ఆధునిక యుగంలో సర్వం ప్లాస్టిక్‌మయం.. మనం తీసుకొనే ఆహారం కూడా ఇందుకు మినహాయింపు కాదు. కంటికి కనిపించిన సూక్ష్మ రూపంలో ప్లాస్టిక్ రేణువులు ఆహారంలో చేరుతున్న సంగతి తెలిసిందే అయినా ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నాయని తేలడం ఆందోళన కలిగిస్తోంది.
ఆహారంలో ప్లాస్టిక్ పరిమాణంపై ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఒక అధ్యయనం నిర్వహించింది. సూపర్ మార్కెట్లలో లభ్యమయ్యే రెడీమేడ్ ఆహారంతోపాటు ఫాస్ట్‌ఫుడ్‌ను ప్రయోగశాలలో క్షుణ్నంగా పరీక్షించింది. ఆహార తయారీ సమయంలోనే అందులో ప్లాస్టిక్ కలుస్తున్నట్లు గుర్తించింది...
► ఫాస్ట్‌ఫుడ్స్‌తోపాటు సూపర్ మార్కెట్లలో లభించే 85 రకాల ఆహార పదార్థాలను పరీక్షించగా, 84 పదార్థాల్లో ఫ్తాలేట్స్ అనే ప్లాస్టిక్ రసాయనం ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్లాస్టిక్ ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి ఈ కెమికల్‌ను ఉపయోగిస్తుంటారు. పోలార్ సెల్ట్‌జెర్ కంపెనీ తయారు చేసిన రాస్‌బెర్రీ లైమ్ అనే పండ్ల రసంలో ప్లాస్టిక్ లేదని తేలింది.
► తాము పరీక్షించిన వాటిలో 79 శాతం ఆహార నమూనాల్లో బైస్ఫెనాల్–ఏ(బీపీఏ) అనే మరో ప్లాస్టిక్ రసాయనం ఉన్నట్లు తేలిందని ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ ప్రకటించింది. కానీ, 2009 నాటితో పోలిస్తే ఇప్పుడు ఆహార పదార్థాల్లో ఈ కెమికల్ పరిమాణం తక్కువే ఉన్నట్లు వెల్లడించింది.
► ఆహారంలో ఫ్తాలేట్స్ స్థాయి ఎంతవరకు ఉంటే క్షేమం అనేదానిపై సైంటిస్టులు ప్రమాణాలేవీ నిర్దేశించలేదు. అవి ఎంత తక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ముప్పేనని చెబుతున్నారు.
► ఫ్తాలేట్స్, బైస్ఫెనాల్స్ శరీరంలో ఈస్ట్రోజెన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణను అస్తవ్యస్తం చేస్తాయి.
► ఇలాంటి రసాయనాలు కలిసిన ఆహారం తీసుకుంటే పుట్టుక లోపాలు, క్యాన్సర్, మధుమేహం, వంధ్యత్వం, స్థూలకాయం, నరాల సంబంధిత వ్యాధులతో పాటు పలు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
► చీరియోస్, గెర్బర్ బేబీ ఫుడ్, యోప్లాయిట్ యోగర్ట్‌తోపాటు వెండీస్, బర్గర్ కింగ్, మెక్ డొనాల్డ్స్ వంటి ప్రఖ్యాత కంపెనీల బర్గర్లు, చికెన్ నగ్గెట్స్, ఫ్రైలలో ఫ్తాలేట్స్, బైస్ఫెనాల్స్ ఉన్నట్లు గుర్తించారు.
► ఆహారంలో ప్లాస్టిక్‌ల నియంత్రణ కోసం ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టాలని, నిబంధనలను కఠినతరం చేయాలని ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ ప్రతినిధి జేమ్స్ రోజర్స్ సూచించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment