
సాక్షి, విశాఖపట్నం: సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడం.. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఈసారి వేసవికాలం ముందుగానే వచ్చేస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మండేకాలం ముందుందని హెచ్చరిస్తున్నారు.
నేటి నుంచే పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంపై నైరుతి, ఆగ్నేయ దిశగా పొడిగాలులు వీస్తున్నాయి. దీనితోడు... సూర్యుడు నేటి నుంచి ఉత్తరార్థగోళం వైపు వస్తున్నాడనీ, ఈ రెండింటి ప్రభావంతో ముందస్తు వేసవి వచ్చేసినట్లేనని అంచనా వేస్తున్నారు.
విజయనగరం, అనకాపల్లి, విశాఖ శివారు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. అన్ని చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీలు గరిష్టంగా నమోదవుతాయన్నారు.