కమీషన్ల గోల !
సాక్షి ప్రతినిధి, గుంటూరు : నీరు-చెట్టు పథకానికి సంబంధించి కమీషన్ల వివాదం ముదురుతోంది. చెరువుల మరమ్మతులు చేసిన జన్మభూమి కమిటీల నుంచి జలవనరుల శాఖ, పే అండ్ అకౌంట్స్ విభాగాల అధికారులు కమీషన్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఆ శాఖలు డిమాండ్ చేసిన కమీషన్లు ఇవ్వకపోతే మరమ్మతులకు సంబంధించిన బిల్లులను పెండింగ్ పెడుతున్నారు. ఆ బిల్లులకు సంబంధించిన వివరాలు లేవంటూ కొర్రీలు వేస్తున్నారు. చెరువులకు అసలు మరమ్మతులు చేయకుండా, తవ్వగా వచ్చిన మట్టిని అమ్ముకుని గ్రామ కమిటీలు కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందాయని ఈ శాఖల అధికారుల వాదన. సులభంగా గడించిన ఆదాయంలోనూ తమకు కమీషన్లు ఇవ్వకుండా పొలిటికల్ పవర్ చూపిస్తూ బెదిరించే స్థితికి వచ్చాయంటున్నారు. మొత్తం మీద ఈ కమీషన్ల వివాదం కారణంగా రూ.4 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపులకు నోచుకోలేదు.
330 చెరువుల్లో మెరకతీత పనులు పూర్తి
జిల్లాలో నీరు-చెట్టు పథకం కింద మే నెలలో చెరువుల తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 611 చెరువుల్లో మెరక తీసే పనులను గ్రామ కమిటీలు ప్రారంభించాయి. క్యూబిక్ మీటరు మట్టిని తవ్వినందుకు రూ.29 లను ప్రభుత్వం గ్రామ కమిటీలకు అందజేసింది. దాదాపు 330 చెరువుల్లో మెరక పనులు పూర్తి చేస్తే మిగిలిన చెరువుల్లో తవ్వకాలు అసంపూర్తిగా మిగిలి పోయాయి. సుమారు 80 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఈ కమి టీలు తవ్వాయి. ఇందుకు రూ.23.20 కోట్లను జన్మభూమి కమిటీలకు చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.15 కోట్ల వరకు గ్రామ కమిటీలకు నగదు చెల్లింపులు జరిగాయి. కొన్ని కమిటీలు ఈ శాఖలు డిమాండ్ చేసిన కమీషన్లు చెల్లిస్తే, మరికొన్ని కమిటీలు తిరస్కరించాయి. కమీషన్లు భారీగా చెల్లించాలంటూ ఈ శాఖల అధికారులు డిమాండ్ చేశారని ఈ కమిటీలు ఆరోపిస్తున్నాయి.
ఇతర పనులకు కమీషన్లు ఇలా..సాధారణంగా ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లు ఇతర కాంట్రాక్టర్ల నుంచి బిల్లు మొత్తంపై 10 నుంచి 12 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నారు. ఇందులో వర్క్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజినీరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, డిప్యూటీ ఎస్‌ఈ, ఆ సర్కిల్ సూపరింటెండెంట్ వరకు వాటాలు ఉంటాయి. ఈ వాటాల పంపిణీ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతుంది.
అసాధారణ లాభాలు .. అయితే నీరు-చెట్టు పథకం పనులు చేపట్టిన అభివృద్ధి కమి టీలకు అసాధారణ లాభాలు వచ్చాయి. తవ్విన మట్టికి క్యూబిక్ మీటరుకు రూ.29లను ప్రభుత్వం నుంచి పొందడమే కాకుండా తవ్విని మట్టిని ఆ గ్రామాల్లోని రైతులకు విక్రయించాయి. ట్రాక్టరు ట్రక్కు రూ.400 నుంచి రూ.600 లకు విక్రయించి అసాధారణ లాభాలు పొందాయి. ఇది బహిరంగ రహస్యం కావడంతో కొందరు ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లు, పే అండ్ అకౌంట్స్ విభాగ అధికారులు బిల్లుపై అధిక మొత్తంలో కమీషన్ డిమాండ్ చేశారు. ఇరిగేషన్ శాఖ 20 శాతం కమీషన్ తీసుకుంటే, పే అండ్ అకౌంట్స్ విభాగం 8 నుంచి 10 శాతం కమీషన్ తీసుకుంది.
కొన్ని జన్మభూమి కమిటీలు వీరితో వివాదానికి దిగకుండా తమకు వచ్చిన అసాధారణ లాభంలో ఈ కమీషన్ చెల్లించాయి. మరి కొన్ని కమిటీలు ఇంత కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదంటూ వివాదానికి దిగాయి. రాజకీయంగా పలుకుబడి కలిగిన కొన్ని జన్మభూమి కమిటీలు ఈ శాఖల అధికారులను బ్లాక్‌మెయిల్ చేశాయి కూడా. ఈ వివాదం, ఇతర కొర్రీల కారణంగా రూ.4 కోట్ల విలువైన బిల్లులు పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉండిపోయాయి.