
సాక్షి, అమరావతి/ విశాఖపట్నం: రోహిణి కార్తె రాలేదు.. మార్చి నెలలోనే ఉన్నాం.. ఎండలు మాత్రం రోళ్లు పగిలేలా మండుతున్నాయి. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఎండ మండిస్తుంటే .. మే నెలలో అగ్గి రాజుకున్నట్లు ఉంటుందని ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెంటచింతల, నంద్యాలలో 42 డిగ్రీలు, విజయవాడలో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలుల తీవ్రత కూడా పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
చదవండి: RRR Movie: మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన
విశాఖ జిల్లాలో వడ గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఇదే విధంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పొడిగాలులు వీస్తుండటంతో 40 డిగ్రీలు నమోదైనా.. 44 డిగ్రీలకు పైగా వేడి ఉంటుందని చెబుతున్నారు. దీనికి తోడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఈ నెల 19న తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి 20న వాయుగుండంగా, 21న తుపానుగా మారి 23న బంగ్లాదేశ్, మయన్మార్ పరిసరాల్లో తీరం దాటొచ్చని తెలిపారు. దీని ప్రభావం రాష్ట్రంపై ఉండదని, అయితే గాలిలోని తేమనంతటినీ ఈ తుపాను లాగెయ్యడంతో పొడి వాతావరణం మరింత ఎక్కువై, ఎండ తీవ్రత భారీగా ఉండే ప్రమాదముందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment