ప్రభుత్వాధికారులకు మోదీ సూచన
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని, పౌర కేంద్రీకృత విధానాలను అనుసరించాలని ప్రధాని మోదీ అధికారులను కోరారు. ఇందుకు మిషన్ కర్మయోగి ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్పారు. కొత్తకొత్త ఆలోచనల కోసం స్టార్టప్‌లు, పరిశోధన విభాగాలు, యువత నుంచి సలహాలను స్వీకరించాలని సూచించారు. శనివారం ప్రధాని మోదీ డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నేషనల్ లెర్నింగ్ వీక్(కర్మయోగి సప్తాహ్)ను ప్రారంభించి, అధికారులనుద్దేశించి మాట్లాడారు.
కృత్రిమ మేధ(ఏఐ)తో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మరింత సులువుగా మారుతుందంటూ ఆయన..పౌరులకు సమాచారం అందించడంతోపాటు ప్రభుత్వ కార్యకలాపాలన్నింటిపై నిఘాకు ఏఐతో వీలు కలుగుతుందన్నారు. అధికారులు వినూత్న ఆలోచనలు కలిగి ఉండాలన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే యంత్రాంగం అన్ని స్థాయిల్లోనూ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగుల సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా 2020లో మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది.
నారీ శక్తి ఆశీర్వాదమే స్ఫూర్తి
మహిళల ఆశీర్వచనాలే తనకు దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు ప్రేరణను అందిస్తాయని మోదీ పేర్కొన్నారు. ‘మోదీకి కృతజ్ఞతగా అందజేయా’లంటూ ఓ గిరిజన మహిళ పట్టుబట్టి మరీ తనకు రూ.100 ఇచ్చారంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా శనివారం ‘ఎక్స్’లో షేర్ చేసిన ఫొటోలపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇది నా హృదయాన్ని కదిలించింది. నన్ను సదా ఆశీర్వదించే నారీ శక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారి ఆశీస్సులే నాకు నిత్యం ప్రేరణగా నిలుస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
నేడు వారణాసికి ప్రధాని మోదీ
ప్రధాని ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు. శంకర నేత్రాలయం సహా రూ.6,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment