ఎండకు విలవిల
♦ నిప్పుల కొలిమిని తలపిస్తున్న జిల్లా
♦ మధ్యాహ్నం బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం
♦ ఇప్పటికే 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
♦ వడదెబ్బతో అస్వస్థతకు గురవుతున్న ప్రజలు
తాండూరు: భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. తీవ్రరూపం దాల్చిన ఎండలకు తోడు వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇళ్ల నుంచి భయటకు రావడానికి భయపడుతున్నారు. వాతావరణం పొడిగా మారి, తేమశాతం గణనీయంగా తగ్గడంతో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. గడిచిన శుక్రవారం (ఈనెల 18న) అత్యధికంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం తీవ్ర రూపం దాల్చిన ఎండలకు ఉదాహరణ. సాధారణంగా 30-35 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదైతే ఎండలతో వాతావరణం వెడెక్కుతుంది.
ఇక 38 డిగ్రీలు నమోదైతే భరించలేని విధంగా వాతావరణం వేడిగా మారుతుంది. కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలకు చేరడంతో జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో ఈసారి ఫిబ్రవరి నెల నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలుగా నమోదుతున్నాయి. మార్చి వచ్చే సరి కి మరింత అధికమయ్యాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6గంటల వరకు ఎండల తీవ్రత కనిపిస్తున్నది. దాంతో జనాలు రోడ్ల మీదకు రావడం తగ్గింది. చాలా మంది ఎండల ప్రభావంతో అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. నాపరాతి గనులు, పాలిషింగ్ యూనిట్లలో పని చేయడానికి కార్మికులు ఆసక్తి చూపకపోవడం లేదు. దాంతో గనుల్లో పనులు స్తంభించిపోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఆస్పత్రి వైద్యులు సూచిస్తున్నారు.