ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు
యువతకు ప్రోత్సాహకరంగా ప్రభుత్వ విధానాలని వెల్లడి
రాష్ట్రీయ బాల్ పురస్కార్ గ్రహీతలతో ప్రధాని ముచ్చట
న్యూఢిల్లీ: దేశ పురోగతిలో యువత ఎంతో కీలకభూమిక పోషించాల్సి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు మారుతుతున్న కృత్రిమ మేధ(ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికత నైపుణ్యంతో వారిని సన్నద్ధం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. వివిధ రంగాల్లో వేగంగా సంభవించే మార్పులు, సవాళ్లకు అనుగుణంగా యువత మారాల్సిన అవసరముందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ విధానాల్లో యువతకు ఇస్తున్న ప్రాధాన్యం, నూతన విద్యా విధానానికి అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. సర్వజన శ్రేయస్సు అనే మన పూర్వీకుల బోధనలకు అనుగుణంగానే రాజ్యాంగం మనకు సమానత్వ ఆవశ్యతను తెలియజేస్తోందన్నారు. మన దేశంలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే బేధం లేదు. రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానులేనని స్పష్టం చేశారు. గురు గోవింద్ సింగ్ కుమారులు ‘సాహిబ్‌జాదాస్’ప్రాణత్యాగం చేసిన వీర్ బాల్ దివస్ సందర్భంగా గురువారం ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
సాహిబ్‌జాదాస్ నుంచి ప్రేరణ
దేశం కోసం మనం చేసే ప్రతి పనీ సాహసమే. మొఘల్ చక్రవర్తి అణచివేతకు లొంగడం కంటే ధైర్యం, ఆత్మగౌరవంతో పోరాటమే మేలని సాహిబ్‌జాదాస్ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. విపత్కర పరిస్థితులెన్ని ఎదురైనా దేశం కంటే మిన్న మరేదీ లేదని వారు మనకు తెలియజెప్పారు. 300 ఏళ్ల క్రితం ఇదే డిసెంబర్ 26వ తేదీన ఎంతో చిన్న వాళ్లయిన సాహిబ్‌జాదాస్, మొక్కవోని ధైర్యసాహసాలను, త్యాగనిరతిని ప్రదర్శించారు. మొఘల్ పాలకులు ఎన్ని ప్రలోభాలు చూపినా లొంగలేదు. తీవ్రమైన హింసను భరించారు. వారి దృష్టిలో దేశమే అత్యున్నతం. వారి వారసత్వం నుంచి మనం ప్రేరణ పొందాలి. సాహిబ్‌జాదాస్ వంటి వారి త్యాగాలు, ధైర్య సాహసాలపైనే భారత ప్రజాస్వామ్య సౌధం దృఢంగా నిర్మితమైంది.
యువత రాజకీయాల్లోకి రావాలి
దేశం మరింత ఐకమత్యంగా ముందుకు సాగేందుకు ధైర్యం, సేవానిరతిని కలిగి ఆవిష్కరణలపై దృష్టి సారించాలి. దేశంలో రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన లక్ష మంది యువత రాజకీయాల్లో ప్రవేశించాలి. దీనిద్వారా వచ్చే 25 ఏళ్లలో కొత్త తరానికి రాజకీయాలను పరిచయం చేయాలన్నదే నా ఉద్దేశం. వచ్చే ఏడాది స్వామి వివేకానందుని జయంతి నాడు ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ను నిర్వహిస్తాంచనున్నాం. దేశంలోని గ్రామాలు, పట్టణణాలు, నగరాలకు చెందిన యువత పాల్గొని అభివృద్ధి చెందిన భారత్ అనే విజన్‌కు రోడ్‌మ్యాప్‌పై జరిగే చర్చలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ గ్రహీతలతో ముచ్చటించారు. విజేతలైన 17 మందికి ప్రధాని అభినందనలు తెలిపారు. భారతీయ యువత ఏదైనా సాధించగలదని వీరు నిరూపించి చూపారని ప్రశంసించారు. కళలు, సంస్కృతి, సాహసం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు, పర్యావరణ, ఆవిష్కరణ రంగాల్లో అసాధారణ కృషి చేసినందుకు వీరిని బాల్ పురస్కార్‌కు ఎంపిక చేశారు. అదేవిధంగా, చురుకైన కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా పోషకాహార ఫలితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ‘సుపోషిత్ గ్రామ్ పంచాయత్ అభియాన్’అనే దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఇది ఏఐ యుగం
ఇది యంత్ర యుగం కాదు, అంతకు మించి మెషీన్ లెర్నింగ్ యుగం. కృత్రిమ మేథ(ఏఐ) ఇప్పుడు అన్నిటికీ కేంద్రంగా మారింది. సంప్రదాయ సాఫ్ట్‌వేర్ స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుండటం మనమిప్పుడు చూస్తున్నాం. మున్ముందు ఎదురయ్యే ఇటువంటి సవాళ్లకు మన యువతను సన్నద్ధం చేయాల్సిన అవసరముంది. రైల్వేలు..సెమీ కండక్టర్లు..ట్రావెల్, ఆ్రస్టానమీ..ఇలా రంగమేదైనా యువత తమకు నచ్చిన అంశంపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. సైన్స్, క్రీడల నుంచి వ్యాపార రంగం వరకు స్టార్టప్‌లతో నూతన పరివర్తన శకం మొదలైంది. యువతకు మరింత చేయూతనిచ్చేలా మన విధానాలు రూపొందాయి. స్టార్టప్ అనుకూల విధానాలు, అంతరిక్ష ఆర్థిక రంగం, క్రీడలు, ఫిట్‌నెస్..ఇలా ప్రతిదీ యువతకు లాభం కలిగించేవే.
Comments
Please login to add a commentAdd a comment