కేంద్ర బడ్జెట్లో దుర్భిక్ష ‘అనంత’కు రిక్తహస్తం
‘ప్రాజెక్టు అనంత’ భవిత చిదంబర రహస్యమే
ఈసారైనా ఆర్మీ ఫైరింగ్ రేంజ్‌కు నిధులు ఇస్తారా!
బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో చోటేదీ?
సాక్షి ప్రతినిధి, అనంతపురం :
ఆడిన మాట తప్పడంలో తనది అందెవేసిన చేయి అని కేంద్రంలోని యూపీఏ సర్కారు మరోసారి నిరూపించుకుంది. దుర్భిక్ష ‘అనంత’లో సేద్యాన్ని గాడిన పెట్టేందుకు ‘ప్రాజెక్టు అనంత’కు నిధులు కేటాయిస్తామని భరోసా ఇచ్చిన కేంద్రం ఇప్పుడు కాడి దించింది. బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో జిల్లాకు చోటు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు చేతులెత్తేసింది. ఏడేళ్ల నుంచి ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుపై ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లిబుచ్చుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోన్న 11 గ్రామాల రైతులకు ఈసారి కూడా భరోసా ఇవ్వలేకపోయింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సోమవారం లోక్‌సభలో ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రగతిపై చూపిన ప్రభావం ఇదీ..!
తెలుగు జాతిలో విభజన చిచ్చు పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం.. దుర్భిక్ష ‘అనంత’ను మరోసారి వంచించారు. జిల్లాలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న సేద్యాన్ని లాభాల బాట పట్టించేందుకు ఉద్దేశించిన ‘ప్రాజెక్టు అనంత’ ఒట్టి ఎన్నికల నినాదమేనని చిదంబరం చెప్పకనే చెప్పారు. ‘ప్రాజెక్టు అనంత’ అమలుకు రూ.7,676 కోట్లు అవసరం. అందులో రూ.4,387 కోట్లు వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మనీటిపారుదల, పశుసంవర్ధక, పట్టు, మత్స్యశాఖలకు శాఖాపరంగా ఐదేళ్లలో మంజూరవుతాయని అధికారులు లెక్క కట్టారు. తక్కిన రూ.3,282 కోట్లను కేంద్రం కేటాయించేలా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అహ్లూవాలియాను రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి నేతృత్వంలోని జిల్లా ప్రతినిధి బృందం ఆర్నెల్ల క్రితం కలిసింది. ‘ప్రాజెక్టు అనంత’కు అవసరమైన నిధులను కేటాయిస్తామని ఇద్దరూ భరోసా ఇచ్చారు. కానీ.. సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం ఒక్క పైసా కూడా కేటాయించలేదు.
కరువుకు విరుగుడేదీ..?
చౌక ధరలకే భూమి లభించడం.. అపారమైన ఖనిజ వనరులు.. మానవ వనరులు.. ఉపరితల రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉండటం.. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండటం వల్ల పరిశ్రమల స్థాపనకు జిల్లా అత్యంత అనుకూలమని కేంద్రం తేల్చింది. బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో జిల్లాకు చోటు కల్పిస్తామని.. తద్వారా కరువుకు పరిష్కారం చూపిస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియా పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో కుద్రేముఖ్- ఏపీఎండీసీ సంయుక్త భాగస్వామ్యంతో ఇనుప పిల్లెట్ల పరిశ్రమ చేపట్టాలన్న ప్రతిపాదన సందర్భంలో కూడా మాంటెక్‌సింగ్ గతంలో ఇచ్చిన హామీనే మరో మారు పునరుద్ఘాటించారు. కానీ.. సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో జిల్లాకు చోటు కల్పించలేదు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బీడీఎల్(భారత్ దైనిక్స్ లిమిటెడ్), హెచ్‌ఏఎల్(హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్), ఈసీఐఎల్(ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), బీఈఎల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్)లు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయి. కానీ.. వాటి ప్రస్తావన కూడా బడ్జెట్లో కన్పించలేదు. ఇది జిల్లా పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతంగా మారింది. ఉపాధి అవకాశాలకు కేంద్రం మోకాలడ్డినట్లయింది.
న్యాయం జరిగేనా..?:
కంబదూరు-కనగానపల్లి మండలాల సరిహద్దులో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుచేయాలని 2008లో కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది. కంబదూరు, కనగానపల్లి మండలాల్లోని కర్తనపర్తి, నూతిమడుగు, చెన్నేపల్లి, రాళ్ల అనంతపురం, రామోజీనాయక్ తండా, తిప్పేపల్లి, ఐపాసుపల్లి, గూళ్యం, మద్దెలచెర్వు, మద్దెలచెర్వు తండాల్లో 17,850 ఎకరాల భూమి అవసరమని తేల్చింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
కానీ.. ఇప్పటిదాకా భూసేకరణ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూముల క్రయవిక్రయాలపై నిషేధం విధించడం వల్ల ఆ గ్రామాల్లో రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. చివరకు పంట రుణాలు కూడా ఇవ్వడం లేదు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుచేస్తారా.. నోటిఫికేషన్ రద్దు చేస్తారా అంటూ ఆ గ్రామాల రైతులు ఆందోళనలు చేసినా కేంద్రానికి పట్టలేదు. నాలుగు నెలల క్రితం ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర రక్షణ శాఖ.. కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్‌ను ఆదేశించింది. ఆయన పంపిన ప్రతిపాదనలపై రక్షణశాఖ ఆమోదముద్ర వేసిందీ లేనిదీ బడ్జెట్లో స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
నిధుల్లోనూ కోత..
ఉపాధి హామీ పథకానికి గాను 2014-15 బడ్జెట్లో రూ.644 కోట్లు విడుదల చేయాలని జిల్లా అధికార యంత్రాంగం కేంద్రానికి నివేదిక పంపింది. కానీ.. ఆ మేరకు నిధులు విడుదలయ్యే అవకాశం లేదు. కనీసం రూ.350 కోట్ల మేర కూడా దక్కే అవకాశాల్లేవని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజీవ్ విద్యామిషన్ కింద జిల్లాకు రూ.442 కోట్ల మేర 2014-15 బడ్జెట్టో కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ.. ఇందులో రూ.250 కోట్లకు మించి నిధులు విడుదలయ్యే అవకాశం లేదని అధికారులు లెక్కలు వేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుకూ.. ఆధార్‌తో ముడిపెట్టవద్దని సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కేంద్రం చెవికెక్కించుకోలేదు.
గ్యాస్ రాయితీతోపాటు వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు, ఉపాధి హామీ వేతనాలు, విత్తన రాయితీ వంటి 26 సంక్షేమ పథకాలకు ఆధార్ ద్వారా నగదు బదిలీని వర్తింపజేస్తామని స్పష్టీకరించింది. ఇందుకు మన జిల్లానే ప్రయోగశాలగా ఎంచుకోవడం గమనార్హం.
అంతా ఉత్తుత్తే!
Published Tue, Feb 18 2014 3:16 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement