పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
బంగాళాఖాతంలో వాయుగుండం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరగ్గా.. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. గత 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీల మేర పెరిగాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌నగర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీలు అధికంగా 35 డిగ్రీలు, ఖమ్మంలో పగటి ఉష్ణోగ్రత 3 డిగ్రీలు అధికంగా 32 డిగ్రీలు నమోదైంది. హకీంపేట, హన్మకొండ, హైదరాబాద్, మెదక్‌లలో పగలు 2 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం కాస్త తగ్గాయి. ఆదిలాబాద్‌లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలు నమోదైంది.
నల్లగొండలో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలు పెరిగి 23, భద్రాచలంలో 2 డిగ్రీలు పెరిగి 19 డిగ్రీలు నమోదైంది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇది మంగళవారం రాత్రికి విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1260 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం నాటికి వాయవ్య దిశగా పయనిస్తూ తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. తర్వాత 24 గంటల్లో తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తుపానుగా బలపడ్డాక దాని దిశ మార్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ వైపు తుపాను పయనించవచ్చని చెబుతున్నారు.