- నాలుగు రోజుల్లోనే పది డిగ్రీలకుపైగా పెరిగిన ఉష్ణోగ్రత
- ఉక్కపోతతో జనం విలవిల
- మూడు రోజుల్లో ప్రారంభం కానున్న పాఠశాలలపైనా ఎఫెక్ట్
ఒంగోలు: హమ్మయ్య...వాతావరణం చల్లబడిందని ఊపిరి తీసుకున్న జిల్లా ప్రజలు ఒక్కసారిగా గురువారం పెరిగిన ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తిపోయారు. కేవలం నాలుగు రోజుల్లోనే పది డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఉక్కపోతతో జనం విలవిలలాడిపోతున్నారు.
ఈ నెల 1వ తేదీ 38.1 డిగ్రీలున్న ఉష్ణోగత్ర 5వ తేదీ నాటికి 40.8 డిగ్రీలకు పెరిగింది. ఈ నెల 8వ తేదీ నాటికి 31.8 డిగ్రీలు మాత్రమే నమోదుకావడంతో క్రమేపీ తగ్గుతాయని ప్రజలు భావించారు. దీనికితోడు నైరుతి రుతుపవనాల రాకతో ఉరుములు, మెరుపులతో జిల్లా వాసులను బెంబేలెత్తించింది. ఇక వర్షాలేనని ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా గురువారం మార్పు వచ్చింది. తగ్గాయనుకుంటున్న ఎండలు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే 10.1 డిగ్రీలకుపైగా పెరిగిపోవడంతో ఇదేమిటంటూ విస్తుపోతున్నారు.
పాఠశాలలపైనా ఎఫెక్ట్...
మరో మూడు రోజుల్లో పాఠశాలలు ప్రారంభమవుతుండడం... ఈ నేపధ్యంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయోందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి మువ్వా రామలింగం ఉత్తర్వులు జారీచేశారు. గత ఏడాది కూడా ఇదే విధంగా నిర్ణయించిన సమయానికే పాఠశాలు ప్రారంభించారు.
కానీ ఎండల దెబ్బకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఒక పూట బడికే పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన అప్పటి జిల్లా కలెక్టర్ విజయ్‌కుమార్ స్వయంగా జోక్యం చేసుకొని పాఠశాలల ప్రారంభ తేదీని మార్చివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి పునరావృతమయ్యే పరిస్థితులున్నాయని, గత ఏడాది మాదిరిగా నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు
Published Fri, Jun 12 2015 4:40 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM
Advertisement