Increased temperatures
-
AP: భగభగలు..
సాక్షి, అమరావతి/రెంటచింతల: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. వారం రోజులుగా అన్ని ప్రాంతాల్లో సగటున 3 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా ఉ.8 నుంచి 10 గంటల మధ్య 26–28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాల్సి వుండగా ప్రస్తుతం 30 నుంచి 32 డిగ్రీలు నమోదవుతోంది. 10 నుంచి 12 గంటల మధ్య 36–38 డిగ్రీలు ఉండాల్సి వుండగా 40 డిగ్రీలు నమోదవుతోంది. ఇక మ.12–3 గంటల మధ్య 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 26–29 నుంచి 30–32 డిగ్రీలకు పెరిగాయి. మే నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఇక మే 8వ తేదీ వరకు ఈ పరిస్థితి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. ఆ తర్వాత నెలాఖరు వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ను అతలాకుతలం చేస్తున్న వేడిగాలులు అక్కడి నుంచి తెలంగాణ మీదుగా ఒడిశా వైపు వీస్తున్నాయి. ఈ గాలులు ఉత్తరాంధ్ర మీదుగా వెళ్తుండడంతో పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోను వాటి ప్రభావం ఉంటోంది. నిప్పుల కొలిమిలా రెంటచింతల గుంటూరు జిల్లాలోని రెంటచింతల నిప్పుల కొలిమిని తలపిస్తోంది. బుధ, గురు, శుక్రవారాలలో వరుసగా మూడ్రోజులుగా 44.6, 44.2 45.4 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. శనివారం గరిష్టంగా 47.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29.5 డిగ్రీలుగా నమోదు కావడంతో ఒక్కసారిగా రెంటచింతల అగ్నిగుండంగా మారింది. పనులకు వెళ్లిన కూలీలు ఎండకు తట్టుకోలేక ఉ.11 గంటలకే ఇంటి ముఖం పట్టారు. వడగాడ్పులతో వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అలాగే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా పడమలలో అత్యధికంగా 44.9 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కలిగిరిలో 44.6, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 44.1, శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 44, ప్రకాశం జిల్లా యద్ధనపూడి, కర్నూలు జిల్లా మహానంది, పెరుసోమల, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల, గొల్లవిడిపిలో 43.9, అనంతపురం జిల్లా తరిమెలలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► సాధ్యమైనంత వరకు ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకూడదు. ► తలపై టోపీ లేకపోతే కర్చీఫ్ కట్టుకోవాలి. పలుచటి కాటన్ వస్త్రాలు ధరించడం మేలు. ► ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ కలిపిన నీటిని తాగాలి. ► వడ దెబ్బకు గురైన వారిని వెంటనే చల్లటి ప్రాంతానికి చేర్చాలి. తడిగుడ్డతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ► మంచినీరు ఎక్కువగా తాగాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు ఒక గ్లాసు మంచి నీరు తాగాలి. ► ఎండలో నుంచి వచ్చిన వెంటనే చల్లని నిమ్మరసం, కొబ్బరినీరు తాగాలి. ► ఎండలో ఉన్నప్పుడు తల తిరుగుతుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. 5న అండమాన్ సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం దక్షిణ అండమాన్ సముద్రంలో మే 5న అల్పపీడనం ఏర్పడనుంది. తొలుత 4న ఆ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన తర్వాత 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుంది. అనంతరం బలమైన అల్పపీడనంగాను, ఆపై వాయుగుండంగాను బలపడుతుంది. ఇది ఉత్తర, ఈశాన్య దిశగా కదులుతూ మయన్మార్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంపై అంతగా ప్రభావం ఉండే అవకాశంలేదు. అందుకు భిన్నంగా పశ్చిమ/వాయవ్య దిశగా పయనిస్తే మాత్రం రాష్ట్రంలో వర్షాలకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు.. ఈ వాయుగుండం తీరాన్ని దాటాక రాష్ట్రంలో ఉష్ణ తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్. మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. -
AP: మరో మూడు రోజులు జాగ్రత్త.. వాతావరణ శాఖ అలర్ట్..
సాక్షి, అమరావతి/ విశాఖపట్నం: రోహిణి కార్తె రాలేదు.. మార్చి నెలలోనే ఉన్నాం.. ఎండలు మాత్రం రోళ్లు పగిలేలా మండుతున్నాయి. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఎండ మండిస్తుంటే .. మే నెలలో అగ్గి రాజుకున్నట్లు ఉంటుందని ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెంటచింతల, నంద్యాలలో 42 డిగ్రీలు, విజయవాడలో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలుల తీవ్రత కూడా పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: RRR Movie: మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన విశాఖ జిల్లాలో వడ గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఇదే విధంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పొడిగాలులు వీస్తుండటంతో 40 డిగ్రీలు నమోదైనా.. 44 డిగ్రీలకు పైగా వేడి ఉంటుందని చెబుతున్నారు. దీనికి తోడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఈ నెల 19న తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి 20న వాయుగుండంగా, 21న తుపానుగా మారి 23న బంగ్లాదేశ్, మయన్మార్ పరిసరాల్లో తీరం దాటొచ్చని తెలిపారు. దీని ప్రభావం రాష్ట్రంపై ఉండదని, అయితే గాలిలోని తేమనంతటినీ ఈ తుపాను లాగెయ్యడంతో పొడి వాతావరణం మరింత ఎక్కువై, ఎండ తీవ్రత భారీగా ఉండే ప్రమాదముందని హెచ్చరించారు. -
మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు
- నాలుగు రోజుల్లోనే పది డిగ్రీలకుపైగా పెరిగిన ఉష్ణోగ్రత - ఉక్కపోతతో జనం విలవిల - మూడు రోజుల్లో ప్రారంభం కానున్న పాఠశాలలపైనా ఎఫెక్ట్ ఒంగోలు: హమ్మయ్య...వాతావరణం చల్లబడిందని ఊపిరి తీసుకున్న జిల్లా ప్రజలు ఒక్కసారిగా గురువారం పెరిగిన ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తిపోయారు. కేవలం నాలుగు రోజుల్లోనే పది డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఉక్కపోతతో జనం విలవిలలాడిపోతున్నారు. ఈ నెల 1వ తేదీ 38.1 డిగ్రీలున్న ఉష్ణోగత్ర 5వ తేదీ నాటికి 40.8 డిగ్రీలకు పెరిగింది. ఈ నెల 8వ తేదీ నాటికి 31.8 డిగ్రీలు మాత్రమే నమోదుకావడంతో క్రమేపీ తగ్గుతాయని ప్రజలు భావించారు. దీనికితోడు నైరుతి రుతుపవనాల రాకతో ఉరుములు, మెరుపులతో జిల్లా వాసులను బెంబేలెత్తించింది. ఇక వర్షాలేనని ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా గురువారం మార్పు వచ్చింది. తగ్గాయనుకుంటున్న ఎండలు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే 10.1 డిగ్రీలకుపైగా పెరిగిపోవడంతో ఇదేమిటంటూ విస్తుపోతున్నారు. పాఠశాలలపైనా ఎఫెక్ట్... మరో మూడు రోజుల్లో పాఠశాలలు ప్రారంభమవుతుండడం... ఈ నేపధ్యంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయోందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి మువ్వా రామలింగం ఉత్తర్వులు జారీచేశారు. గత ఏడాది కూడా ఇదే విధంగా నిర్ణయించిన సమయానికే పాఠశాలు ప్రారంభించారు. కానీ ఎండల దెబ్బకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఒక పూట బడికే పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన అప్పటి జిల్లా కలెక్టర్ విజయ్‌కుమార్ స్వయంగా జోక్యం చేసుకొని పాఠశాలల ప్రారంభ తేదీని మార్చివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి పునరావృతమయ్యే పరిస్థితులున్నాయని, గత ఏడాది మాదిరిగా నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
