సాక్షి, కడప : రాష్ట్రం ముక్కలు కాకుండా అడ్డుకునేందుకు జిల్లా ప్రజలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. జైసమైక్యాంధ్ర అంటూ నిరసనలు తెలుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ ప్రజలు రోడ్లపైకి చేరుకుని జాతీయ రహదారులపై రాస్తారోకోలు, మానవహారాలు, వంటా వార్పులతో వాహనాల రాకపోకలను అడ్డుకుంటూ ఆందోళనలు చేపడుతున్నారు. బుధవారం 22వ రోజు సైతం సమైక్య నినాదంతో జిల్లా మార్మోగింది. వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు సంఘీభావంగా జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టారు. దీంతోపాటు వైఎస్సార్ సీపీ నేతలు చేపట్టిన ఆమరణ దీక్షలు ఉద్యమానికి మరింత ఊపు తెస్తున్నాయి.
కడపలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్‌బాష, ఎస్.నాగిరెడ్డి చేస్తున్న ఆమరణ దీక్షలు బుధవారంతో మూడవరోజు ముగిశాయి. ఈ దీక్షలకు మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, నేతలు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రె డ్డి సంఘీభావం తెలిపారు.
రకరకాల విన్యాసాలు, ఆటపాటలతో పలువురు దీక్షలకు సంఘీభావం తెలిపారు. పశు వైద్య సిబ్బంది వినూత్నంగా రోడ్లపై ఈలలు(విజిల్స్) వేస్తూ నిరసన తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు భారీర్యాలీ నిర్వహించారు. డీఆర్‌డీఏ, ఐకేపీ సిబ్బంది, వస్త్ర వ్యాపారులు, విద్యుత్, ఉపాధ్యాయులు, మున్సిపల్ కార్మికులు, న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు ఇర్కాన్ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి రహదారిని దిగ్బంధంచేశారు. దీంతోభారీ సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి.
టెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ విన్యాసాలు ప్రదర్శించారు.
జమ్మలమడుగులో 16 మండలాలకు చెందిన రెవెన్యూ ఉద్యోగులు, తహశీల్దార్లు, సిబ్బంది, ఆర్డీఓ రఘునాథరెడ్డి, జీఎన్‌ఎస్‌ఎస్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి నేతృత్వంలో భారీర్యాలీ చేపట్టి తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి సంఘీభావాన్ని తెలిపారు. న్యాయవాదులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని సత్యాగ్రహం చేపట్టారు. దొమ్మర నంద్యాల హైస్కూలు విద్యార్థులు భారీ సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. జాతీయ నాయకుల వేషధారణలో ప్రదర్శన చేపట్టారు. అంగన్‌వాడీ వర్కర్లు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు.విలేకరులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
పులివెందులలో వైఎస్ విజయమ్మ దీక్షలకు సంఘీభావంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్నిమండల కేంద్రాల్లో రిలే దీక్షలు సాగుతున్నాయి. ఎన్జీఓల ఆధ్వర్యంలో పులివెందుల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. విద్యార్థులు కబడ్డీ, మహిళా ఉద్యోగులు ఆటపాటలతో నిరసన తెలిపారు. పంచాయతీ మినిస్టీరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిబ్బంది వంటా వార్పు చేపట్టారు.
ప్రొద్దుటూరులో వైఎస్ విజయమ్మ దీక్షకు సంఘీభావంగా శివాలయం వద్ద వైఎస్సార్ సీపీ నేతృత్వంలో రెండవరోజు రిలే దీక్షలు సాగాయి. పాఠశాల, జూనియర్ కళాశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల సమైక్య నినాదాలతో పుట్టపర్తి సర్కిల్ మార్మోగింది. వర్షంలోనే తడుస్తూ వేలాది మంది విద్యార్థులు జాతీయజెండాలు చేతబూని సమైక్య నినాదాలు చేపట్టారు.
కమలాపురం పట్టణంలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్షకు మద్దతుగా రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. వీరికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వైద్యులు సంఘీభావం తెలిపారు. సి.గోపులాపురం వద్ద గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డగించి వంటా వార్పు చేపట్టారు.
రాయచోటిలో న్యాయవాదులు, మాధవరం గ్రామస్తులు రిలే దీక్షలు చేపట్టారు. న్యాయవాదులు నోటికి నల్లరిబ్బన్లు ధరించిమౌన ప్రదర్శన చేసి నేతాజీ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. కాంగ్రెస్ నేత రాంప్రసాద్‌రెడ్డి సమైక్యాంధ్ర సీడీలను ఆవిష్కరించారు.
రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎనిమిదవరోజు చేరుకుంది. ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా దీక్షను భగ్నం చేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మనందరెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. దీక్ష భగ్నంకు నిరసనగా గురువారం రైల్వేకోడూరు బంద్‌కు పిలుపునిచ్చారు.
వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా బద్వేలులో వైఎస్సార్‌సీపీ నేతలు రిలే దీక్షలు ప్రారంభించారు. న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో వినూత్నంగా ఎద్దుల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్లలో విలేకరులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు వంటా వార్పు చేపట్టారు.
రాజంపేటలో వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నాయకులు రిలే దీక్షలు ప్రారంభించారు. ఆస్పత్రిలోనే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డికి జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. రిలే దీక్షలు చేస్తున్నవారికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, సురేష్‌బాబు సంఘీభావం తెలిపారు. పట్టణంలో దళితులు భారీ ర్యాలీ నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను తగులబెట్టారు.
మైదుకూరులో ఎన్జీఓల ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సమైక్యవాదులు నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి వాహనాలను అడ్డుకున్నారు.
జన ఉప్పెన
Published Thu, Aug 22 2013 3:15 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
Advertisement
Advertisement