సూర్య @43
►ఒక్కసారిగా భగ్గుమన్న భానుడు
►ఉదయం ఏడు గంటల నుంచే ప్రతాపం ఆరంభం
►9 గంటలకు సైతం బయటకు రాలేక ఇబ్బంది
►12 గంటలకే నిర్మానుష్యంగా మారిన రోడ్లు
►మరో రెండు రోజులు ఇవే ఉష్ణోగ్రతలు
అరండల్‌పేట(గుంటూరు) : ఈ వేసవిలో తొలిసారిగా భానుడు భగభగమన్నాడు. తన ప్రతాపాన్ని చూపాడు. ఇప్పటి వరకు 40 డిగ్రీల సెల్సియస్‌కే పరిమితమైన ఉష్ణోగ్రత ఒక్కసారిగా మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీలకు చేరింది. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపప్రారంభించాడు. 9 గంటల సమయంలో కూడా ప్రజలు బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యాలయాలకు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు ఎండవేడికి తట్టుకోలేకపోయారు. రోహిణి కార్తెకు ముందే ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.
ఇక చిన్నారులు, వృద్ధుల పరిస్థితి చెప్పనక్కర్లలేదు. తీవ్ర ఉక్కపోత, ఎండవేడికి అల్లాడిపోయారు. ఇంట్లోనే ఫ్యాన్లు, ఏసీల కింద సేదతీరారు. ఏదైనా పని నిమిత్తం బయటకు వచ్చిన వారు సైతం చెట్లకింద, నీడ ఉన్న చోట ఆగి సేదతీరారు. భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక శీతల పానీయాల దుకాణాలను ఆశ్రయించారు. రెండు రోజుల క్రితం వర్షం పడటంతో ఎండలు ఎక్కువగా ఉంటాయని అందరూ భావించినా ఇంతగా ముదురుతాయని ఊహించలేదు.
చిరువ్యాపారులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 12 గంటలకే రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, బాపట్ల, తెనాలి తదితర పట్టణాల్లో సైతం ఇదే పరిస్థితి కొనసాగింది. ఎండలతో ప్రజలు అల్లాడి పోయారు. సాయంత్రం 6 గంటల వరకు ఎవరూ బయటకు రాలేదు. వడగాడ్పులు వీయడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడ్డారు. అత్యవసర పనులను సైతం వాయిదా వేసుకున్నారు.
మరో రెండురోజులపాటు కొనసాగనున్న ఉష్ణోగ్రతలు ..
మరో రెండు రోజులపాటు ఇవే రకమైన ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బుధ, గురువారాల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.