జిల్లాల్లోనూ ‘నోట్ల’ పాట్లే..!
సాక్షి నెట్‌వర్క్: పెద్ద నోట్ల రద్దుతో గ్రేటర్‌లోనే కాదు రాష్ట్రమంతటా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, ఖమ్మం ఇలా అన్ని జిల్లాల్లోనూ సామాన్యులు పెద్దనోట్లతో పాట్లు పడ్డారు. చేతిలో వంద నోట్లు లేక నానా ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
పాల ప్యాకెట్ మొదలుకుని బంగారం వరకూ ఏది కొనాలన్నా చిల్లర కావాల్సి రావడంతో వాటి కోసం పరుగులు తీశారు. బుధవారం ఉదయం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన ప్రజలు చాలా అవస్థలు పడాల్సి వచ్చింది. ఎక్కడ ఎవరిని చూసినా 500, 1,000 నోట్లకు చిల్లర కావాలని అడగడమే కనిపించింది. బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసులు మూతపడటంతో వారికి ప్రత్యామ్నాయం కనిపించలేదు.
వ్యాపారులు, ప్రైవేటు వాణిజ్య సంస్థలే కాదు ప్రభుత్వం రంగ సంస్థలు సైతం చాలా చోట్ల రూ. 500, 1000 నోట్లను తీసుకోలేదు. చాలా జిల్లాల్లో కరెంటు బిల్లులు చెల్లించేందుకు వెళ్లిన వినియోగదారుల నుంచి పెద్ద నోట్లను సిబ్బంది తీసుకోలేదు. దీంతో చేసేది లేక వారు వెనుదిరిగారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు యాదాద్రి, భద్రాద్రికి వచ్చిన భక్తులకు చిల్లర తిప్పలు తప్పలేదు. దీంతో చాలా మంది వ్రతం పూజలు చేయించుకోలేకపోయారు. నిన్న మొన్నటి వరకూ రైతులకు అప్పులు ఇచ్చేందుకు వడ్డీ వ్యాపారులు నానా అవస్థలు పెట్టేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో వ్యాపారులే నేరుగా రైతుల వద్దకు వెళ్లి మరీ అప్పులు ఇచ్చారు.
ఇక తనఖాలు, నిబంధనలు అంటూ సవాలక్ష కొర్రీలు పెట్టే వ్యాపారులు.. అటువంటి వేమీ లేకుండా వడ్డీ తక్కువైనా ఫర్వాలేదు ముందు అప్పు తీసుకోండి అంటూ రైతుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక మార్కెట్ యార్డుల్లో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన దళారులు, వ్యాపారులు డబ్బు చెల్లించేందుకు వారం, పది రోజులు గడువు విధించేవారు. కానీ బుధవారం మాత్రం అక్కడికక్కడే రైతులకు డబ్బు చెల్లించడమే కాక అదనంగా అప్పులు ఇచ్చేందుకు సైతం ముందుకు రావడం గమనార్హం.