Daytime temperatures
-
AP: మరో మూడు రోజులు జాగ్రత్త.. వాతావరణ శాఖ అలర్ట్..
సాక్షి, అమరావతి/ విశాఖపట్నం: రోహిణి కార్తె రాలేదు.. మార్చి నెలలోనే ఉన్నాం.. ఎండలు మాత్రం రోళ్లు పగిలేలా మండుతున్నాయి. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఎండ మండిస్తుంటే .. మే నెలలో అగ్గి రాజుకున్నట్లు ఉంటుందని ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెంటచింతల, నంద్యాలలో 42 డిగ్రీలు, విజయవాడలో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలుల తీవ్రత కూడా పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: RRR Movie: మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన విశాఖ జిల్లాలో వడ గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఇదే విధంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పొడిగాలులు వీస్తుండటంతో 40 డిగ్రీలు నమోదైనా.. 44 డిగ్రీలకు పైగా వేడి ఉంటుందని చెబుతున్నారు. దీనికి తోడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఈ నెల 19న తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి 20న వాయుగుండంగా, 21న తుపానుగా మారి 23న బంగ్లాదేశ్, మయన్మార్ పరిసరాల్లో తీరం దాటొచ్చని తెలిపారు. దీని ప్రభావం రాష్ట్రంపై ఉండదని, అయితే గాలిలోని తేమనంతటినీ ఈ తుపాను లాగెయ్యడంతో పొడి వాతావరణం మరింత ఎక్కువై, ఎండ తీవ్రత భారీగా ఉండే ప్రమాదముందని హెచ్చరించారు. -
పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ వేడి ఎక్కువగానే ఉంటోంది. మంగళవారం పలు ప్రాంతాల్లో 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా ఏర్పేడులో 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. -
వర్షాకాలమా? ఎండాకాలమా?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పై వరుసగా మూడో రోజూ భానుడు ప్రతాపం చూపించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆగస్టులో గతంలో ఎన్నడూ లేనంతగా పలుచోట్ల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖలో 1989 ఆగస్టు తర్వాత రికార్డు స్థాయిలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తునిలో సాధారణం కంటే 6.5 డిగ్రీలు అత్యధికంగా 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖలో 39.0, బాపట్లలో 38.2, నెల్లూరులో 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వారం చివరి వరకు ఇవే పరిస్థితులుంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఏపీ తీరంలో బుధవారం స్వల్ప ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనివల్ల అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసి.. ఎండల నుంచి కొంత ఉపశమనాన్ని అందించాయి. మరోవైపు మచిలీపట్నం సమీపంలో ఈనెల 8న అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీనపడనుంది. ఆ తర్వాత 12న మరో అల్పపీడనం ఏర్పడి రాష్ట్రం మీదుగా కదులుతూ ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణించనుంది. వీటి వల్ల వర్షాలు విస్తరించే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. -
తగ్గుతున్న ఉష్ణతాపం
సాక్షి,విశాఖపట్నం: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత ఒకట్రెండు రోజులున్నా.. ఎండలు మాత్రం అంతగా ఉండవని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ నుంచి తమిళనాడు వరకూ సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉండటమే దీనికి కారణమంటున్నారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మాత్రం గురు, శుక్రవారాల్లో ఒకట్రెండు చోట్ల 40 నుంచి 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కేరళ తీరాన్ని ఎప్పుడు తాకుతాయన్నదానిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు. -
బయట నుంచి రాగానే తేనె తినకండి
సాక్షి, హైదరాబాద్: మార్చి నెల రాకముందే ఎండ తీవ్రత పెరుగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి నమోదవుతుండటంతో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం కొన్ని సూచనలతో కూడిన ప్రకటనను జారీ చేసింది. తల తిరగడం, తీవ్ర జ్వరం, మత్తు నిద్ర, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి వంటి వడదెబ్బ లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలని పేర్కొంది. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరగడం, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించాలని సూచించింది. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు.. - తెలుపు రంగు పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలి. - తలకు టోపి పెట్టుకోవాలి లేదా రుమాలు కట్టుకోవాలి. - ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు కలిపిన నీటిని, ఓరల్ రీ హైడ్రేషన్ కలిపిన నీటిని తాగాలి. - వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడ ఉన్న ప్రాంతానికి చేర్చాలి. - వడదెబ్బకు గురైన వారిని తడిగుడ్డతో శరీరం అంతా రుద్దుతూ ఉండాలి. ఐస్ నీటిలో బట్టను ముంచి శరీరం అంతా తుడవాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే లోపునకు వచ్చే వరకు బట్టతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ఫ్యాను కింద ఉంచాలి. - వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానట్లయితే వారిని దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించాలి. - మంచినీరు ఎక్కువగా తాగాలి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే నిమ్మరసం గానీ కొబ్బరినీరు లేదా చల్లని నీరు తాగాలి. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి.. - నలుపురంగు, మందపాటి దుస్తులు ధరించరాదు. - మధ్యాహ్నం (ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు) ఆరుబయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనిచేయవద్దు. - ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె తీసుకోకూడదు. - శీతల పానీయాలు, మంచుముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యం ఏర్పడుతుంది. రాష్ట్రంలో దంచికొట్టిన ఎండలు భద్రాచలం, మహబూబ్నగర్ల్లో 38 డిగ్రీలు నమోదు రాష్ట్రంలో ఎండలు దంచికొట్టాయి. శనివారం భద్రాచలం, మహబూబ్నగర్ల్లో ఏకంగా 38 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. ఇక ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండంల్లో 37 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడే ఈ స్థాయిలో ఎండలున్నాయంటే మున్ముందు పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆదివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. -
ఇదేం చలి బాబోయ్.. !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై చలి పంజా విసురుతోంది. మూడ్నాలుగు రోజులుగా చలితో జనం గజగజలాడుతున్నారు. జలుబు, దగ్గులతో బాధపడుతున్నారు. కొన్నిచోట్ల స్వైన్ఫ్లూ బారిన పడుతున్నారు. ప్రస్తుతం హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనద్రోణి బలహీనపడింది. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో వచ్చే రెండ్రో జులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. దీంతో గురువారం ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగా రెడ్డి జిల్లాల్లో చలిగాలుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా గత 24 గంటల్లో చలి రాష్ట్రాన్ని కమ్మేసింది. ఆదిలాబాద్లో రాత్రి ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడి పోయింది. హన్మకొండలో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 9 డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఇక్కడ సాధారణ రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రత 18 డిగ్రీలు నమోదు కావాలి. హైదరాబాద్, రామగుండంలో 7 డిగ్రీలు తక్కువగా 9 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నిజామాబాద్లో రాత్రి ఉష్ణోగ్రత 6 డిగ్రీలు తక్కువగా 10 డిగ్రీలు నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా పలుచోట్ల సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. నిజామాబాద్లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువగా 25 డిగ్రీలు రికార్డయింది. రాజధానిలోనూ చలిగాలులు ఉత్తర, ఈశాన్య గాలుల తీవ్రత నగరాన్ని గజ గజ వణికిస్తోంది. దీంతో ఏడేళ్ల అనంతరం జనవరిలో అతి తక్కువగా 9.3 డిగ్రీల ఉష్ణో గ్రత నమోదైంది. ఇది సాధారణ ఉష్ణోగ్రతల కంటే 7 డిగ్రీలు తక్కువ. సహజంగా జనవరి 15 తర్వాత పగటితో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగాల్సి ఉన్నా.. ఇటీవలి తుపాను అనంతరం శీతల గాలుల తీవ్రత కొనసాగు తోంది. దీంతో పగటి పూటా తక్కువ ఉష్ణో గ్రతలే నమోదవుతున్నాయి. బుధవారం 26.7 డిగ్రీలు నమోదైంది. మరో వారంపాటు చలి గాలుల తీవ్రత కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నగరంలో ఒక్కసారిగా అత్యల్ప ఉష్ణోగ్రతల మూలంగా జలుబు, జ్వరంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. గుండె, శ్వాస సంబంధ వ్యాధులున్న వారు తప్పనిసరైతే తప్ప చలిగాలిలో బయటికి రావద్దని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. స్వైన్ ఫ్లూ తీవ్రత కూడా ఉండటంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో నాలుగు రోజుల పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలే నమోదు కానున్నాయి. -
రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటిరెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్లో రాత్రి ఉష్ణోగ్రత లు 9 డిగ్రీలు, మెదక్లో 12 డిగ్రీలు రికార్డయ్యాయి. భద్రాచలం, ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. నల్లగొండలో 2 డిగ్రీలు తక్కువగా 16 డిగ్రీలు, నిజామాబాద్, రామగుండంలలో ఒక డిగ్రీ ఎక్కువగా 15 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఖమ్మంలో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 3 డిగ్రీ లు ఎక్కువగా 32 డిగ్రీలు, మెదక్లో 31 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఆదిలాబాద్@41 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రా చలం, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండల్లో 40 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హన్మకొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, రామగుండంలో 39 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. హైదరాబాద్లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా, ఖమ్మంలో 4 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. వచ్చే 4 రోజులు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
బంగాళాఖాతంలో వాయుగుండం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరగ్గా.. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. గత 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీల మేర పెరిగాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్నగర్లో గరిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీలు అధికంగా 35 డిగ్రీలు, ఖమ్మంలో పగటి ఉష్ణోగ్రత 3 డిగ్రీలు అధికంగా 32 డిగ్రీలు నమోదైంది. హకీంపేట, హన్మకొండ, హైదరాబాద్, మెదక్లలో పగలు 2 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం కాస్త తగ్గాయి. ఆదిలాబాద్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలు నమోదైంది. నల్లగొండలో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలు పెరిగి 23, భద్రాచలంలో 2 డిగ్రీలు పెరిగి 19 డిగ్రీలు నమోదైంది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇది మంగళవారం రాత్రికి విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1260 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం నాటికి వాయవ్య దిశగా పయనిస్తూ తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. తర్వాత 24 గంటల్లో తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తుపానుగా బలపడ్డాక దాని దిశ మార్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ వైపు తుపాను పయనించవచ్చని చెబుతున్నారు. -
ఎండకు విలవిల
♦ నిప్పుల కొలిమిని తలపిస్తున్న జిల్లా ♦ మధ్యాహ్నం బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం ♦ ఇప్పటికే 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ♦ వడదెబ్బతో అస్వస్థతకు గురవుతున్న ప్రజలు తాండూరు: భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. తీవ్రరూపం దాల్చిన ఎండలకు తోడు వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇళ్ల నుంచి భయటకు రావడానికి భయపడుతున్నారు. వాతావరణం పొడిగా మారి, తేమశాతం గణనీయంగా తగ్గడంతో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. గడిచిన శుక్రవారం (ఈనెల 18న) అత్యధికంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం తీవ్ర రూపం దాల్చిన ఎండలకు ఉదాహరణ. సాధారణంగా 30-35 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదైతే ఎండలతో వాతావరణం వెడెక్కుతుంది. ఇక 38 డిగ్రీలు నమోదైతే భరించలేని విధంగా వాతావరణం వేడిగా మారుతుంది. కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలకు చేరడంతో జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో ఈసారి ఫిబ్రవరి నెల నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలుగా నమోదుతున్నాయి. మార్చి వచ్చే సరి కి మరింత అధికమయ్యాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6గంటల వరకు ఎండల తీవ్రత కనిపిస్తున్నది. దాంతో జనాలు రోడ్ల మీదకు రావడం తగ్గింది. చాలా మంది ఎండల ప్రభావంతో అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. నాపరాతి గనులు, పాలిషింగ్ యూనిట్లలో పని చేయడానికి కార్మికులు ఆసక్తి చూపకపోవడం లేదు. దాంతో గనుల్లో పనులు స్తంభించిపోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఆస్పత్రి వైద్యులు సూచిస్తున్నారు.