిన ఫీజులు అందకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు విద్యార్థులు...మరోవైపు యాజమాన్యాలు సైతం ఫీజుల కోసం ఆందోళన చెందుతున్నాయి. ఇటీవల తిరుపతిలో విద్యానికేతన్ సంస్థల అధినేత, సినీ నటుడు మోహన్‌బాబు నడిరోడ్డుపై బైఠాయించిన సంగతి అందరికీ తెలిసిందే.
జమ కాని ఫీజులు.. స్కాలర్‌షిప్‌లు....
జిల్లాలో 500 ఇంటర్మీడియట్ ఆపై విద్యను బోధించే కళాశాలలు ఉన్నాయి. కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఆయా కళాశాలలో చదివే విద్యార్థులకు ఆ విద్యార్థికి సంబంధించిన ఫీజును ప్రభుత్వం ఒక ఏడాదిలో నాలుగు విడతలుగా ఆయా కళాశాల ఖాతాల్లో జమ చేయాలి. అలాగే స్కాలర్‌షిప్‌లను ప్రతి నెలా విద్యార్థుల ఖాతాల్లో వేయాలి. అయితే ఈ రెండు సక్రమంగా జరగలేదు. ఫీజులను ప్రభుత్వం రెండు విడతలుగా చెల్లించింది. ఉదాహరణకు ఇంజినీరింగ్ విద్యకు ఒక ఏడాదికి రూ. 80 వేలు అయితే, అందులో ప్రభుత్వం రూ. 40 వేలు మాత్రమే చెల్లించింది .అలాగే విద్యార్థులకు స్కాలర్‌షిప్ గత జనవరి నెల నుంచి రావాల్సి ఉంది.
ఫీజు కట్టు..హాల్ టికెట్ పట్టు...
విద్యార్థులకు ఇది పరీక్షల కాలం. కళాశాల యాజమాన్యాలకు ఫీజులు చెల్లించే సమయం. దీంతో ఆయా కళాశాల యాజమాన్యాలు ముందు మీరు ఫీజు కట్టండి.. పరీక్ష రాయడానికి హాల్ టికెట్ తీసుకోండని అంటున్నారు. ‘ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తోంది కదా..! అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే, ‘వారు చెల్లించలేదు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం..ఇప్పుడు కట్టండి. ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తే అప్పుడు తీసుకోండని’ కాలేజీ యాజమాన్యాలు బదులిస్తున్నాయి. దీంతో చేసేది లేక విద్యార్థుల తల్లిదండ్రులు అప్పు చేసి ఫీజులు కడుతున్నారు. మొత్తం మీద పరీక్షల సమయంలో విద్యార్థులు అసలైన ఫీజుల పరీక్షలను ఎదుర్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ‘చంద్ర’గ్రహణం
దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి టీడీపీ సర్కార్ తూట్లు పొడుస్తోంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు కళాశాలలో చేరిన మొదలు తర్వాత ఏడాది చివరిలో ప్రభుత్వ చెల్లింపులు ఆలస్యం కావడంతో విద్యార్థులకు ఒత్తిళ్లు తప్పడం లేదు. పైగా ఆలస్యం చేయడం ఒక కారణం, చెల్లించకపోవడం మరో కారణం లాంటి సమస్యలతో రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని నీరుగారుస్తున్నారన్న అభిప్రాయం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. ఎప్పుడూ లేని తరహాలో హామీలు ఇచ్చి నెరవేర్చలేక కొట్టుమిట్టాడుతూ చివరకు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులోనూ తాత్సారం వారికి తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. యాజమాన్యాలు కూడా బాబు తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
రీయింబర్స్‌మెంట్ సక్రమంగా రాకుంటే నిర్వహణ కష్టం
ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా రాకుంటే కళాశాల నిర్వహణ కష్టమవుతుంది. ఈ ఏడాది పూర్తి, గత ఏడాది కొంత ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాల్సి ఉంది. గతంలో వైఎస్ హయాంలో ఫీజురీయింబర్స్‌మెంట్ సక్రమంగా మంజూరయ్యేది. ఇటీవల కాలంలో సక్రమంగా చెల్లించకపోవడంతో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కళాశాలలో దాదాపు 100 మంది దాకా అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి ఉంటారు. వీరికి జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు ఇబ్బంది.
– ఓ.గురుబ్రహ్మయ్య, గౌతమి మహిళా ఇంజినీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్, ప్రొద్దుటూరు
చదువుల ప్రదాత వైఎస్సార్..
దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు పెద్ద..పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా విద్యను పొందగలిగారు. నాడు...ఏనాడూ విద్యార్థులకు ఉపకార వేతనాల సమస్య వచ్చేది కాదు. విద్యార్థులకు సంబంధించి చిన్న సమస్య కూడా ఏర్పడకుండా చూసుకున్నారు. విద్యా సంవత్సరం పూర్తి కాకమునుపే యాజమాన్యాలకు ఫీజులు చెల్లించే పరిస్థితి ఉండేది. అయితే ఆయన మరణానంతరం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం బాలారిష్టాలతో కొట్టుమిట్టాడుతోంది.
విద్యార్థులు చదువు మానేస్తున్నారు
తగిన సమయంలో ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంతో విద్యార్థులు కీలక దశలో డిగ్రీ చేతికి అందకముందే చదువు మానేయాల్సిన దయనీయమైన స్థితి దాపురించింది. ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విద్యార్థులు చదువు మధ్యలో మానేస్తే వారికి ఏం భవిష్యత్తు ఉంటుంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మూడేళ్లుగా ప్రభుత్వం కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం కోట్లాది రూపాయలకు చేరింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది విద్యా సంస్థలు మూసివేయక తప్పదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను పసుపు–కుంకుమలకు మళ్లించడం ఏం న్యాయం. ఈనెల 30వ తేదీలోగా రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుంటే సమైక్యంగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి ఉంటుంది - లయన్ పఠాన్ అక్బర్‌ఖాన్, మైనార్టీ విద్యా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు
వైఎస్ జగన్‌తోనే పథకానికి వెలుగు
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి మళ్లీ ఒక వెలుగు వచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే వైఎస్సార్ మరణానంతరం అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ ప్రభుత్వాలు పథకాన్ని నిర్వీర్యం చేశాయి. బకాయిలు పేరుకుపోతున్నా పట్టించుకోని తీరే అందుకు బలం చేకూరుస్తోంది. పైగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా విద్యార్థుల ఫీజులతోపాటు హాస్టల్ ఫీజు కింద రూ. 20 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. విద్యార్థుల చదువుల భారాన్ని మోసేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. చిన్నతనం నుంచే బడికి పంపించిన తల్లిదండ్రుల అకౌంటుకు ప్రతి సంవత్సరం రూ. 15 వేలు ఇస్తూనే ఇంజినీరింగ్ లాంటి పెద్ద పెద్ద చదువులు చదివించే బాధ్యత తీసుకోనున్నారు.
విద్యార్థులకు ఇబ్బందులు
ప్రభుత్వం ఓసీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ విడుదలలో తీవ్ర జాప్యం చేస్తోంది విద్యా సంవత్సరం ముగిసినా మంజూరు చేయడం లేదు. కిందటి ఏడాదికి సంబంధించిన ఫీజు రెండో ఏడాది సగం విద్యా సంవత్సరం గడిచిన తరువాత అందిస్తున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
– విష్ణువర్దన్‌రెడ్డి, అగ్రికల్చర్ బీఎస్సీ, వరికుంట్ల, కాశినాయన మండలం
జిల్లాలో ఫీజుల వివరాలు (ఫ్రెష్, రెన్యూవల్)
ఎస్సీ విద్యార్థుల సంఖ్య | 19500 |
ఫీజులకు అవసరం | రూ. 25 కోట్లు |
ఇంకా రావాల్సిన నిధులు | రూ. 6 కోట్లు |
స్కాలర్‌షిప్పులకు అవసరం | రూ. 8.50 కోట్లు |
ఇంకా అందాల్సిన నిధులు | రూ. 2.50 కోట్లకు పైగా |
బీసీ విద్యార్థుల సంఖ్య | 36,845 |
ఫీజులకు అవసరం | రూ. 60 కోట్లు |
బకాయిలు | రూ. 10 కోట్లకు పైగా |
సాల్కర్‌షిప్పులకు అవసరం | రూ. 14 కోట్లు |
ఇంకా రావాల్సిన నిధులు | రూ. 150 కోట్లకు పైగా |
ఈబీసీ విద్యార్థుల సంఖ్య | 21,710 |
ఫీజులకు అవసరం | రూ. 50 కోట్లు |
బకాయిల మొత్తం | రూ. 13.20 కోట్లకు పైగా |
మైనార్టీ విద్యార్థులు | 16335 |
ఫీజులకు అవసరం | రూ. 29.86 కోట్లు |
రావాల్సిన బకాయిలు | రూ. 5.24 కోట్లు |
స్కాలర్‌షిప్పులకు అవసరం | రూ. 74.12 లక్షలు |
రావాల్సిన బకాయిలు | రూ. 14 లక్షలకు పైగా |
ఏటా ఇదే ఆలస్యం
ఫీజు రీఎంబర్స్‌మెంట్ మంజూరులో ఏటా ఇదే తంతు. కోర్సు పూర్తయ్యే సరికి కనీసం 25 శాతం కూడా మంజూరు చేయడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కళాశాలల్లో సొంత జేబు నుంచి ఫీజు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. గత నాలుగేళ్లుగా ఇలానే జరుగుతోంది.
– ఉపేంద్ర, బీకాం కంప్యూటర్స్, పోరుమామిళ్ల
పేదల చదువుకోసమే జగనన్న హామీ
వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల అభివృద్ధిలో భాగంగా ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ ను జగన్ అనుసరిస్తున్నారు. వైఎస్సార్ అడుగుజాడలలోనే వస్తున్నాడు. పేదల చదువుల కోసమే వైస్ జగన్ పాటుపడడం సంతోషంగా ఉంది.
ఐ. శ్రావణి బీకామ్, రంగాపురం, ఖాజీపేట మండలం
Comments
Please login to add a commentAdd a comment