‘మేడిగడ్డ’ ఖర్చు ప్రభుత్వమే భరించాలి | Another letter from L and T to Irrigation Department | Sakshi
Sakshi News home page

‘మేడిగడ్డ’ ఖర్చు ప్రభుత్వమే భరించాలి

Published Sat, Feb 24 2024 3:27 AM | Last Updated on Sat, Feb 24 2024 3:27 AM

Another letter from L and T to Irrigation Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, కాఫర్‌ డ్యాం నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్మాణసంస్థ ఎల్‌అండ్‌టీ మళ్లీ తేల్చిచెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్‌తోనే బ్యారేజీని నిర్మించామని, అలాంటప్పుడు అందులో తలెత్తిన లోపాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈనెల 17న రామగుండం సీఈకి ఎల్‌అండ్‌టీ అధికారులు లేఖ రాశారు. అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ నీళ్లన్నీ మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ను చుట్టుముట్టాయని, దీంతో తాము చేసిన పనులు దెబ్బతిన్నాయని ఆ లేఖలో పేర్కొంది.

ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్లక్ష్యంతో తాము చేసిన పనులు వృథా అయ్యాయని చెప్పింది. ఇందుకు ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంటే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్లు (పిల్లర్లు), రాఫ్ట్‌ ఫౌండేషన్, కటాఫ్‌ వాల్స్, ససికెంట్‌ పైల్స్‌ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉందని, పునరుద్ధరణ పనులు చేసే ఏడో బ్లాక్‌తోపాటు దానికి ఇరువైపులా ఉన్న బ్లాకులకు అప్‌స్ట్రీమ్, డౌన్‌ స్ట్రీమ్‌లో కాఫర్‌ డ్యాం నిర్మించాల్సి ఉందని ఈ లేఖలో స్పష్టం చేసింది. ఈ పనులు వ్యయ ప్రయాసలతో కూడుకున్నవని, అందుకే ప్రభుత్వం వాటికి మళ్లీ అగ్రిమెంట్‌ చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇందుకు సమ్మతిస్తేనే పునరుద్ధరణ పనులు చేస్తామని పేర్కొంది. గోదావరినదిలో కాపర్‌డ్యాం నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుందని, వర్క్‌అగ్రిమెంట్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది.  

మళ్లీ మొదటికొచ్చిన మేడిగడ్డ పనులు 
అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి ముందు మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో ఇన్వెస్టిగేషన్స్‌ కొనసాగుతున్నాయనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని, దీంతో ఆ పనులన్నీ మళ్లీ మొదటికొచ్చాయని ఎల్‌అండ్‌టీ ఆందోళన వ్యక్తం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్‌21న సాయంత్రం కుంగిపోయింది. బ్యారేజీ ఏడో బ్లాక్‌లోని 20వ నంబర్‌ పిల్లర్‌భూమిలోకి ఐదు అడుగులకుపైగా కుంగింది. దీంతో ఏడో బ్లాక్‌లోని నాలుగు పిల్లర్లు భారీగా, ఇంకో ఆరు పిల్లర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటిని పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాలని నేషనల్‌డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రిలిమినరీ రిపోర్టులోనే స్పష్టం చేసింది.

బ్యారేజీలోని మిగతా బ్లాకులు దెబ్బతినకుండా ఉండేందుకు పగుళ్లు తేలిన పిల్లర్లు, వాటి రాఫ్ట్‌ ఫౌండేషన్‌తో సహా తొలగించేందుకు డైమండ్‌ కట్టింగ్‌ విధానం అనుసరించాలని నిర్ణయించారు. బ్యారేజీ కుంగిపోయినప్పుడు దానిని పరిశీలించిన ఎల్‌అండ్‌టీ అధికారులు తామే పునరుద్ధరిస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు (డిసెంబర్‌ 2న) బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఎల్‌అండ్‌టీ బాంబు పేల్చింది. ఈమేరకు రామగుండం ఈఎన్‌సీకి ఎల్‌అండ్‌టీ అధికారులు లేఖ రాశారు. కాఫర్‌ డ్యాం నిర్మాణానికికే రూ.55.75 కోట్లు ఖర్చవుతుందని, ఆ మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని కోరారు.

ఆ తర్వాత డిపార్ట్‌మెంట్‌ ఇంజనీర్లు, ఎల్‌అండ్‌టీ అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. బ్యారేజీని పునరుద్ధరించకుంటే ఎల్‌అండ్‌టీని బ్లాక్‌లిస్టులో పెట్టడంతో పాటు ఆ సంస్థ పొందిన బిల్లులను రెవెన్యూ రికవరీ యాక్ట్‌ప్రయోగించి వసూలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం ఘాటుగా హెచ్చరించిన తర్వాత కూడా ఎల్‌అండ్‌టీ అధికారులు అన్నారం బ్యారేజీ నుంచి నీటి విడుదలను సాకుగా చూపుతూ మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని మరో లేఖ రాశారు. 

మళ్లీ ఒప్పందం చేసుకోండి
మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాఫర్‌ డ్యాంతోపాటు బ్యారేజీలో దెబ్బతిన్న పోర్షన్‌ పునరుద్ధరణకు ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ తిరిగి అగ్రిమెంట్‌ చేసుకోవాల్సిందేనని ఆ లేఖలో స్పష్టం చేసింది. డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ 2022 జూన్‌29నపూర్తయ్యిందని, దీంతో దెబ్బతిన్న బ్యారేజీని పునరుద్ధరించడం తమ బాధ్యత కానేకాదని అందులో పేర్కొన్నారు. 2020లో బ్యారేజీ వద్ద కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు సహా ఇతర పనులు చేయాలని కోరారని, ఆ సమయంలో వర్క్‌అగ్రిమెంట్‌లో లేని పనులను తాము చేపట్టలేమని స్పష్టత ఇచ్చామని గుర్తు చేశారు.

పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్లు ఇవ్వాలని అప్పుడే కోరినా బ్యారేజీ దెబ్బతినేంత వరకు ఇరిగేషన్‌డిపార్ట్‌మెంట్‌నుంచి తమకు ఎలాంటి డిజైన్లు కూడా అందలేదని లేఖలో ప్రస్తావించారు. బ్యారేజీ డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ పూర్తయిన తర్వాత జరిగిన లోపాలను తాము సరి చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌కాఫర్‌డ్యాంతో పాటు బ్యారేజీ పునరుద్ధరణకు కొత్తగా అగ్రిమెంట్‌చేసుకుంటే తప్ప తాము అక్కడ ఎలాంటి పనులు చేపట్టలేమని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement