district people
-
జిల్లాల్లోనూ ‘నోట్ల’ పాట్లే..!
-
జిల్లాల్లోనూ ‘నోట్ల’ పాట్లే..!
సాక్షి నెట్వర్క్: పెద్ద నోట్ల రద్దుతో గ్రేటర్‌లోనే కాదు రాష్ట్రమంతటా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, ఖమ్మం ఇలా అన్ని జిల్లాల్లోనూ సామాన్యులు పెద్దనోట్లతో పాట్లు పడ్డారు. చేతిలో వంద నోట్లు లేక నానా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పాల ప్యాకెట్ మొదలుకుని బంగారం వరకూ ఏది కొనాలన్నా చిల్లర కావాల్సి రావడంతో వాటి కోసం పరుగులు తీశారు. బుధవారం ఉదయం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన ప్రజలు చాలా అవస్థలు పడాల్సి వచ్చింది. ఎక్కడ ఎవరిని చూసినా 500, 1,000 నోట్లకు చిల్లర కావాలని అడగడమే కనిపించింది. బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసులు మూతపడటంతో వారికి ప్రత్యామ్నాయం కనిపించలేదు. వ్యాపారులు, ప్రైవేటు వాణిజ్య సంస్థలే కాదు ప్రభుత్వం రంగ సంస్థలు సైతం చాలా చోట్ల రూ. 500, 1000 నోట్లను తీసుకోలేదు. చాలా జిల్లాల్లో కరెంటు బిల్లులు చెల్లించేందుకు వెళ్లిన వినియోగదారుల నుంచి పెద్ద నోట్లను సిబ్బంది తీసుకోలేదు. దీంతో చేసేది లేక వారు వెనుదిరిగారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు యాదాద్రి, భద్రాద్రికి వచ్చిన భక్తులకు చిల్లర తిప్పలు తప్పలేదు. దీంతో చాలా మంది వ్రతం పూజలు చేయించుకోలేకపోయారు. నిన్న మొన్నటి వరకూ రైతులకు అప్పులు ఇచ్చేందుకు వడ్డీ వ్యాపారులు నానా అవస్థలు పెట్టేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో వ్యాపారులే నేరుగా రైతుల వద్దకు వెళ్లి మరీ అప్పులు ఇచ్చారు. ఇక తనఖాలు, నిబంధనలు అంటూ సవాలక్ష కొర్రీలు పెట్టే వ్యాపారులు.. అటువంటి వేమీ లేకుండా వడ్డీ తక్కువైనా ఫర్వాలేదు ముందు అప్పు తీసుకోండి అంటూ రైతుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక మార్కెట్ యార్డుల్లో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన దళారులు, వ్యాపారులు డబ్బు చెల్లించేందుకు వారం, పది రోజులు గడువు విధించేవారు. కానీ బుధవారం మాత్రం అక్కడికక్కడే రైతులకు డబ్బు చెల్లించడమే కాక అదనంగా అప్పులు ఇచ్చేందుకు సైతం ముందుకు రావడం గమనార్హం. -
ఆధునిక సేవలను వినియోగించుకోవాలి
కలెక్టర్ యోగితారాణా నిజామాబాద్ అర్బన్ : అత్యవసర సమయాల్లో ఆధునిక టెక్నాలజీతో కూడిన సర్జరీలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి ఆస్పత్రిలో ఆధునిక పరికరాలతో నిర్వహించిన సిస్టెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్ట్రో ల్యాప్రోస్కోపీ ప్రైమరీ ఇనిఫిటీ సర్జరీల లైవ్ డెమోను కలెక్టర్‌తో పాటు జిల్లా చెందిన గైనకాలజిస్టులు, సర్జన్లు ఆదివారం తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సర్జరీలు చేస్తున్న తీరుతెన్నుల గురించి డాక్టర్ స్వామిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ యోగితారాణా మాట్లాడుతూ పేద ప్రజలకు సేవలందించడం ద్వారానే వైద్య వృత్తికి సార్ధకత చేకూరుతుందన్నారు. సర్వైకల్ కేన్సర్‌ను గుర్తించేందుకు 32 నుంచి 60 ఏళ్ల వయస్సున్న ప్రతి మహిళకు స్క్రీనింగ్ చేసేందుకు పెలైట్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. బ్రెస్ట్ కేన ్సర్ స్కీనింగ్ టెస్ట్‌లు జరుపాలని డాక్టర్లకు సూచించారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు, ఆస్పత్రిలో ప్రసవాలు జరిపేందుకు మానవాతా దృక్పథంతో పనిచేయాలన్నారు. మహిళలు, పిల్లలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించటంలో ముందుండాలని ఐఎంఏకు కలెక్టర్ పిలుపునిచ్చారు. కాగా, ఐఎంఏ, అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా, గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుల సంఘం సహకారంతో, భాగస్వామ్యంతో ఈ లాప్రోస్కోపీ సర్జరీ డెమో జరిగింది. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వినోద్‌కుమార్‌గుప్తా, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కవితారెడ్డి, డాక్టర్ ఐఎల్ కృష్ణమూర్తి, శ్రీనివాస్‌చక్రవర్తి, స్వామి, అరుణ, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు
- నాలుగు రోజుల్లోనే పది డిగ్రీలకుపైగా పెరిగిన ఉష్ణోగ్రత - ఉక్కపోతతో జనం విలవిల - మూడు రోజుల్లో ప్రారంభం కానున్న పాఠశాలలపైనా ఎఫెక్ట్ ఒంగోలు: హమ్మయ్య...వాతావరణం చల్లబడిందని ఊపిరి తీసుకున్న జిల్లా ప్రజలు ఒక్కసారిగా గురువారం పెరిగిన ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తిపోయారు. కేవలం నాలుగు రోజుల్లోనే పది డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఉక్కపోతతో జనం విలవిలలాడిపోతున్నారు. ఈ నెల 1వ తేదీ 38.1 డిగ్రీలున్న ఉష్ణోగత్ర 5వ తేదీ నాటికి 40.8 డిగ్రీలకు పెరిగింది. ఈ నెల 8వ తేదీ నాటికి 31.8 డిగ్రీలు మాత్రమే నమోదుకావడంతో క్రమేపీ తగ్గుతాయని ప్రజలు భావించారు. దీనికితోడు నైరుతి రుతుపవనాల రాకతో ఉరుములు, మెరుపులతో జిల్లా వాసులను బెంబేలెత్తించింది. ఇక వర్షాలేనని ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా గురువారం మార్పు వచ్చింది. తగ్గాయనుకుంటున్న ఎండలు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే 10.1 డిగ్రీలకుపైగా పెరిగిపోవడంతో ఇదేమిటంటూ విస్తుపోతున్నారు. పాఠశాలలపైనా ఎఫెక్ట్... మరో మూడు రోజుల్లో పాఠశాలలు ప్రారంభమవుతుండడం... ఈ నేపధ్యంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయోందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి మువ్వా రామలింగం ఉత్తర్వులు జారీచేశారు. గత ఏడాది కూడా ఇదే విధంగా నిర్ణయించిన సమయానికే పాఠశాలు ప్రారంభించారు. కానీ ఎండల దెబ్బకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఒక పూట బడికే పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన అప్పటి జిల్లా కలెక్టర్ విజయ్‌కుమార్ స్వయంగా జోక్యం చేసుకొని పాఠశాలల ప్రారంభ తేదీని మార్చివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి పునరావృతమయ్యే పరిస్థితులున్నాయని, గత ఏడాది మాదిరిగా నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
చ్చ్చ్.. చలి
సాక్షి, కడప : భారతదేశంలో కశ్మీర్, రాష్ట్రంలో లంబసింగి చలితో వణుకుతుంటే...మూడు రోజులుగా చలి ప్రభావంతో జిల్లా ప్రజలు గడగడ వణుకుతున్నారు. చలిపులి విసిరుతున్న పంజాకు భయపడి ఉదయాన్నే బయటికి రావాలంటే భయపడుతున్నారు. చలికి తట్టుకోలేక కొందరు చలిమంటలు ఆశ్రయిస్తున్నారు. తెల్లారి 8 దాటినా చలి వదలడం లేదు. దీంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలో కూడా స్వెట్టర్లు ధరించి వెళుతున్నారు. మరోవైపు చలికి సంబంధించినదుస్తులకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. తగ్గిపోయిన ఉష్ణోగ్రతలు... జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. ఇటీవల గరిష్ఠంగా 29 డిగ్రీలు, కనిష్టం 16 డిగ్రీలకు పడిపోయాంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇట్టే అర్థమవుతోంది.చలి అధికం కావడంతో ఉబ్బసం, అస్తమా, టీబీ, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
అందరికీ థ్యాంక్స్
కడప కల్చరల్ : జిల్లా ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలను జీవితంలో మరిచిపోలేనని బదిలీపై వెళుతున్న కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బంగ్లాలో అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తనను సొంత బిడ్డలా ఆదరించారని, వారిని ఎప్పటికీ గుర్తించుకుంటానని పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీసుశాఖలు సంయుక్తంగా పనిచేస్తేనే ప్రజలకు ప్రభుత్వ పథకాలు, రక్షణ లభించగలవన్నారు. జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ కీలక సమయంలో కీలక పదవికి వెళుతున్న కలెక్టర్‌కు ప్రత్యేక వీడ్కోలు తెలుపుతున్నామన్నారు. విభజన నేపధ్యంలో హైదరాబాదులో ఎక్కువగా పని ఉంటుందన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సాధారణ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించడం కోన శశిధర్ ప్రతిభకు నిదర్శనమన్నారు. ఏజేసీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల మధ్య సత్సంబంధాలు పెంచుకోవాలని, ఉద్యోగులకు క్రీడలు నిర్వహించి కలెక్టర్ విజయం సాధించారన్నారు. ఒకేసారి నాలుగు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఏకైక కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, డీఆర్వో సులోచన, పరిశ్రమలశాఖ జీఎం గోపాల్, డీఆర్డీఏ,డ్వామాు, ఏపీఎంఐపీ పీడీలు అనిల్‌కుమార్‌రెడ్డి, బాలసుబ్రమణ్యం, శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రతిభా భారతి, స్టెప్ సీఈఓ మమత, నగర పాలక సంస్థ కమిషనర్ ఓబులేశు, ఉద్యాన శాఖ ఏడీ మదుసూదన్‌రెడ్డి, ఇంకా పలువురు జిల్లా అధికారులు కోన శశిధర్ అందించిన సేవలను గురించి వివరించారు. అనంతరం జిల్లా ఎస్పీ, అధికారుల సంఘం ప్రతినిదులు కోన శశిధర్‌ను ఘనంగా సత్కరించారు. -
నిండా ముంచారు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నీటి కేటాయింపుల్లో రాయలసీమ ముఖద్వారమైన కర్నూలుకు తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వకుండా రాష్ట్ర విభజన జరుగుతున్న తరుణంలో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియకు జిల్లా ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఆంధ్రరాష్ట్ర రాజధానిగా 1953 నుంచి మూడేళ్ల పాటు కర్నూలు కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో రాజధానికి కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మారింది. దీంతో రాజధానిని పోగొట్టుకున్న కర్నూలు జిల్లా అనాథ అయ్యింది. కరువు కాటకాలను బయటపడే అవకాశాన్ని కోల్పోయింది. ఏటా నీటి వాటాలో కోతే... రాజధానిని పోగొట్టుకున్న కర్నూలు రైతాంగానికి నీటి వాటాల్లో కోత పెడుతూనే ఉన్నారు. మద్రాసు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు తుంగభద్ర డ్యాంకు డిజైన్ చేశారు. రాష్ట్రం విడిపోయాక ఏర్పడిన కర్ణాటక, ఆంధ్రరాష్ట్రాల మధ్య జలవివాదాలు మొదలయ్యాయి. వివాదాల పరిష్కారం కోసం కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 1974 తుంగభద్ర బోర్డు ఏర్పాటైంది. ఈ బోర్డు ఆయకట్టును పరిగణనలోకి తీసుకుని నీటి పంపకాలను చేపట్టాలి. టీబీ డ్యాం నుంచి తుంగభద్ర దిగువ కాలువ కింద ఉన్న 1.42 లక్షల ఎకరాల సాగు కోసం 24 టీఎంసీల నీటిని ఇవ్వాలని నిర్ణయించింది. అదే విధంగా కర్నూలు-కడప (కేసీ కెనాల్) కింద ఉన్న 2.65 లక్షల ఎకరాల కోసం 10 టీఎంసీలు ఇవ్వాలి. అయితే పాలకుల నిర్ణక్ష్యం కారణంగా కేసీ కెనాల్‌కు 4 టీఎంసీలు, తుంగభద్ర దిగువ కాలుకు 9 టీఎంసీల నీరు తక్కువ సరఫరా చేస్తున్నారు. ఫలితంగా రెండు కాలువల మధ్య సుమారు 1.50 ఎకరాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. నీటి కేటాయింపులను నమ్ముకుని సాగుచేసిన రైతులకు కన్నీరు మిగులుతోంది. జలయుద్ధాలు తప్పవేమో..! రాజధాని విడిపోతుందని తెలిసి ఆనాడు జనం తిరగబడ్డారు. పాలకులపై ఒత్తిడితెచ్చారు. అయినా ప్రయోజనం లేదు. వారు అనుకున్నట్టే రాజధానిని తీసుకెళ్లి రాయలసీమను రాళ్లసీమగా మార్చారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో నీటి కేటాయింపుల్లో తీవ్ర అన్యా యం జరుగుతోందని జనం ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకున్న నాధుడు లేరు. జిల్లాకు చెందిన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఎవరూ నీటి కేటాయింపులపై ఉద్యమించలేదు. వైఎస్సార్సీపీ మాత్రం ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తుండటంతో జలయుద్ధాలు తప్పేట్లు లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
అంతా ఉత్తుత్తే!
కేంద్ర బడ్జెట్లో దుర్భిక్ష ‘అనంత’కు రిక్తహస్తం ‘ప్రాజెక్టు అనంత’ భవిత చిదంబర రహస్యమే ఈసారైనా ఆర్మీ ఫైరింగ్ రేంజ్‌కు నిధులు ఇస్తారా! బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో చోటేదీ? సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఆడిన మాట తప్పడంలో తనది అందెవేసిన చేయి అని కేంద్రంలోని యూపీఏ సర్కారు మరోసారి నిరూపించుకుంది. దుర్భిక్ష ‘అనంత’లో సేద్యాన్ని గాడిన పెట్టేందుకు ‘ప్రాజెక్టు అనంత’కు నిధులు కేటాయిస్తామని భరోసా ఇచ్చిన కేంద్రం ఇప్పుడు కాడి దించింది. బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో జిల్లాకు చోటు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు చేతులెత్తేసింది. ఏడేళ్ల నుంచి ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుపై ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లిబుచ్చుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోన్న 11 గ్రామాల రైతులకు ఈసారి కూడా భరోసా ఇవ్వలేకపోయింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సోమవారం లోక్‌సభలో ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రగతిపై చూపిన ప్రభావం ఇదీ..! తెలుగు జాతిలో విభజన చిచ్చు పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం.. దుర్భిక్ష ‘అనంత’ను మరోసారి వంచించారు. జిల్లాలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న సేద్యాన్ని లాభాల బాట పట్టించేందుకు ఉద్దేశించిన ‘ప్రాజెక్టు అనంత’ ఒట్టి ఎన్నికల నినాదమేనని చిదంబరం చెప్పకనే చెప్పారు. ‘ప్రాజెక్టు అనంత’ అమలుకు రూ.7,676 కోట్లు అవసరం. అందులో రూ.4,387 కోట్లు వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మనీటిపారుదల, పశుసంవర్ధక, పట్టు, మత్స్యశాఖలకు శాఖాపరంగా ఐదేళ్లలో మంజూరవుతాయని అధికారులు లెక్క కట్టారు. తక్కిన రూ.3,282 కోట్లను కేంద్రం కేటాయించేలా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అహ్లూవాలియాను రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి నేతృత్వంలోని జిల్లా ప్రతినిధి బృందం ఆర్నెల్ల క్రితం కలిసింది. ‘ప్రాజెక్టు అనంత’కు అవసరమైన నిధులను కేటాయిస్తామని ఇద్దరూ భరోసా ఇచ్చారు. కానీ.. సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. కరువుకు విరుగుడేదీ..? చౌక ధరలకే భూమి లభించడం.. అపారమైన ఖనిజ వనరులు.. మానవ వనరులు.. ఉపరితల రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉండటం.. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండటం వల్ల పరిశ్రమల స్థాపనకు జిల్లా అత్యంత అనుకూలమని కేంద్రం తేల్చింది. బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో జిల్లాకు చోటు కల్పిస్తామని.. తద్వారా కరువుకు పరిష్కారం చూపిస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియా పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో కుద్రేముఖ్- ఏపీఎండీసీ సంయుక్త భాగస్వామ్యంతో ఇనుప పిల్లెట్ల పరిశ్రమ చేపట్టాలన్న ప్రతిపాదన సందర్భంలో కూడా మాంటెక్‌సింగ్ గతంలో ఇచ్చిన హామీనే మరో మారు పునరుద్ఘాటించారు. కానీ.. సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో జిల్లాకు చోటు కల్పించలేదు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బీడీఎల్(భారత్ దైనిక్స్ లిమిటెడ్), హెచ్ఏఎల్(హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్), ఈసీఐఎల్(ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), బీఈఎల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్)లు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయి. కానీ.. వాటి ప్రస్తావన కూడా బడ్జెట్లో కన్పించలేదు. ఇది జిల్లా పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతంగా మారింది. ఉపాధి అవకాశాలకు కేంద్రం మోకాలడ్డినట్లయింది. న్యాయం జరిగేనా..?: కంబదూరు-కనగానపల్లి మండలాల సరిహద్దులో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుచేయాలని 2008లో కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది. కంబదూరు, కనగానపల్లి మండలాల్లోని కర్తనపర్తి, నూతిమడుగు, చెన్నేపల్లి, రాళ్ల అనంతపురం, రామోజీనాయక్ తండా, తిప్పేపల్లి, ఐపాసుపల్లి, గూళ్యం, మద్దెలచెర్వు, మద్దెలచెర్వు తండాల్లో 17,850 ఎకరాల భూమి అవసరమని తేల్చింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ.. ఇప్పటిదాకా భూసేకరణ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూముల క్రయవిక్రయాలపై నిషేధం విధించడం వల్ల ఆ గ్రామాల్లో రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. చివరకు పంట రుణాలు కూడా ఇవ్వడం లేదు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుచేస్తారా.. నోటిఫికేషన్ రద్దు చేస్తారా అంటూ ఆ గ్రామాల రైతులు ఆందోళనలు చేసినా కేంద్రానికి పట్టలేదు. నాలుగు నెలల క్రితం ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర రక్షణ శాఖ.. కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్‌ను ఆదేశించింది. ఆయన పంపిన ప్రతిపాదనలపై రక్షణశాఖ ఆమోదముద్ర వేసిందీ లేనిదీ బడ్జెట్లో స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. నిధుల్లోనూ కోత.. ఉపాధి హామీ పథకానికి గాను 2014-15 బడ్జెట్లో రూ.644 కోట్లు విడుదల చేయాలని జిల్లా అధికార యంత్రాంగం కేంద్రానికి నివేదిక పంపింది. కానీ.. ఆ మేరకు నిధులు విడుదలయ్యే అవకాశం లేదు. కనీసం రూ.350 కోట్ల మేర కూడా దక్కే అవకాశాల్లేవని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజీవ్ విద్యామిషన్ కింద జిల్లాకు రూ.442 కోట్ల మేర 2014-15 బడ్జెట్టో కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ.. ఇందులో రూ.250 కోట్లకు మించి నిధులు విడుదలయ్యే అవకాశం లేదని అధికారులు లెక్కలు వేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుకూ.. ఆధార్‌తో ముడిపెట్టవద్దని సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కేంద్రం చెవికెక్కించుకోలేదు. గ్యాస్ రాయితీతోపాటు వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు, ఉపాధి హామీ వేతనాలు, విత్తన రాయితీ వంటి 26 సంక్షేమ పథకాలకు ఆధార్ ద్వారా నగదు బదిలీని వర్తింపజేస్తామని స్పష్టీకరించింది. ఇందుకు మన జిల్లానే ప్రయోగశాలగా ఎంచుకోవడం గమనార్హం. -
జనాగ్రహం
సాక్షి, అనంతపురం: కేంద్ర క్యాబినెట్ గురువారం తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలుపడంపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల నుంచే టీ నోట్ వెలువడనుందని ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు రావడంతో జిల్లా అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ ఒక్కసారిగా సమైక్యవాదులు రోడ్డుపైకొచ్చి నిన్నటి వరకు శాంతియుతంగా సాగిన ఆందోళనలు గురువారం మిన్నంటాయి. టీ నోట్‌పై ముసాయిదా తయారైందని కేంద్రం హోమ్ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించడంతో జిల్లాలో సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు బ్యాంకులు, వాణిజ్య సముదాయాలను బంద్ చేయించారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్తోపాటు సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్, ఆంటోని దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎక్కడ చూసినా నిరసన ర్యాలీలు హోరెత్తాయి. రహదారులపై ప్రైవేటు వాహనాలను, రైళ్లను సైతం అడ్డుకున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తగా పోలీసులు జిల్లాకు అదనపు బలగాలను రప్పించారు. టీ నోట్ ముసాయిదా తయారైందని షిండే ప్రకటించడంతో అనంతపురంలో జేఏసీ నాయకులు రగిలి పోయారు. ఇదే సమయంలో ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అనంతపురంలోనే ఉన్నారన్న విషయం తెలుసుకున్న ఉద్యోగ , ఉపాధ్యాయ జేఏసీ నాయకులు టవర్‌క్లాక్ సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లి ఆయన ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహించిన జేఏసీ నాయకులు ఎంపీకి వ్యతిరేకంగా నినిదాలు చేశారు. రాజీనామా చేసి ఉద్యమంలో పాలుపంచుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఎంపీ తాను ఇదివరకే రాజీనామా చేశానని స్పష్టం చేసి.. హడావుడిగా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. పాతూరు పవరాఫీసులో విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. సబ్‌స్టేషన్ ఎదుట గంట పాటు రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్రం విడిపోతే అన్నం దొరకదని పంచాయతీరాజ్ జేఏసీ నాయకులు గంజి కేంద్రం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలని కోరుతూ మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు తెలుగుతల్లి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మునిసిపల్ కార్పొరేషన్ జేఏసీ, మహిళా సంఘాలు, వికలాంగ సమాఖ్య ఆధ్వర్యంలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. టీ నోట్‌ను నిరసిస్తూ ఉద్యోగ జేఏసీ నాయకులు 48 గంటల జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. టీ నోట్ విషయం తెలియగానే ఎస్కేయూలో జేఏసీ నాయకులు రగిలిపోయారు. 205 జాతీయరహదారిపై యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి రెండు గంటల పాటు వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. దీంతో వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్ ఎస్కేయూ వద్దకు వెళ్లి.. ఆందోళన విరమించాలని..లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో విద్యార్థులు, సీఐ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు టీ నోట్‌పై నిరసన తెలుపుతూ నగరంలోకి ర్యాలీగా వచ్చేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఊరూ..వాడా నిరసనల హోరు ధర్మవరంలో జేఏసీ ఆధ్వర్యంలో కాలేజీ సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. టీ నోట్‌ను అడ్డుకోవాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి రైలురోకో చేశారు. దీంతో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ అరగంట పాటు ధర్మవరంలో నిలిచిపోయింది. బత్తలపల్లిలో జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. గుంతకల్లులో టీ నోట్ ప్రకటనపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రిలేదీక్షా శిబిరం ఎదురుగా ఉండే సోనియా, రాహుల్, యూపీఏ నాయకుల ఫ్లెక్సీలను, కాంగ్రెస్ జెండాలను దహనం చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. గుత్తిలో జేఏసీ నాయకులు 36 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. హిందూపురంలో రాష్ట్ర విభజనపై ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలను చూడలేమని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీవీలను రోడ్డుపై పగులగొట్టారు. వేర్పాటువాదుల మాస్కులు ధరించి ర్యాలీ చేపట్టారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణ బంద్ పాటించారు. టీ నోట్‌కు నిరసనగా వైఎస్సార్సీపీ నాయకుడు నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి.. పట్టణంలో దుకాణాలు మూసివేయించారు. కదిరిలో జేఏసీ నాయకులు పట్టణ బంద్ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి.. అంబేద్కర్ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు ఫర్హానా ఫయాజ్, అరీఫ్ అలీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కళ్యాణదుర్గంలో టీనోట్‌కు నిరసనగా జేఏసీ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అలాగే రాష్ర్ట రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఇంటిని ముట్టడించారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. చివరకు మంత్రి.. కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేరని తెలుసుకున్న జేఏసీ నాయకులు అక్కడి నుంచి వెనుదిరిగారు. కుందుర్పి, శెట్టూరు, కంబదూరులో జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి బంద్ పాటించారు. మడకశిరలో సమైక్య వాదులు వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. రోడ్లపై వాహనాల టైర్లను కాల్చి ఆందోళన చేశారు. అనంతరం బంద్ నిర్వహించారు. టీ నోట్‌కు నిరసనగా పుట్టపర్తిలో నలుగురు సమైక్యవాదులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన జేఏసీ నాయకులు వారిని వారించి ఆ ప్రయత్నాన్ని విరమింపజేశారు. ఓడీచెరువులో యూపీఏ దిష్టిబొమ్మను దహనం చేశారు. అమడూరులో జేఏసీ నాయకులు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. గోరంట్లలో టీ నోట్ వార్త తెలియగానే సమైక్య వాదులు ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇంటిని ముట్టడించారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ స్పందిస్తూ రాజీనామాలతో లాభం లేదని, విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకోవడానికి తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని వారికి నచ్చజెప్పారు. ఇదొక్కసారి చాన్స్ ఇస్తే.. ఢిల్లీ వెళ్లి బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తానని, లేని పక్షంలో రాజీనామా చేసి.. మీ ముందుకు వస్తానని చెప్పడంతో జేఏసీ నాయకులు వెనుదిరిగారు. రాయదుర్గంలో టీ నోట్‌కు నిరసనగా జేఏసీ నాయకులు బంద్ పాటించారు. డీహీరేహాళ్‌లో జేఏసీ నాయకులు రాష్ట్ర రహదారిని దిగ్బంధించారు. కణేకల్లులో యాదవులు ర్యాలీ నిర్వహించారు. నార్పలలో జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. తాడిపత్రిలో టీనోట్‌కు నిరసనగా ఉపాధ్యాయ, ఉద్యోగ, ఆర్టీసీ, విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ బంద్ నిర్వహించారు. వజ్రకరూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రహదారులు దిగ్బంధించారు. -
జన ఉప్పెన
సాక్షి, కడప : రాష్ట్రం ముక్కలు కాకుండా అడ్డుకునేందుకు జిల్లా ప్రజలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. జైసమైక్యాంధ్ర అంటూ నిరసనలు తెలుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ ప్రజలు రోడ్లపైకి చేరుకుని జాతీయ రహదారులపై రాస్తారోకోలు, మానవహారాలు, వంటా వార్పులతో వాహనాల రాకపోకలను అడ్డుకుంటూ ఆందోళనలు చేపడుతున్నారు. బుధవారం 22వ రోజు సైతం సమైక్య నినాదంతో జిల్లా మార్మోగింది. వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు సంఘీభావంగా జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టారు. దీంతోపాటు వైఎస్సార్ సీపీ నేతలు చేపట్టిన ఆమరణ దీక్షలు ఉద్యమానికి మరింత ఊపు తెస్తున్నాయి. కడపలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్బాష, ఎస్.నాగిరెడ్డి చేస్తున్న ఆమరణ దీక్షలు బుధవారంతో మూడవరోజు ముగిశాయి. ఈ దీక్షలకు మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, నేతలు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రె డ్డి సంఘీభావం తెలిపారు. రకరకాల విన్యాసాలు, ఆటపాటలతో పలువురు దీక్షలకు సంఘీభావం తెలిపారు. పశు వైద్య సిబ్బంది వినూత్నంగా రోడ్లపై ఈలలు(విజిల్స్) వేస్తూ నిరసన తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు భారీర్యాలీ నిర్వహించారు. డీఆర్డీఏ, ఐకేపీ సిబ్బంది, వస్త్ర వ్యాపారులు, విద్యుత్, ఉపాధ్యాయులు, మున్సిపల్ కార్మికులు, న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు ఇర్కాన్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి రహదారిని దిగ్బంధంచేశారు. దీంతోభారీ సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. టెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ విన్యాసాలు ప్రదర్శించారు. జమ్మలమడుగులో 16 మండలాలకు చెందిన రెవెన్యూ ఉద్యోగులు, తహశీల్దార్లు, సిబ్బంది, ఆర్డీఓ రఘునాథరెడ్డి, జీఎన్ఎస్ఎస్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి నేతృత్వంలో భారీర్యాలీ చేపట్టి తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి సంఘీభావాన్ని తెలిపారు. న్యాయవాదులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని సత్యాగ్రహం చేపట్టారు. దొమ్మర నంద్యాల హైస్కూలు విద్యార్థులు భారీ సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. జాతీయ నాయకుల వేషధారణలో ప్రదర్శన చేపట్టారు. అంగన్వాడీ వర్కర్లు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు.విలేకరులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పులివెందులలో వైఎస్ విజయమ్మ దీక్షలకు సంఘీభావంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్నిమండల కేంద్రాల్లో రిలే దీక్షలు సాగుతున్నాయి. ఎన్జీఓల ఆధ్వర్యంలో పులివెందుల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. విద్యార్థులు కబడ్డీ, మహిళా ఉద్యోగులు ఆటపాటలతో నిరసన తెలిపారు. పంచాయతీ మినిస్టీరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిబ్బంది వంటా వార్పు చేపట్టారు. ప్రొద్దుటూరులో వైఎస్ విజయమ్మ దీక్షకు సంఘీభావంగా శివాలయం వద్ద వైఎస్సార్ సీపీ నేతృత్వంలో రెండవరోజు రిలే దీక్షలు సాగాయి. పాఠశాల, జూనియర్ కళాశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల సమైక్య నినాదాలతో పుట్టపర్తి సర్కిల్ మార్మోగింది. వర్షంలోనే తడుస్తూ వేలాది మంది విద్యార్థులు జాతీయజెండాలు చేతబూని సమైక్య నినాదాలు చేపట్టారు. కమలాపురం పట్టణంలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్షకు మద్దతుగా రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. వీరికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వైద్యులు సంఘీభావం తెలిపారు. సి.గోపులాపురం వద్ద గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డగించి వంటా వార్పు చేపట్టారు. రాయచోటిలో న్యాయవాదులు, మాధవరం గ్రామస్తులు రిలే దీక్షలు చేపట్టారు. న్యాయవాదులు నోటికి నల్లరిబ్బన్లు ధరించిమౌన ప్రదర్శన చేసి నేతాజీ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. కాంగ్రెస్ నేత రాంప్రసాద్‌రెడ్డి సమైక్యాంధ్ర సీడీలను ఆవిష్కరించారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎనిమిదవరోజు చేరుకుంది. ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా దీక్షను భగ్నం చేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మనందరెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. దీక్ష భగ్నంకు నిరసనగా గురువారం రైల్వేకోడూరు బంద్‌కు పిలుపునిచ్చారు. వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా బద్వేలులో వైఎస్సార్సీపీ నేతలు రిలే దీక్షలు ప్రారంభించారు. న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో వినూత్నంగా ఎద్దుల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్లలో విలేకరులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు వంటా వార్పు చేపట్టారు. రాజంపేటలో వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నాయకులు రిలే దీక్షలు ప్రారంభించారు. ఆస్పత్రిలోనే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డికి జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. రిలే దీక్షలు చేస్తున్నవారికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, సురేష్‌బాబు సంఘీభావం తెలిపారు. పట్టణంలో దళితులు భారీ ర్యాలీ నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను తగులబెట్టారు. మైదుకూరులో ఎన్జీఓల ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సమైక్యవాదులు నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి వాహనాలను అడ్డుకున్నారు.