సూర్య @43
►ఒక్కసారిగా భగ్గుమన్న భానుడు ►ఉదయం ఏడు గంటల నుంచే ప్రతాపం ఆరంభం ►9 గంటలకు సైతం బయటకు రాలేక ఇబ్బంది ►12 గంటలకే నిర్మానుష్యంగా మారిన రోడ్లు ►మరో రెండు రోజులు ఇవే ఉష్ణోగ్రతలు అరండల్‌పేట(గుంటూరు) : ఈ వేసవిలో తొలిసారిగా భానుడు భగభగమన్నాడు. తన ప్రతాపాన్ని చూపాడు. ఇప్పటి వరకు 40 డిగ్రీల సెల్సియస్‌కే పరిమితమైన ఉష్ణోగ్రత ఒక్కసారిగా మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీలకు చేరింది. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపప్రారంభించాడు. 9 గంటల సమయంలో కూడా ప్రజలు బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యాలయాలకు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు ఎండవేడికి తట్టుకోలేకపోయారు. రోహిణి కార్తెకు ముందే ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక చిన్నారులు, వృద్ధుల పరిస్థితి చెప్పనక్కర్లలేదు. తీవ్ర ఉక్కపోత, ఎండవేడికి అల్లాడిపోయారు. ఇంట్లోనే ఫ్యాన్లు, ఏసీల కింద సేదతీరారు. ఏదైనా పని నిమిత్తం బయటకు వచ్చిన వారు సైతం చెట్లకింద, నీడ ఉన్న చోట ఆగి సేదతీరారు. భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక శీతల పానీయాల దుకాణాలను ఆశ్రయించారు. రెండు రోజుల క్రితం వర్షం పడటంతో ఎండలు ఎక్కువగా ఉంటాయని అందరూ భావించినా ఇంతగా ముదురుతాయని ఊహించలేదు. చిరువ్యాపారులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 12 గంటలకే రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, బాపట్ల, తెనాలి తదితర పట్టణాల్లో సైతం ఇదే పరిస్థితి కొనసాగింది. ఎండలతో ప్రజలు అల్లాడి పోయారు. సాయంత్రం 6 గంటల వరకు ఎవరూ బయటకు రాలేదు. వడగాడ్పులు వీయడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడ్డారు. అత్యవసర పనులను సైతం వాయిదా వేసుకున్నారు. మరో రెండురోజులపాటు కొనసాగనున్న ఉష్ణోగ్రతలు .. మరో రెండు రోజులపాటు ఇవే రకమైన ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బుధ, గురువారాల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
భానుడు భగభగ
కర్నూలు (జిల్లాపరిషత్) : జిల్లాలో వారం రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. సుమారు నెల రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో.. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం నుంచి రోజురోజుకూ వాతావరణం వేడెక్కుతోంది. మంగళవారం 38.8 భానుడు భగభగ డిగ్రీలు నమోదైంది. జిల్లాలో అక్కడక్కడా చిరు జల్లులు కురుస్తున్నా.. ఉక్కపోత మరింత పెరుగుతోంది. గత యేడాదితో పోలిస్తే ఈ నెలలో జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం పెరగడం, గాలిలో తేమ తగ్గిపోవడంతో ఉక్కపోత అధికమైంది. పగలు, రాత్రి వేళల్లోనూ జనం ఉక్కపోత, వేడితో అల్లాడిపోతున్నారు. వర్షాకాలంలో ఈ పరిస్థితేమిటని జనం ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎండాకాలమే కొనసాగుతోందని, ఇది రెండో వేసవికాలమని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసాధారణ వాతావరణ పరిస్థితులతో ప్రజల అనారోగ్యానికి గురవుతున్నారు. రెండు, మూడు రోజులుగా అధిక శాతం ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. అవసరమైతే తప్ప ఎండలో తిరగవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక శాతం నీరు, మజ్జిగ తాగాలని, గొడుగు, టోపీలు వాడాలని చెబుతున్నారు.