ఆధునిక సేవలను వినియోగించుకోవాలి
కలెక్టర్ యోగితారాణా
నిజామాబాద్ అర్బన్ : అత్యవసర సమయాల్లో ఆధునిక టెక్నాలజీతో కూడిన సర్జరీలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి ఆస్పత్రిలో ఆధునిక పరికరాలతో నిర్వహించిన సిస్టెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్ట్రో ల్యాప్రోస్కోపీ ప్రైమరీ ఇనిఫిటీ సర్జరీల లైవ్ డెమోను కలెక్టర్‌తో పాటు జిల్లా చెందిన గైనకాలజిస్టులు, సర్జన్లు ఆదివారం తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సర్జరీలు చేస్తున్న తీరుతెన్నుల గురించి డాక్టర్ స్వామిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ యోగితారాణా మాట్లాడుతూ పేద ప్రజలకు సేవలందించడం ద్వారానే వైద్య వృత్తికి సార్ధకత చేకూరుతుందన్నారు.
సర్వైకల్ కేన్సర్‌ను గుర్తించేందుకు 32 నుంచి 60 ఏళ్ల వయస్సున్న ప్రతి మహిళకు స్క్రీనింగ్ చేసేందుకు పెలైట్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. బ్రెస్ట్ కేన ్సర్ స్కీనింగ్ టెస్ట్‌లు జరుపాలని డాక్టర్లకు సూచించారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు, ఆస్పత్రిలో ప్రసవాలు జరిపేందుకు మానవాతా దృక్పథంతో పనిచేయాలన్నారు. మహిళలు, పిల్లలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించటంలో ముందుండాలని ఐఎంఏకు కలెక్టర్ పిలుపునిచ్చారు. కాగా, ఐఎంఏ, అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా, గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుల సంఘం సహకారంతో, భాగస్వామ్యంతో ఈ లాప్రోస్కోపీ సర్జరీ డెమో జరిగింది. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వినోద్‌కుమార్‌గుప్తా, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కవితారెడ్డి, డాక్టర్ ఐఎల్ కృష్ణమూర్తి, శ్రీనివాస్‌చక్రవర్తి, స్వామి, అరుణ, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.